Shai Hope Record: శనివారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ 48 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అంతకుముందు సిరీస్‌లో తొలి వన్డే వర్షం కారణంగా రద్దు అయింది. దీంతో వెస్టిండీస్‌ జట్టు సిరీస్‌లో 1-0తో ముందంజ వేసింది.


అయితే ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్ భారీ రికార్డు సృష్టించాడు. నిజానికి వెస్టిండీస్ కెప్టెన్‌గా షాయ్ హోప్‌కి ఇది మొదటి వన్డే మ్యాచ్. ఈ మ్యాచ్‌లో షాయ్ హోప్ అద్భుత సెంచరీతో రాణించాడు. వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్ 115 బంతుల్లో 128 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అతని ఇన్నింగ్స్‌లో ఐదు ఫోర్లు, ఏడు సిక్సర్లు బాదాడు. షాయ్ హోప్ అద్భుత ఇన్నింగ్స్ కారణంగా వెస్టిండీస్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 335 పరుగులు చేసింది.


ఏబీ డివిలియర్స్ రికార్డును బద్దలు కొట్టిన షాయ్ హోప్
వన్డే క్రికెట్‌లో వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్‌కి ఇది 14వ సెంచరీ కాగా, ఈ ఆటగాడు విదేశీ గడ్డపై 10వ సారి సెంచరీ మార్కును దాటాడు. ఇప్పుడు వన్డే ఫార్మాట్‌లో విదేశీ గడ్డపై అతి తక్కువ మ్యాచ్‌ల్లో 10 సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్‌గా షాయ్ హోప్ నిలిచాడు. కేవలం 37 వన్డే ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించాడు.


గతంలో ఈ రికార్డు దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ పేరిట ఉండేది. ఏబీ డివిలియర్స్ విదేశీ గడ్డపై 64 ఇన్నింగ్స్‌లలో 10 సెంచరీలు సాధించాడు. కానీ ఇప్పుడు షాయ్ హోప్ ఈ మాజీ ఆటగాడిని వెనక్కి నెట్టి రికార్డును తన పేరిట రాసుకున్నాడు.


విరాట్ కోహ్లీ మూడో స్థానంలో... రోహిత్ శర్మ నాలుగో స్థానంలో...
ఈ జాబితాలో భారత వెటరన్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ మూడో స్థానంలో ఉన్నాడు. విరాట్ కోహ్లీ విదేశీ గడ్డపై 67 ఇన్నింగ్స్‌ల్లో 10 సెంచరీలు సాధించాడు. ఈ జాబితాలో భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఐదో స్థానంలో ఉన్నాడు. రోహిత్ శర్మ విదేశీ గడ్డపై 100 మ్యాచ్‌ల్లో 10 సెంచరీలు చేశాడు.


అయితే వెస్టిండీస్, దక్షిణాఫ్రికా మ్యాచ్‌లో టెంబా బావుమా సెంచరీ చేసినప్పటికీ దక్షిణాఫ్రికా జట్టు 41.4 ఓవర్లలో 287 పరుగులకే కుప్పకూలింది. దీంతో వెస్టిండీస్‌ ఈ మ్యాచ్‌లో విజయం సాధించింది. వెస్టిండీస్‌లో అల్జారీ జోసెఫ్, అకీల్ హొస్సేన్ చెరో మూడు వికెట్లు తీశారు.


ఇక ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో భారత్‌కు ఘోర పరాజయం ఎదురైంది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 26 ఓవర్లలో 117 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం ఆస్ట్రేలియా కేవలం 11 ఓవర్లలోనే వికెట్ కూడా కోల్పోకుండా లక్ష్యాన్ని ఛేదించింది. ఆస్ట్రేలియా ఓపెనర్లు ట్రావిస్ హెడ్ (51 నాటౌట్: 30 బంతుల్లో, 10 ఫోర్లు), మిషెల్ మార్ష్ (66 నాటౌట్: 36 బంతుల్లో, ఆరు ఫోర్లు, ఆరు సిక్సర్లు) అర్థ సెంచరీలు సాధించారు. ఈ విజయంతో ఆస్ట్రేలియా మూడు వన్డేల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. మూడో వన్డేలో విజయం సాధించిన జట్టు సిరీస్‌ను కైవసం చేసుకోనుంది. ఐదు వికెట్లు తీసుకున్న ఆస్ట్రేలియా బౌలర్ మిషెల్ స్టార్క్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.