అంతరిక్షంలో ఒలింపిక్సా? అదేంటి... అక్కడ ఎలా ఆడతారు? అనే కదా మీ సందేహం. యావత్తు ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన విశ్వ క్రీడలు ఒలింపిక్స్ తాజాగా ముగిశాయి. కరోనా మహమ్మారి కారణంగా గత ఏడాది జరగాల్సిన ఒలింపిక్స్... ఈ ఏడాది జరిగాయి. ప్రేక్షకులు లేకుండా, ప్రారంభోత్సవం, ముగింపు కార్యక్రమాలు కూడా సాదాసీదాగా ముగిశాయి. ఈ టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ 7 పతకాలు సాధించింది. అందులో ఒక స్వర్ణం కూడా ఉంది. వందేళ్ల భారతీయుల నిరీక్షణకు తెరదించుతూ నీరజ్ చోప్రా ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో పతకం సాధించాడు. 



తాజాగా ‘స్పేస్ ఒలింపిక్స్’ వార్త  వైరల్‌గా మారింది. అవును... అంతరిక్షంలో ఒలింపిక్స్ నిర్వహించారు. వినడానికి వింతగా ఉన్నా... ఇది నిజం. ఒలింపిక్స్‌కి ఉన్న క్రేజ్ అంత మరి. స్పేస్ ఒలింపిక్స్ పేరిట అంతరిక్షంలోనూ పోటీలను నిర్వహించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన వాళ్లు ఈ గేమ్స్ చాలా ఫన్నీగా ఉన్నాయంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ గేమ్స్ పై ఓ లుక్కేయండి. 







అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ISS)లోని వ్యోమగాములు జట్లుగా విడిపోయి ఆటలు ఆడారు. వారి ఆటలు చూస్తుంటే నవ్వులే నవ్వులు.  జిమ్నాస్టిక్స్‌, స్విమ్మింగ్, నో హ్యాండ్‌ బాల్‌, వెయిట్‌లెస్‌ షార్ప్‌ షూటింగ్‌ ఆడి చక్కటి ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. జపనీస్‌ వ్యోమగామి అకిహికో హోషైడ్‌, ఫ్రెంచ్‌ వ్యోమగామి థామస్‌ వీటిని నిర్వహించారు. జీరోగ్రావిటీలోనూ తామేమీ తీసిపోమంటూ నిరూపించారు. చివర్లో వీడ్కోలు వేడుకలూ కూడా అంతే ఉత్సాహంగా నిర్వహించడం మరో విశేషం.







ఆస్ట్రొనాట్ల ఆటలు ఎంతో సరదాగా సాగాయి. ఈ ఆటలకు సంబంధించిన వీడియోలను థామస్ ట్విటర్ ద్వారా పంచుకున్నారు. నెట్టింట్లో ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తక్కువ సమయంలోనే ఎన్నో వ్యూస్... మరెన్నో లైక్స్ వచ్చాయి.