లార్డ్స్ వేదికగా భారత్ X ఇంగ్లాండ్ మధ్య జరుగుతోన్న రెండో టెస్టు రోజు రోజుకీ మరింత ఆసక్తికరంగా సాగుతోంది. మ్యాచ్‌లో చివరి రోజైన సోమవారం 181/6తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించింది. ఆరంభంలోనే పంత్ (22: 46 బంతుల్లో 1x4), ఇషాంత్ శర్మ (16: 24 బంతుల్లో 2x4) వికెట్లు చేజార్చుకుంది. దీంతో భారత జట్టు ఆలౌట్ అవుతుందని అనుకున్నారు అంతా. 






కానీ.. ఎవరూ ఊహించని విధంగా ఇంగ్లాండ్ బౌలర్లపై బుమ్రా, షమి అద్భుత ప్రదర్శన చేశాడు. ఈ క్రమంలో వారి ఏకాగ్రతను దెబ్బ తీసేందుకు ఇంగ్లాండ్ పేసర్ మార్క్‌వుడ్ తన నోటికి చెప్పాడు. అయితే.. అతని బౌలింగ్‌లోనే బుమ్రా కళ్లు చెదిరే బౌండరీ బాదాడు. ఆ ఓవర్ ముగిసిన తర్వాత నాన్‌స్ట్రైక్ ఎండ్‌లోకి బుమ్రా వెళ్లగా... మరోసారి మార్క్‌వుడ్ మాటలు జారాడు. దీంతో బుమ్రా కూడా ఎదురుదాడికి దిగాడు. 






బుమ్రా, మార్క్‌వుడ్ మధ్య మాటల దాడి పెరగడంతో.. ఫీల్డ్ అంపైర్లు కలగజేసుకున్నారు. బుమ్రాకి సర్ది చెప్పారు. అదే సమయంలో వీరిద్దరి మధ్యలోకి వచ్చిన జోస్ బట్లర్.. బుమ్రాతో వాగ్వాదానికి దిగాడు. ఆ తర్వాత మళ్లీ బౌలింగ్‌కి వచ్చిన మార్క్‌వుడ్.. షార్ట్ పిచ్ బంతులతో బుమ్రాని పరీక్షించాడు. బుమ్రా కూడా బదులిచ్చేందుకు భారీ షాట్‌లు ఆడే ప్రయత్నం చేశాడు. బుమ్రా హిట్టింగ్‌ని డ్రెస్సింగ్ రూము నుంచి చూస్తూ కోహ్లీ బాగా ఎంజాయ్ చేశాడు. పలు సార్లు నవ్వుతూ కెమెరా కంటికి చిక్కాడు. 






బుమ్రా, షమీ జోడీ 9వ వికెట్‌కి అజేయంగా 120 బంతుల్లో 89 పరుగులు చేశారు. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 364. రెండో ఇన్నింగ్స్‌లో 298/8 వద్ద డిక్లేర్ చేసింది. మరో పక్క ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 391 పరుగుల వద్ద ఆలౌటైంది.