Virat Kohli 100th Test: టీమ్ఇండియా మాజీ సారథి విరాట్‌ కోహ్లీ (Virat Kohli) అరుదైన రికార్డు నెలకొల్పేందుకు సిద్ధమయ్యాడు. వంద టెస్టులు ఆడిన 12వ భారత క్రికెటర్‌గా అవతరించనున్నాడు. మొహాలి వేదికగా లంకతో జరిగే టెస్టు అతడి కెరీర్లో వందోది. అసలీ మైలురాయిని చేరుకుంటానని అస్సలు అనుకోలేదని విరాట్‌ అంటున్నాడు. అతడు మాట్లాడిన వీడియోను బీసీసీఐ పోస్టు చేసింది.


'వంద టెస్టులు ఆడతానని అస్సలు అనుకోలేదు. ఇదో సుదీర్ఘ ప్రయాణం. ఆ వంద టెస్టుల మైల్‌స్టోన్‌ కోసం మేమెంతో క్రికెట్‌ ఆడాం. ఎంతో అంతర్జాతీయ క్రికెట్‌ ఆడాను. వందో టెస్టు ఆడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. కృతజ్ఞతా భావంతో ఉన్నాను. దేవుడు నాపై దయ చూపించాడు. నా ఫిట్‌నెస్‌ కోసం ఎంతో శ్రమించాను. ఇది నాకు, నా కుటుంబానికి, నా కోచ్‌కు అత్యంత గొప్ప సందర్భం. ఇందుకు వారెంతో సంతోషిస్తారు. గర్వపడతారు' అని విరాట్‌ అన్నాడు.


ఇప్పటి వరకు టీమ్‌ఇండియా తరఫున 11 మంది వంద టెస్టులు ఆడారు. సునిల్‌ గావస్కర్‌, దిలీప్‌ వెంగ్‌సర్కార్‌, కపిల్‌ దేవ్‌, సచిన్‌ తెందూల్కర్‌, అనిల్‌ కుంబ్లే, రాహుల్‌ ద్రవిడ్‌, సౌరవ్‌ గంగూలీ, వీవీఎస్‌ లక్ష్మణ్, వీరేంద్ర సెహ్వాగ్‌, హర్భజన్‌ సింగ్‌, ఇషాంత్ శర్మ ఈ రికార్డు సృష్టించారు.


విరాట్‌ కోహ్లీ 2011లో వెస్టిండీస్‌పై టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. రెండు ఇన్నింగ్సుల్లో వరుసగా 4, 15 పరుగులు చేశాడు. ఆ తర్వాత అతడి బ్యాటు నుంచి పరుగుల వరద పారింది. 50.39 సగటుతో 7,962 పరుగులు చేశాడు. వందో టెస్టు ఆడుతున్న విరాట్‌కు మాజీ క్రికెటర్లు అభినందనలు తెలియజేశారు.


'ఇన్నేళ్లూ నీ ఆటను చూస్తుండటం ఆనందంగా ఉంది. గణాంకాలు వాటి పాత్రను అవి పోషిస్తాయి. కానీ మొత్తం ఒక తరాన్ని మోటివేట్‌ చేయడమే నీ అసలైన బలం' అని సచిన్‌ తెందూల్కర్‌ అన్నాడు. 'ఇండియన్ క్రికెట్‌కు నువ్వెంతో సేవ చేశావు. దానినే నేను అసలైన విజయం అంటాను. నువ్వు ఇంకా చాలా కాలం క్రికెట్‌ ఆడాలి. రాణించాలి' అని పేర్కొన్నాడు.