Vinod kambli Financial Situation: టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ వినోద్‌ కాంబ్లీ (Vindo Kambli) తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నాడు. తన కుటుంబాన్ని పోషించుకొనేందుకు పనిప్పించాలని వేడుకుంటున్నాడు. బీసీసీఐ అందించే పింఛనుతోనే కాలం వెల్లదీస్తున్నట్టు చెబుతున్నాడు. తన మిత్రుడు సచిన్‌ తెందూల్కర్‌కు తన పరిస్థితి తెలుసన్నాడు. అన్నిటికీ అతడి నుంచే సాయం కోరలేనని చెబుతున్నాడు.


భారత క్రికెట్లో వినోద్‌ కాంబ్లీ ఓ వెలుగు వెలుగుతాడని అంతా భావించారు. సచిన్‌ కన్నా ఎక్కువ ప్రతిభావంతుడు కావడంతో అతడిపై నమ్మకం ఉంచారు. అతి విశ్వాసం, నిర్లక్ష్యం, చెడు అలవాట్ల వల్ల అతడు మధ్యలోనే కెరీర్‌ వదిలేయాల్సిన పరిస్థితి తెచ్చుకున్నాడు. 2019 ముంబయి టీ20 లీగులో కాంబ్లీ ఓ జట్టుకు మెంటార్‌గా పనిచేశాడు. కొవిడ్‌ మహమ్మారితో రెండేళ్లు పని దొరకలేదు. ప్రస్తుతం బీసీసీఐ చెల్లించే రూ.30,000 పింఛను మీదే బతుకుతున్నాడు.


'సచిన్‌కు అంతా తెలుసు. కానీ అతడి నుంచి నేనేమీ ఆశించడం లేదు. తెందుల్కర్‌ మిడిలెక్స్‌ అకాడమీ బాధ్యతలు నాకప్పగించాడు. అందుకు సంతోషం. కష్టకాలంలో ఎప్పుడూ నా వెన్నంటే ఉన్నాడు. సుదూర ప్రయాణించాల్సి రావడంతో నేనే ఆ పని మానేశాను' అని కాంబ్లీ వెల్లడించాడు.


'డీవై పాటిల్‌ స్టేడియం వెళ్లేందుకు నేను ఉదయం 5 గంటలకే కార్లో ప్రయాణించాలి. విపరీతంగా శ్రమించాల్సి వస్తోంది. మళ్లీ సాయంత్రం బీకేసీ మైదానంలో కోచింగ్‌కు వెళ్లాలి. నేను వీడ్కోలు పలికిన క్రికెటర్‌ను. బీసీసీఐ పింఛను మీదే ఆధారపడ్డాను. బోర్డు మాత్రమే నాకిప్పుడు ఆదాయ వనరు. అందుకు ధన్యవాదాలు. దాంతో నా కుటుంబాన్ని పోషించుకుంటున్నాను' అని కాంబ్లీ అన్నాడు.


'ముంబయి క్రికెట్‌ సంఘం సాయం కోరాను. సీఐసీ కమిటీలో ఉన్నాను. అది గౌరవ పదవి కావడంతో డబ్బు రాదు. నా కుటుంబాన్ని చూసుకోవాలి. నా అవసరం ఉంటే కచ్చితంగా పిలవండి అని ఎంసీఏకు చాలాసార్లు చెప్పాను. వాంఖడే, బీకేసీ ఎక్కడైనా పని చేస్తాను. ముంబయి క్రికెట్‌ నాకెంతో ఇచ్చింది. ఆటకు నేను రుణపడ్డాను. వీడ్కోలు పలికిన తర్వాత ఆడలేం. ఆ తర్వాత బతకడానికి పని కావాలి. అందుకే ఎంసీఏ వైపు చూస్తున్నాను. ఎంసీఏ అధ్యక్షుడు విజయ్‌ పాటిల్‌, కార్యదర్శి సంజయ్‌ నాయక్‌ను పని కోసం వేడుకుంటున్నాను' అని కాంబ్లీ తెలిపాడు.


చిన్న వయసులో జట్టుకు దూరం..


కెరీర్‌లో 104 వన్డేలాడిన కాంబ్లీ  2 సెంచరీలు, 14 అర్ధ సెంచరీల సాయంతో 2477 పరుగులు సాధించాడు. కేవలం 28 ఏళ్ల వయసులో టీమిండియా జట్టులో చోటు కోల్పోయాడు. ఆ తర్వాత రెండు సినిమా నిర్మాణ సంస్థలను ప్రారంభించి సినిమా ఇండస్ట్రీలో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాడు. ముంబైలో ఈ లోక్‌భారతి పార్టీ ఉపాధ్యక్షుడిగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 2009 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయగా ఓటమిపాలయ్యారు. 2010లో మోడల్ ఆండ్రియా హెవిట్‌ని వివాహం చేసుకుని ఓ ఇంటివాడయ్యాడు. ఆటపై అతడు ఫోకస్ చేసి ఉంటే కచ్చితంగా మళ్లీ టీమిండియాకు ఆడేవాడని మాజీ క్రికెటర్లు, కోచ్ రమాకాంత్ ఆచ్రేకర్ పలు సందర్భాలలో చెప్పేవారు.