UPW Vs GG, WPL 2023: యూపీ వారియర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. కెప్టెన్ బెత్ మూనీ శనివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయపడటంతో స్నేహ్ రాణా ఈ మ్యాచ్‌కు కెప్టెన్సీ వహించనుంది. మహిళల ప్రీమియర్ లీగ్‌లో ఇప్పటివరకు జరిగిన రెండు మ్యాచ్‌ల్లో మొదట బ్యాటింగ్ చేసిన జట్లు భారీ స్కోరు సాధించడంతో పాటు ఘన విజయాలను కూడా సాధించాయి.


యూపీ వారియర్జ్ (ప్లేయింగ్ XI)
అలిస్సా హీలీ(కెప్టెన్, వికెట్ కీపర్), శ్వేతా సెహ్రావత్, తహ్లియా మెక్‌గ్రాత్, దీప్తి శర్మ, గ్రేస్ హారిస్, సిమ్రాన్ షేక్, కిరణ్ నవ్‌గిరే, దేవికా వైద్య, సోఫీ ఎక్లెస్టోన్, అంజలి సర్వాణి, రాజేశ్వరి గయక్వాడ్


గుజరాత్ జెయింట్స్ (ప్లేయింగ్ XI)
సబ్బినేని మేఘన, హర్లీన్ డియోల్, ఆష్లీ గార్డనర్, సోఫియా డంక్లీ, అన్నాబెల్ సదర్లాండ్, కిమ్ గార్త్, సుష్మా వర్మ(వికెట్ కీపర్), దయాళన్ హేమలత, స్నేహ రాణా(కెప్టెన్), తనుజా కన్వర్, మాన్సీ జోషి




శనివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మొదటి మహిళల ప్రీమియర్ లీగ్‌ మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ మహిళల జట్టు 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. దీనికి సమాధానంగా గుజరాత్ జెయింట్స్ 15.1 ఓవర్లలో 64 పరుగులకే ఆలౌట్ అయ్యారు. ముంబై ఇన్నింగ్స్ తరఫున మెరుపు ఇన్నింగ్స్ ఆడిన కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (65: 30 బంతుల్లో, 14 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచింది. 


208 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ జెయింట్స్‌కు ఈ మ్యాచ్‌లో అస్సలు ఏదీ కలిసి రాలేదు. మొదటి ఓవర్లోనే కెప్టెన్, ఓపెనర్ బెత్ మూనీ (0: 3 బంతుల్లో) రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగింది. అదే ఓవర్లో వన్ డౌన్ బ్యాటర్ హర్లీన్ డియోల్ (0: 2 బంతుల్లో) కూడా అవుట్ అయింది. ఆ తర్వాత కూడా గుజరాత్ వికెట్లు కోల్పోతూనే ఉంది.


ఒక దశలో కేవలం 23 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయింది. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యల్ప స్కోరు సాధించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (49) రికార్డు బద్దలవుతుంది అనుకున్నారు. కానీ దయాళన్ హేమలత (29 నాటౌట్: 23 బంతుల్లో, ఒక ఫోర్, రెండు సిక్సర్లు) టెయిలెండర్లతో కలిసి పోరాడి ఆ అవమానాన్ని మాత్రం తప్పించగలిగింది. ఆఖర్లో టెయిలెండర్లు కూడా వరుసగా అవుట్ కావడంతో గుజరాత్ 15.1 ఓవర్లలో 64 పరుగులకే ఆలౌట్ అయింది. ముంబై బౌలర్లలో సైకా ఇషాక్ కేవలం 11 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు తీసుకుంది.


ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ముంబై ఇండియన్స్ మొదట బ్యాటింగ్‌కు దిగాల్సి వచ్చింది. అయితే ముంబైకి ఆశించిన ఆరంభం లభించలేదు. క్రీజులో ఉన్నంత సేపు ఇబ్బంది పడ్డ ఓపెనర్ యస్తిక భాటియా (1: 8 బంతుల్లో) మూడో ఓవర్లో అవుట్ అయింది.