40 ఏళ్ల టెన్నిస్ లెజెండ్, ఆల్ టైమ్ అత్యుత్తమ మహిళా క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆట నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించింది. ఈ సంవత్సరం యుఎస్ ఓపెన్ తర్వాత రిటైర్ అవుతున్నట్లు సంకేతాలు ఇచ్చింది. వోగ్ మ్యాగజైన్ సెప్టెంబరు ఎడిషన్ కవర్‌ పేజ్‌పై తన ఫొటోను ఇన్‌స్టాలో పోస్టు చేసి ఈ విషయాన్ని ప్రకటించారు. యూఎస్‌ ఓపెన్ ఆగస్టు 29న ప్రారంభం కానుంది. అది సెరెనా చివరి టోర్నీ కానుంది.


తన ఇన్‌స్టా పోస్ట్‌లో, ఆమె ఇలా రాసింది: జీవితంలో కొన్నిసార్లు వైవిధ్యమైన దారిలో వెళ్లాల్సి వస్తుంది. అప్పుడు ఇష్టమైన వాటిని వదులుకోవాల్సి ఉంటుంది. అది దశ చాలా కష్టమైంది. నేను టెన్నిస్‌ని చాలా ఆస్వాదిస్తున్నాను. అయితే ఇప్పుడు కౌంట్ డౌన్ మొదలైంది. నేను తల్లిగా ఉండటంపై దృష్టి పెట్టాలి. నాకు కొన్ని ఆధ్యాత్మిక లక్ష్యాలు ఉన్నాయి. నన్ను నేను కొత్తగా చూడాలనుకుంటున్నాను.  నేను ఈ రాబోయే కొన్ని వారాలు టెన్నీస్‌ను ఆనందించబోతున్నాను.. అని రాసుకొచ్చింది. 


1999లో తొలిసారి యూఎస్ ఓపెన్‌ను గెలుచుకున్నప్పటి నుంచి టెన్నిస్‌కు ఐకాన్‌గా మారిపోయింది సెరెనా. 23 గ్రాండ్‌స్లామ్ ఛాంపియన్‌షిప్‌‌లను గెలుచుకుంది. రిటైర్మెంట్‌ అనే పదం తనకు నచ్చదని చాలాసార్లు చెప్పేది సెరెనా. తాను టెన్నిస్‌కు దూరమైతే తన వ్యక్తిగత జీవితంపై పూర్తిగా ఫోకస్ చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలిపేది. తాను, తన భర్త అలెక్సీస్ ఒహానియన్ కలిసి మరో బిడ్డకు జన్మనివ్వాలని అనుకుంటున్నట్టు  పేర్కొంది. గర్భవతింగా ఉంటూనే సెరెనా విలియమ్స్ 2017లో చివరి గ్రాండ్‌స్లామ్‌ గెలుచుకుంది. మొన్నటి జూన్‌లో వింబుల్డన్ నుంచి తొలి రౌండ్‌లోనే తప్పుకుంది.






నేషనల్ బ్యాంక్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ తొలి రౌండ్‌లో నూరియా పారిజాస్ డియాజ్‌ను 6-3, 6-4 తేడాతో ఓడించి ఫ్రెంచ్ ఓపెన్ 2021 తర్వాత విలియమ్స్ సోమవారం తన తొలి విజయాన్ని నమోదు చేసింది. సెరెనా బుధవారం జరిగే మ్యాచ్‌లో 12వ సీడ్ బెలిండా బెన్సిక్ లేదా తెరెజా మార్టిన్‌కోవాతో తలపడనుంది. వచ్చే వారం, సెరెనా సిన్సినాటిలో వెస్ట్రన్ & సదరన్ ఓపెన్‌లో కూడా పాల్గొంటుంది, ఈ ఈవెంట్‌లో ఆమె 2014, 2015లో గెలిచింది.