Serena Williams Bids Adieu: ఆధునిక టెన్నిస్‌ దిగ్గజం, ఆల్‌టైం గ్రేట్ సెరెనా విలియమ్స్‌ తన కెరీర్‌ను దాదాపుగా ముగించింది!! యూఎస్‌ ఓపెన్‌ మూడో రౌండ్లో ఓటమితో గుడ్‌బై చెప్పేసింది. ఆస్ట్రేలియా అమ్మాయి అజ్లా టామ్‌లజనోవిచ్‌ చేతిలో 7-5, 6-7 (4/7), 6-1 తేడాతో పరాజయం పాలయ్యాక భావోద్వేగానికి గురైంది. కన్నీళ్లు కారుస్తూ మీడియాతో మాట్లాడింది. వీడ్కోలు నిర్ణయంపై యూ-టర్న్‌ తీసుకుంటారా అని ప్రశ్నించగా ఏమో తెలియదంటూ జవాబిచ్చింది. తన పునరాగమనంపై ఆశలు రేకెత్తించింది! తన తల్లిదండ్రులు, సోదరి వీనస్‌ విలియమ్స్‌, అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేసింది.


20 ఏళ్ల కెరీర్‌


సెరెనా విలియమ్స్‌ 1995లో టెన్నిస్‌లో అరంగేట్రం చేసింది. 1999లో యూఎస్ ఓపెన్‌తో తొలి మేజర్‌ టైటిల్‌ కైవసం చేసుకుంది. అప్పట్నుంచి 20 ఏళ్ల పాటు అప్రతిహతంగా విజయాలు సాధించింది. తల్లయ్యాక ఆమె జోరు తగ్గింది. టెన్నిస్‌ గ్రేట్‌ మార్గరెట్‌ కోర్ట్‌ 24 టైటిళ్ల రికార్డును సమం చేయాలని పట్టుదలగా ప్రయత్నించింది. చివరికి 23 వద్దే ఆగిపోయింది. యూఎస్‌ ఓపెన్‌ తర్వాత వీడ్కోలు పలుకుతానని ముందే చెప్పింది.


నాన్నకు ప్రేమతో..!


చివరి మ్యాచ్‌ ఆడాక సెరెనా విలియమ్స్‌ తన కుటుంబ సభ్యులను తలుచుకుంది. తన తండ్రి స్వర్గం నుంచి చూస్తుంటారని విశ్వాసం వ్యక్తం చేసింది. సోదరి వీనస్‌ విలియమ్స్‌కు కృతజ్ఞతలు తెలియజేసింది. 'థాంక్యూ నాన్నా! నువ్వు చూస్తుంటావని నాకు తెలుసు. థాంక్స్‌ మామ్‌. ఇక్కడున్న అందరికీ నా కృతజ్ఞతలు. చెప్పాలంటే దశాబ్దాలుగా మీరంతా నాకు అండగా ఉన్నారు. అసలు వీనస్‌ లేకుంటే సెరెనా లేనే లేదు. అందుకే వీనస్‌కు ధన్యవాదాలు. టెన్నిస్‌లో సెరెనా ఉందంటే అందుకు ఆమే కారణం' అని ఈ ఛాంపియన్‌ వెల్లడించింది.


దారులు తెరిచే ఉన్నాయ్‌!


సెరెనా ఆటకు వీడ్కోలు పలికినప్పటికీ పునరాగమనానికి దారులు తెరిచే ఉంచింది. 'మరోసారి ఆలోచిస్తారా?' అని ప్రశ్నించగా 'దాదాపుగా ఆడకపోవచ్చు. కానీ ఎప్పుడేం జరుగుతుందో తెలీదు' అని బదులిచ్చింది. 'నా కెరీర్‌ సరదాగా సాగిపోయింది. నా టెన్నిస్‌ ప్రయాణం అద్భుతం. నా జీవితం ఎంతో బాగుంది. అందుకే నా జీవితంలోని ప్రతి వ్యక్తికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మీరే నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు' అని వెల్లడించింది.