Team India set to play 25 t20s before t20 worldcup : ఐపీఎల్‌ 2022 ముగిసింది. గుజరాత్ టైటాన్స్‌ విజేతగా ఆవిర్భవించింది. ఈ టోర్నీ ప్రేక్షకులకు క్రికెట్‌ వినోదాన్ని బాగానే పంచింది. ఇక అంతర్జాతీయ మ్యాచులకు టీమ్‌ఇండియా సంసిద్ధం అవుతోంది. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ ముందు ఏకంగా 25 టీ20లు ఆడనుంది.


ఈ ఏడాది అక్టోబర్‌- నవంబర్లో ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ జరగనుంది. ఆస్ట్రేలియా ఆతిథ్యం ఇస్తోంది. దీనికి ముందు టీమ్‌ఇండియాకు వరుస సిరీసులు ఉన్నాయి. 25కు పైగా టీ20లు ఆడనుంది. జూన్‌లో దక్షిణాఫ్రికాతో ఐదు టీ20లు ఉన్నాయి. ఈ సిరీస్‌కు కేఎల్‌ రాహుల్‌ కెప్టెన్సీ చేస్తున్నాడు. ఇదే నెలలో కుర్రాళ్లు ఐర్లాండ్‌ పర్యటనకు వెళ్తున్నారు. రెండు టీ20లు ఆడతారు.


ఐర్లాండ్‌ నుంచి రోహిత్‌ సేన ఇంగ్లాండ్‌లో పర్యటించనుంది. గతేడాది ఆగిపోయిన టెస్టు సిరీసులో ఆఖరిదైన ఐదో టెస్టు ఆడనుంది. ఆ తర్వాత 3 వన్డేలు, 3 టీ20ల్లో తలపడనుంది. ఈ పర్యటన మొత్తం జులై, ఆగస్టులో ఉంటుంది. అట్నుంచి టీమ్‌ఇండియా కరీబియన్‌ దీవులకు వెళ్తుంది. అక్కడ 3 వన్డేలు, 5 టీ20లు ఆడుతుంది. మళ్లీ రెండు టీ20ల కోసం శ్రీలంకకు వస్తుంది. ఆ తర్వాత ఆగస్టు, సెప్టెంబర్లోనే ఆసియాకప్‌ ఉంటుంది. అక్టోబర్‌-నవంబర్లో ఆస్ట్రేలియాలో పొట్టి ప్రపంచకప్‌ ఆడుతుంది.


ఐసీసీ టీ20 ప్రపంచకప్‌నకు పక్కా ప్రణాళికలు వేసుకొనేందుకు టీమ్‌ఇండియాకు తగిన సమయం ఉంది. తాజా ఐపీఎల్‌లో కొందరు కొత్త కుర్రాళ్లు వెలుగులోకి వచ్చారు. అంతర్జాతీయ స్థాయి ఒత్తిడిని ఎదుర్కొని రాణించారు. ఆటగాళ్ల పరంగానైతే జట్టుకు ఇబ్బందేమీ లేదు. ప్రణాళికలు వేయడం, వాటిని అమలు చేయడంలోనే తేడా కొడుతోంది. వీటన్నిటినీ ఈ ఆరు నెలల్లో సరిదిద్దుకోవాల్సి ఉంటుంది. కాగా దక్షిణాఫ్రికా, ఐర్లాండ్‌ టీ20లకు వీవీఎస్‌ లక్ష్మణ్‌ కోచ్‌గా పనిచేయడం ప్రత్యేకంగా నిలవనుంది. మిగతా వాటికి ద్రవిడ్ ఉంటారు.