Sumit Nagal Wins Chennai Open:  భారత టెన్నిస్‌ యువ కెరటం సుమిత్‌ నగాల్‌(Sumit Nagal ) మరోసారి అద్భుత ప్రదర్శనతో అదరగొట్టాడు. అద్భుత ఆటతీరుతో చెన్నై ఓపెన్‌(Chennai Open 2024) టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో సుమిత్‌ 6-1, 6-4తో ఇటలీకి చెందిన లూకా నార్డీపై నగాల్‌ చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. నగాల్‌ పెద్దగా కష్టపడకుండానే విజయాన్ని సొంతం చేసుకున్నాడు. చెన్నై ఓపెన్‌ టైటిల్‌ టోర్నమెంట్‌లో ఒక్క సెట్‌ కూడా చేజార్చుకోకుండా టైటిల్‌ గెలిచి రికార్డు సృష్టించాడు. తాజా విజయంతో నగాల్‌ టాప్‌-100లోపు ర్యాంకు సొంతం చేసుకున్నాడు. నగాల్ ప్రస్తుతం 98వ ర్యాంకులో కొనసాగుతున్నాడు. 2019లో ప్రజ్నేశ్‌ గుణేశ్వరన్‌ తర్వాత వందలోపు సింగిల్స్‌ ర్యాంకు సాధించబోతున్న భారత ఆటగాడు నగాలే.



ఇటీవలే  నగాల్‌ సంచలనం
ఇటీవలే ఆస్ట్రేలియా ఓపెన్‌లో లో ఇండియన్‌ టెన్నిస్‌ స్టార్‌ సుమిత్‌ నగాల్‌(Sumit Nagal) చరిత్ర సృష్టించాడు. తొలి రౌండ్‌లో ప్రపంచ 27వ ర్యాంకర్‌ను ఓడించి రెండో రౌండ్‌కు దూసుకెళ్లాడు. మెన్స్ సింగిల్స్‌లో కజికిస్థాన్‌కు చెందిన దిగ్గజ ఆటగాడు అలెగ్జాండర్ బబ్లిక్‌(Sumit Nagal vs Alexander Bublik) ను మట్టికరిపించాడు. 6-4, 6-2, 7-6 (5)తో వరుస సెట్లలో గెలిచి చరిత్ర సృష్టించాడు. 1989 తర్వాత ఆస్ట్రేలియా ఓపెన్‌లో ఓ సీడెడ్ ప్లేయర్‌ను భారత ఆటగాడు ఓడించడం ఇదే తొలిసారి. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 139వ స్థానంలో ఉన్న నగాల్‌.. 27వ ర్యాంకర్‌ అలెగ్జాండర్‌ బబ్లిక్‌పై గెలిచి సంచలనం సృష్టించాడు. సుమిత్‌ 6-4, 6-2, 7-6 (7-5)తో గెలుపొంది రెండో రౌండ్‌కు చేరుకున్నాడు. ఆస్ట్రేలియా ఓపెన్‌ చరిత్రలో దాదాపు మూడున్నర దశాబ్దాల తర్వాత ఓ సీడెడ్‌ ఆటగాడిని భారత క్రీడాకారుడు ఓడించడం ఇదే తొలిసారి. కానీ తొలి రౌండ్‌లో సంచలన ప్రదర్శనతో తనకంటే ర్యాంకింగ్స్‌లో ఎంతో ముందున్న ఆటగాడికి షాక్‌ ఇచ్చిన నగాల్ రెండో రౌండ్‌లోనే వెనుదిరిగాడు.  పురుషుల సింగిల్స్ రెండో రౌండ్‌లో సుమిత్ నగాల్ 6-2, 3-6, 5-7, 4-6 తేడాతో చైనా ప్లేయర్ జున్‌చెంగ్ షాంగ్‌ చేతిలో ఓటమి పాలయ్యాడు. 



అప్పుడెప్పుడో 1989లో....
టెన్నిస్ దిగ్గజం రమేశ్ కృష్ణన్‌( Ramesh Krishnan) 1989లో.. అప్పటి ప్రపంచ నంబర్‌ 1 మ్యాట్స్‌ విలాండర్‌ను రెండో రౌండ్‌లో ఓడించాడు. టెన్నిస్‌ పురుషుల సింగిల్స్‌ విభాగంలో ఇప్పటివరకు ఓ భారత ఆటగాడు ఆస్ట్రేలియా ఓపెన్‌లో మూడో రౌండ్‌ వరకు మాత్రమే చేరుకున్నారు. రమేశ్ కృష్ణన్‌ తన కెరీర్‌లో ఐదు సార్లు 1983, 84, 87, 88, 89 ఏడాదుల్లో ఆస్ట్రేలియా ఓపెన్‌లో మూడో రౌండ్‌ వరకు వెళ్లాడు. లియాండర్‌ పేస్‌, విజయ్‌ అమృత్‌రాజ్ కూడా ఈ టోర్నీలో ఆడినప్పటికీ.. రెండో రౌండ్‌లోనే వెనుదిరిగారు. సుమిత్‌ చివరగా 2021 ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ప్రధాన డ్రాలో ఆడాడు. అప్పుడు మొదటి రౌండ్లోనే ఓడిపోయాడు. 2019, 2020లో యూఎస్‌ ఓపెన్‌ ప్రధాన డ్రాలోనూ సుమిత్‌ బరిలో దిగాడు. 2020 యూఎస్‌ ఓపెన్‌లోనూ రెండో రౌండ్‌ వరకు చేరుకున్నాడు.