Ind VS SL 2nd T20I: భారత్‌తో జరుగుతున్న రెండో టీ20లో శ్రీలంక 20 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 183 పరుగులు చేసింది. భారత్ విజయానికి 120 బంతుల్లో 184 పరుగులు అవసరం. శ్రీలంక బ్యాటర్లలో ఓపెనర్ పతుం నిశ్శంక (75: 53 బంతుల్లో, 11 ఫోర్లు) (Pathum Nissanka) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. చివర్లో దనున్ షణక (Dasun Shanaka) (47 నాటౌట్: 19 బంతుల్లో, రెండు ఫోర్లు, ఐదు సిక్సర్లు) చెలరేగాడు. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ (Bhuvneshwar Kumar), బుమ్రా (Jasprit Bumrah), హర్షల్ పటేల్ (Harshal Patel), యుజ్వేంద్ర చాహల్ (Yuzvendra Chahal), రవీంద్ర జడేజా (Ravindra Jadeja) చెరో వికెట్ తీశారు.
అదరగొట్టిన నిశ్శంక
టాస్ గెలిచిన రోహిత్ శర్మ (Rohit Sharma) బౌలింగ్ ఎంచుకోవడంతో శ్రీలంక బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లు పతుం నిశ్శంక, దనుష్క గుణతిలక (38: 29 బంతుల్లో, నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లు) శ్రీలంకు మంచి ఆరంభాన్ని అందించారు. మొదటి వికెట్‌కు 8.4 ఓవర్లలో 67 పరుగులు జోడించారు. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లలో ఎవ్వరూ సరిగ్గా ఆడకపోవడంతో శ్రీలంక 102 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో నిలిచింది.
ఈ దశలో క్రీజులో నిలబడిపోయిన నిశ్శంకకు దసున్ షణక (47 నాటౌట్: 19 బంతుల్లో, రెండు ఫోర్లు, ఐదు సిక్సర్లు) జతకలిశాడు. వీరిద్దరూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. మొదట్లో కొంచెం నిదానంగా ఆడిన నిశ్శంక తర్వాత గేర్లు మార్చాడు. కేవలం 26 బంతుల్లో వీరు 58 పరుగులు జోడించడం విశేషం. 17వ ఓవర్ నుంచి 19వ ఓవర్ వరకు మూడో ఓవర్లలోనే శ్రీలంక ఏకంగా 49 పరుగులు చేయడం విశేషం.
19వ ఓవర్ చివరి బంతికి భువీ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి నిశ్శంక ఎల్బీడబ్ల్యూగా అవుటయ్యాడు. ఆ తర్వాత చివరి ఓవర్లో 23 పరుగులు రావడంతో శ్రీలంక 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 183 పరుగులు చేసింది. చివరి నాలుగు ఓవర్లలో శ్రీలంక ఏకంగా 72 పరుగులు సాధించడం విశేషం.