German Open: జర్మన్‌ ఓపెన్లో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ సిల్వర్‌ మెడలిస్టు కిదాంబి శ్రీకాంత్‌ (Kidambi Srikanth) దూసుకుపోతున్నాడు. పురుషుల రెండో రౌండ్లో విజయం సాధించాడు. క్వార్టర్‌ ఫైనల్స్‌కు దూసుకెళ్లాడు. మరోవైపు రెండుసార్లు ఒలింపిక్‌ పతక విజేత పీవీ సింధు (PV Sindhu), లండన్‌ ఒలింపిక్స్‌ కాంస్య విజేత సైనా నెహ్వాల్‌ (Saina Nehwal) ఓటమి పాలయ్యారు.


ఎనిమిదో సీడ్‌గా బరిలోకి దిగిన శ్రీకాంత్‌ 21-16, 21-23, 21-18 తేడాతో చైనా షట్లర్‌ లూ గ్వాంగ్‌ ఝును ఓడించాడు. క్వార్టర్స్‌లో అతడు ఒలింపిక్‌ విజేత, టాప్‌ సీడ్‌ విక్టర్‌ అక్సెల్‌సెన్‌తో తలపడనున్నాడు. అతడితో ఆట సులువేం కాదు! ఇక ఏడో సీడ్‌ సింధు 14-21, 21-15, 14-21 తేడాతో చైనా అమ్మాయి ఝాంగ్‌ యి మన్‌ చేతిలో పోరాడి ఓటమి పాలైంది. 55 నిమిషాల పాటు జరిగిన ఈ హోరాహోరీ పోరులో ఆమెకు కలిసి రాలేదు.


కొన్నాళ్లుగా ఫిట్‌నెస్‌ ఇబ్బందులతో సతమతం అవుతున్న సైనా నెహ్వాల్‌ రెండో రౌండ్‌ పోరులో ఘోర పరాజయం చవిచూసింది. థాయ్‌ షట్లర్‌ ఇంతానన్‌ రచనోక్‌ ఆమెను 21-10, 21-15 తేడాతో వరుస గేముల్లో ఓడించింది.


రెండో రౌండ్లో శ్రీకాంత్‌ అద్భుతంగా ఆడాడు. తన ప్రత్యర్థిని ఓడించేందుకు గంటా ఏడు నిమిషాలు తీసుకున్నాడు. ఆరంభంలోనే 8-3తో ఆధిక్యంలోకి వెళ్లినప్పటికీ ప్రత్యర్థి పుంజుకోవడంతో 11-10తో బ్రేక్‌ తీసుకున్నాడు. ఆ తర్వాత నువ్వా నేనా అన్నట్టు తలపడటంతో స్కోరు 14-14తో సమమైంది. ఈ పరిస్థితుల్లో వరుస పాయింట్లు సాధించిన శ్రీకాంత్‌ తొలి గేమ్‌ను గెలుచుకున్నాడు.


రెండో గేములోనూ శ్రీకాంత్‌ 15-11తో లీడింగ్‌లోకి వెళ్లాడు. కానీ లూ అతడితో గట్టిగా పోరాడాడు. వరుసగా పాయింట్లు సాధిస్తూ అడ్డుకున్నాడు. చివర్లో మ్యాచ్‌ పాయింట్‌ గెలిచి 1-1తో సమం చేశాడు. ఇక డిసైడింగ్‌ మూడో గేములోనూ శ్రీకాంత్‌ ఆరంభంలో 10-5తో ఆధిక్యంలో వెళ్లాడు. మళ్లీ లూ 15-14తో పుంజుకున్నాడు. ఈ క్రమంలో తన గేమ్‌ను కంట్రోల్‌ చేసుకున్న శ్రీకాంత్ నెట్‌గేమ్‌, స్మాషులతో విరుచుకుపడ్డాడు. గేమ్‌తో పాటు మ్యాచ్‌ గెలిచాడు.