Sreesanth Injury: టీమ్‌ఇండియా వెటరన్‌ క్రికెటర్‌, కేరళ స్పీడ్‌స్టర్ శ్రీశాంత్‌కు కాలం కలిసి రావడం లేదు. ఐపీఎల్‌-2022లో అతడినెవరూ తీసుకోలేదు. రంజీ ట్రోఫీలోనైనా అదరగొట్టాలనుకుంటే గాయాల వల్ల ఆస్పత్రి పాలయ్యాడు.


మ్యాచ్‌ ఫిక్సింగ్‌ (Spot Fixing) ఆరోపణలతో శ్రీశాంత్‌ ఏడేళ్లకు పైగా నిషేధం అనుభవించాడు. నిషేధం నుంచి బయటపడేందుకు సుదీర్ఘ న్యాయ పోరాటం చేశాడు. ఎట్టకేలకు శిక్ష నుంచి బయటపడ్డాడు. గతేడాది ఐపీఎల్‌ వేలానికి పేరు నమోదు చేసుకుంటే బీసీసీఐ తిరస్కరించింది. ఈ సారి 600 మంది ఆటగాళ్లలో అతడి పేరునూ నమోదు చేసుకున్నాడు. రూ.50 లక్షల కనీస ధర నిర్ణయించుకున్నాడు. అయితే వేలంలో అతడిని కొనుగోలు చేసేందుకు ఒక్క ఫ్రాంచైజీ కూడా ఆసక్తి చూపించలేదు.


నిరాశ చెందిన శ్రీశాంత్‌ సానుకూల దృక్పథంతో ఓ వీడియో షేర్‌ చేసుకున్నాడు. రంజీ ట్రోఫీ-2022లో కేరళకు ఎంపికవ్వడంతో సంతోషించాడు. టోర్నీ మొత్తం ఆడి తన ఫిట్‌నెస్‌, ఆటను నిరూపించుకోవాలని తపన పడ్డాడు. మేఘాలయపై 2 వికెట్లు తీశాడు. 19 పరుగులూ సాధించాడు. అయితే అతడు గాయాల పాలవ్వడంతో సీజన్‌కు పూర్తిగా దూరమవుతున్నాడని తెలిసింది. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. అతడు ఆస్పత్రి బెడ్‌మీద చికిత్స పొందుతున్న చిత్రాన్ని అతడి స్నేహితుడు సోషల్‌ మీడియాలో పెట్టగా దానిని శ్రీశాంత్‌ షేర్‌ చేసుకున్నాడు.


రంజీ సీజన్‌ (Ranji Trophy 2022) ప్రాబబుల్స్‌లో అతడి పేరును కేరళ క్రికెట్‌ సంఘం చేర్చినప్పుడు ఎంతో సంతోషించాడు. పద్దెనమిదేళ్ల కుర్రాడు తొలిసారి ఎరుపు బంతి క్రికెట్‌ ఫార్మాట్‌కు ఎంపికైనప్పుడు ఉండే భావోద్వేగమే తనకూ కలుగుతోందని శ్రీ పేర్కొన్నాడు.


'జెర్సీ మూవీలోని ఈ ఫీలింగే నాకూ ఉంది. ఆ అనుభూతిని వర్ణించలేను. జీవిత కాలంగా ఈ అవకాశం ఎదురు చూస్తున్నట్టు ఫీలవుతున్నా. అందరికీ ధన్యవాదాలు. నేను అత్యుత్తమంగా ఆడాలని ప్రార్థన చేయండి' అని శ్రీకాంత్‌ ట్వీట్‌ చేశాడు. జెర్సీ మూవీలో రైల్వే స్టేషన్లో రైలు వెళ్తున్నప్పుడు నాని అరిచే భావోద్వేగ సన్నివేశాన్ని పోస్టు చేశాడు.


'తొమ్మిదేళ్ల తర్వాత నేను ప్రేమించే రాష్ట్రం తరఫున రంజీ ట్రోఫీ ఆడబోతున్నా. ప్రతి ఒక్కరికీ పేరుపేరున ధన్యవాదాలు. తెల్లరంగు జెర్సీలో ఎరుపు బంతితో ఆడబోతున్నందుకు సంతోషంగా ఉంది. నా జర్నీ ఇక్కడ నుంచే మొదలైంది. నాకెంతో ఆత్రుతగా ఉంది' అని మరో వీడియోను పోస్టు చేశాడు.