Sreesanth Retirement: టీమ్‌ఇండియా స్పీడ్‌స్టర్ శ్రీశాంత్ అన్ని రకాల క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేశాడు! తర్వాతి తరాలకు అవకాశాలు దొరికేందుకే తాను ఫస్ట్‌క్లాస్ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించాడు. కేరళ తరఫున రంజీ ట్రోఫీ ఆడుతున్న శ్రీశాంత్ హఠాత్తుగా నిర్ణయం తీసుకోవడం ఆశ్చర్యం కలిగించింది. గాయాల పాలైన అతడు ఈ మధ్యే ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే.
'తర్వాతి తరం క్రికెటర్ల కోసం నా ఫస్ట్‌క్లాస్ కెరీర్‌కు ముగింపు పలకాలని నిర్ణయించుకున్నా. నాకు సంతోషకరం కానప్పటికీ ఈ నిర్ణయం నేనే తీసుకున్నా. నా జీవితంలో ఈ దశలో నేను గౌరవప్రదంగా వేస్తున్న సరైన అడుగు ఇది. కెరీర్‌లో ప్రతి సందర్భాన్నీ నేను ఆస్వాదించాను. నా కుటుంబం, నా జట్టు సభ్యులు, భారత ప్రజల తరఫున ప్రాతినిధ్యం వహించడం గొప్ప గౌరవం. భారమైన హృదయంలో నేను ఫస్ట్‌క్లాస్ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నాని ప్రకటిస్తున్నా' అని శ్రీశాంత్ ట్వీట్లు చేశాడు.
'ఐసీసీ నన్నెంతో గౌరవించింది. 25 ఏళ్ల కెరీర్‌లో ఒక క్రికెటర్‌గా ఎన్నో విజయాలు చవిచూశాను. ఎన్నో మ్యాచులను గెలిపించాను. ఎంతో కఠినంగా సన్నద్ధమయ్యాను. నా జీవితంలో ఇదో కఠినమైన రోజు. అదే విధంగా నా కృతజ్ఞతను తెలియజేసేందుకు ఓ మంచి సందర్భం. ఈసీసీ, ఎర్నాకుళం జిల్లా, వేర్వేరు లీగులు, టోర్నమెంటు జట్లు, కేరళ క్రికెట్ సంఘం, బీసీసీఐ, వార్విక్‌షైర్ కౌంటీ, ఇండియన్ ఎయిర్‌లైన్స్ క్రికెట్ టీమ్, బీపీసీఎల్, ఐసీసీకి ధన్యవాదాలు' అని శ్రీశాంత్ పేర్కొన్నాడు.
శ్రీశాంత్ టీమ్‌ఇండియా తరఫున అద్భుతమైన ప్రదర్శన చేశాడు. 27 టెస్టుల్లో 37 సగటుతో 87 వికెట్లు పడగొట్టాడు. 53 వన్డేల్లో 33 సగటుతో 75, 10 టీ20ల్లో 41 సగటుతో 7 వికెట్లు తీశాడు. 74 ఫస్ట్‌క్లాస్ మ్యాచుల్లో 213, 92 లిస్ట్ ఏ మ్యాచుల్లో 124, మొత్తంగా 65 టీ20ల్లో 54 వికెట్లు తీశాడు. 2005, అక్టోబర్లో శ్రీలంకపై వన్డేల్లో అరంగేట్రం చేసిన అతడు 2011, ఆగస్టు 22న చివరి టెస్టు ఆడాడు. మ్యాచ్ ఫిక్సింగ్ నిషేధం లేకుంటే ఇండియాలోని అత్యుత్తమ పేసర్లలో అతడూ ఒకడయ్యేవాడు!