భారత్‌తో జరిగిన మూడో వన్డేలో దక్షిణాఫ్రికా నాలుగు పరుగులతో విజయం సాధించింది. దీంతో సిరీస్‌ను కూడా 3-0తో వైట్ వాష్ చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 49.5 ఓవర్లలో 287 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తర్వాత భారత్ 49.2 ఓవర్లలో 283 పరుగులకు ఆలౌట్ అయింది. భారత వన్డే క్రికెట్ చరిత్రలో సిరీస్ వైట్ వాష్ కావడం ఇది కేవలం మూడో సారి మాత్రమే. కెప్టెన్సీ చేసిన మొదటి మూడు మ్యాచ్‌ల్లోనూ ఓటమి పాలైన మొదటి కెప్టెన్ కూడా కేఎల్ రాహులే.


288 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు మొదట్లోనే ఎదురు దెబ్బ తగిలింది. ఫాంలో ఉన్న కెప్టెన్ కేఎల్ రాహుల్ (9: 10 బంతుల్లో, రెండు ఫోర్లు) ఈ మ్యాచ్‌లో విఫలం అయ్యాడు. అయితే శిఖర్ ధావన్ (61: 73 బంతుల్లో, ఐదు ఫోర్లు, ఒక సిక్సర్), విరాట్ కోహ్లీ (65: 84 బంతుల్లో, ఐదు ఫోర్లు) ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 98 పరుగులు జోడించారు. అయితే ఒకే ఓవర్లో ధావన్‌తో పాటు.. రిషబ్ పంత్ (0) కూడా అవుట్ అవ్వడంతో భారత్ 118 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత కాసేపటికే విరాట్ కోహ్లీ కూడా అవుటయ్యాడు.


ఈ దశలో శ్రేయస్ అయ్యర్ (26: 34 బంతుల్లో, రెండు ఫోర్లు), సూర్యకుమార్ యాదవ్ (39: 32 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్) కలిసి వికెట్ల పతనాన్ని ఆపారు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు విలువైన 39 పరుగులు జోడించారు. ఆ తర్వాత మళ్లీ ఐదు ఓవర్ల వ్యవధిలోనే శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, జయంత్ యాదవ్ అవుట్ కావడంతో 223 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి గెలుపును కష్టతరం చేసుకుంది. అయితే ఈ దశలో దీపక్ చాహర్ (54: 34 బంతుల్లో, ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లు), జస్‌ప్రీత్ బుమ్రా (12: 15 బంతుల్లో, రెండు ఫోర్లు) కలిసి ఎనిమిదో వికెట్‌కు ఐదు ఓవర్లలోనే 55 పరుగులు జోడించారు. అయితే విజయానికి 10 పరుగుల ముందు చాహర్ అవుట్ కావడంతో మ్యాచ్ ఉత్కంఠభరితంగా మారింది. అయితే చివర్లో బుమ్రా, ప్రసీద్ కృష్ణ (2) కూడా అవుట్ కావడంతో భారత్ 283 పరుగులకు ఆలౌట్ అయింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఫెలుక్వాయో, ఎంగిడి మూడేసి వికెట్లు తీశారు. ప్రిటోరిస్‌కు రెండు వికెట్లు, మగల, కేశవ్ మహరాజ్‌లకు చెరో వికెట్ దక్కింది.


అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికు కూడా ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. గత మ్యాచ్‌లో అద్భుతంగా రాణించిన ఓపెనర్ జానేమన్ మలన్ (1: 6 బంతుల్లో) మూడో ఓవర్లోనే అవుటయ్యాడు. ఫాంలో ఉన్న కెప్టెన్ టెంబా బవుమా (8: 12 బంతుల్లో, ఒక ఫోర్) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేదు. తను లేని పరుగు కోసం ప్రయత్నించి రనౌట్ అవ్వడంతో దక్షిణాఫ్రికా రెండో వికెట్ కోల్పోయింది.


ఒక వైపు వికెట్లు పడుతున్న మరోవైపు క్వింటన్ డికాక్ మాత్రం క్రీజులో నిలబడిపోయాడు. దక్షిణాఫ్రికా 70 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన దశలో క్వింటన్ డికాక్‌కు వాన్ డర్ డుసెన్ (52: 59 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్) జత కలిశాడు. ఈ జోడి నాలుగో వికెట్‌కు 144 పరుగులు జోడించారు. ఈ దశలోనే క్వింటన్ డికాక్ సెంచరీ కూడా పూర్తి చేసుకున్నాడు.


ఇన్నింగ్స్ 36వ ఓవర్లో డికాక్‌ను అవుట్ చేసి జస్‌ప్రీత్ బుమ్రా భారత్‌కు బ్రేక్ ఇచ్చాడు. వెంటనే వాన్ డర్ డుసెన్, ఫెలుక్వాయో (4: 11 బంతుల్లో) కూడా అవుటయ్యారు. ఒక వైపు వికెట్లు పడుతున్నా.. మరోవైపు డేవిడ్ మిల్లర్ (39: 38 బంతుల్లో, మూడు ఫోర్లు, ఒక సిక్సర్) వేగంగా ఆడాడు. ఇన్నింగ్స్ చివరి ఓవర్లో తొమ్మిదో వికెట్‌గా డేవిడ్ మిల్లర్ వెనుదిరిగాడు. ఆ తర్వాత మగల కూడా అవుట్ కావడంతో దక్షిణాఫ్రికా తొలిసారి ఈ సిరీస్‌లో ఆలౌట్ అయింది. 49.5 ఓవర్లలో 287 పరుగులకు దక్షిణాఫ్రికా ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో ప్రసీద్ కృష్ణ మూడు వికెట్లు తీయగా.. బుమ్రా, చాహర్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. మరో వికెట్ యజ్వేంద్ర చాహల్ ఖాతాలో పడింది.