Mana patel: ఒలింపిక్స్‌కు వెళ్తున్న తొలి ఇండియన్ ఉమెన్‌ స్విమ్మర్‌.. స్విమ్మింగ్‌ ఎందుకు స్టార్ట్‌ చేసిందో తెలుసా?

ABP Desam Updated at: 08 Jul 2021 08:33 PM (IST)

మానా పటేల్.. టోక్యో ఒలిపింక్స్​లో బెర్తు ఖరారు చేసుకున్న భారత తొలి మహిళా స్విమ్మర్. ఈ విషయం గురించి అందరికీ తెలిసిందే. అయితే ఈ అందాల స్విమ్మర్ గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా?

mana patel

NEXT PREV

అధిక బరువును తగ్గించుకోవాలని ఏడేళ్ల వయసులో ఈత కొలనులోకి దిగింది. దాన్నే కెరీర్‌గా మార్చుకొని, జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పతకాల పంట పండించింది. 
ఇక ఒలింపిక్స్‌కు రెడీ అవుతున్న టైంలో దురదృష్టవశాత్తూ వరుస గాయాలు, లాక్‌డౌన్‌ అడ్డంకులతో రెండేళ్లపాటు ఆటకు దూరమైంది. కానీ ఒలింపిక్స్‌ కలను నెరవేర్చుకునేందుకు ఈ ఏడాది మళ్లీ పూల్‌లోకి అడుగుపెట్టింది. విరామం వచ్చినా తనలో వాడి తగ్గలేదని నిరూపించుకుంది. టోక్యో బెర్తును ఖరారు చేసుకుని.. ఈ ఘనత సాధించిన భారత తొలి మహిళా స్విమ్మర్‌గా చరిత్ర సృష్టించింది. ఆమే అహ్మదాబాద్‌కు చెందిన 21 ఏళ్ల మానా పటేల్.


ఆ కోటాలో..


ఒలింపిక్స్‌.. నాలుగేళ్లకోసారి వచ్చే ఈ ప్రతిష్ఠాత్మక పోటీల్లో పాల్గొనాలని, కనీసం ఒక్క పతకమైనా సాధించాలని ప్రపంచంలోని క్రీడాకారులందరూ కోరుకుంటారు. అలా ఒలింపిక్స్‌ ఛాంపియన్‌ కావాలన్న తన స్వప్నాన్ని సాకారం చేసుకునే ప్రయాణంలో మొదటి అడుగు విజయవంతంగా పూర్తి చేసింది మానా పటేల్‌. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన ఈ బ్యాక్‌స్ట్రోక్‌ స్విమ్మర్.. Universality quota (ఒక దేశం నుంచి ఒక ఆడ, ఒక మగ పోటీదారుల్ని ఒలింపిక్స్‌లో పాల్గొనడానికి అనుమతించడం)లో ఒలింపిక్స్‌ బెర్తు ఖరారు చేసుకుంది. దీంతో టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన భారత తొలి మహిళా స్విమ్మర్‌గా చరిత్రకెక్కిందీ ఈ అమ్మాయి.


ఈ విషయాలు తెలుసా?



  1. తనకున్న ఊబకాయాన్ని అధిగమించేందుకు ఏడేళ్ల వయసులోనే ఈతపై ఇంట్రస్ట్​ పెంచుకుంది మానా పటేల్‌. ఆ తర్వాత ఇదే క్రీడను కెరీర్‌గా ఎంచుకుని జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో సత్తా చాటింది.

  2. బ్యాచిలర్‌ ఆఫ్‌ కామర్స్ (ఆనర్స్)లో డిగ్రీ పట్టా పొందిన ఆమె ఇంట్లోకి తొంగిచూస్తే.. అంతా పతకాలు, ట్రోఫీలు, ప్రశంసా పత్రాలే కనిపిస్తాయి.

  3. చిన్న వయసులోనే జాతీయ క్రీడల్లో భాగంగా 50 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌, 200 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌ పోటీల్లో స్వర్ణ పతకాలు సాధించిన ఘనత మానా పటేల్‌ సొంతం.

  4. 2015 నేషనల్‌ స్కూల్‌ గేమ్స్‌లో భాగంగా 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌ స్విమ్మింగ్‌ పోటీల్లోనూ పసిడి గెలుచుకొని అప్పటివరకు ఉన్న జాతీయ రికార్డును బద్దలు కొట్టింది.

  5. 2018లో జరిగిన 72వ సీనియర్‌ నేషనల్‌ అక్వాటిక్‌ ఛాంపియన్‌షిప్‌లోనూ మూడు బంగారు పతకాలు సాధించింది. అదే ఏడాది తిరువనంతపురంలో జరిగిన సీనియర్‌ నేషనల్స్‌ స్విమ్మింగ్‌ పోటీల్లో మూడు బ్యాక్‌స్ట్రోక్‌ ఈవెంట్లను కైవసం చేసుకుందీ యువ స్విమ్మర్.

  6. ప్రతి రోజూ 5 గంటలు స్విమ్మింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తుందట మానా. ఉదయం రెండు గంటలు, మధ్యాహ్నం గంట, సాయంత్రం రెండు గంటలు సాధన చేస్తుంది.

  7. రోజూ గంట పాటు జిమ్‌లో గడుపుతుంది. మానసికంగా దృఢంగా ఉండేందుకు కొన్ని రకాల వ్యాయామాలు చేస్తుందట.

  8. ఈ అందాల స్విమ్మర్ పూర్తి శాకాహారి.



"టీవీల్లో ఒలింపిక్స్‌ పోటీలు చూస్తూ పెరిగాను. అలాంటి ప్రతిష్ఠాత్మక పోటీల్లో ఇప్పుడు నా దేశం తరఫున ప్రాతినిథ్యం వహించే అవకాశం నాకు దక్కింది. టోక్యో ఫ్లైట్‌ ఎక్కబోతున్నందుకు ఎంతో గర్వంగా ఉంది. నా ఆనందాన్ని వర్ణించడానికి మాటలు రావడం లేదు. ప్రపంచంలోని అత్యుత్తమ స్విమ్మర్లతో పోటీ పడేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను" - - మానా పటేల్, భారత స్విమ్మర్

Published at: 08 Jul 2021 04:57 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.