Virat Kohli Retirement: పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌ షోయబ్‌ అక్తర్‌ విచిత్రమైన వాదనకు తెరతీశాడు! ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ తర్వాత విరాట్‌ కోహ్లీ (Virat Kohli) టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు పలుకుతాడని అంచనా వేశాడు. అతడి పరిస్థితిలో ఉంటే తాను ఇలాగే ఆలోచిస్తానని పేర్కొన్నాడు. మెగా టోర్నీకి ముందు అక్తర్‌ మైండ్‌గేమ్‌ మొదలు పెట్టాడేమోనని కొందరు అంటున్నారు.


టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఆసియాకప్‌లో తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. ఆఖరి సూపర్‌-4 మ్యాచులో అఫ్గాన్‌పై భారీ సెంచరీ చేశాడు. అంతర్జాతీయ క్రికెట్లో 71వ శతకం అందుకున్నాడు. టోర్నీకి ముందు నెల రోజుల విరామం తీసుకోవడం అతడికి మేలు చేసింది. తాజాగా వచ్చి అద్భుతాలు చేశాడు. అతి త్వరలో ఆరంభం కాబోతున్న టీ20 ప్రపంచకప్‌లో కోహ్లీపై భారీ అంచనాలు ఉన్నాయి. దుబాయ్‌లో మాదిరిగానే ఆసీస్‌లోనూ రాణించాలని అంతా కోరుకుంటున్నారు. జట్టుకు ట్రోఫీ అందించాలని ఆశిస్తున్నారు.


టెస్టు, వన్డే ఫార్మాట్లలో కెరీర్‌ను మరింత పొడగించుకొనేందుకు విరాట్‌ కోహ్లీ అనూహ్య నిర్ణయం తీసుకుంటాడని అక్తర్‌ అంటున్నాడు. పొట్టి క్రికెట్‌ ఫార్మాట్‌కు వీడ్కోలు పలుకుతాడని అంచనా వేశాడు. 'ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ తర్వాత విరాట్‌ కోహ్లీ బహుశా రిటైర్మెంట్‌ తీసుకోవచ్చు. ఇతర ఫార్మాట్లలో కెరీర్‌ పొడగించుకొనేందుకు అలా చేస్తుండొచ్చు. అతడి పరిస్థితుల్లో నేనుంటే బిగ్గర్ పిక్చర్‌ చూసి నిర్ణయం తీసుకుంటాను' అని అక్తర్‌ అన్నాడు.


ఆసియాకప్‌లో విరాట్‌ కోహ్లీ 276 పరుగులు చేశాడు. ఒక సెంచరీ, వరుసగా రెండు హాఫ్‌ సెంచరీలు సాధించాడు. తిరిగి తన మునుపటి ఫామ్‌ అందుకున్నాడు. ఫలితంగా ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో మళ్లీ తన జోరు చూపించాడు. ఆసియాకప్‌ ప్రదర్శనతో ఏకంగా 14 స్థానాలు ఎగబాకాడు. ప్రపంచ 15వ ర్యాంకుకు చేరుకున్నాడు.


మళ్లీ మునుపటి ఫామ్‌


తాను నిర్దేశించుకున్న ప్రమాణాల ప్రకారం తిరిగి పరుగులు చేస్తున్నానని టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్ విరాట్‌ కోహ్లీ (Virat Kohli) చెప్పిన సంగతి తెలిసిందే. మళ్లీ పాత టెంప్లేట్‌ ప్రకారం ఆడుతున్నానని పేర్కొన్నాడు. టీ20 ఫార్మాట్లో సెంచరీ చేస్తానని అస్సలు అనుకోలేదని చెప్పాడు. అఫ్గాన్‌పై సెంచరీ తర్వాత అతడు మాట్లాడాడు. బీసీసీఐ ఇంటర్వ్యూలో రోహిత్‌ శర్మ అడిగిన ప్రశ్నలకు జవాబు ఇచ్చిన సంగతి తెలిసిందే.


'మ్యాచ్‌ పరిస్థితులకు తగినట్టుగా బాధ్యతలు తీసుకోవడమే నాకిచ్చిన బాధ్యత. ఎక్కువ స్ట్రైక్‌రేట్‌తో పరుగులు చేయాలన్న డిమాండ్‌ వస్తే అదీ చేయాల్సిందే. నా జోన్‌లో ఉంటే కచ్చితంగా నేనా పనిచేస్తాను. ఆ తర్వాత రిలాక్స్‌ అవుతాను. ఎందుకంటే 10-15 బంతులాడితే నేను ఎక్కువ వేగం పెంచగలను' అని విరాట్‌ కోహ్లీ అన్నాడు.


'జట్టు కోణంలో చూస్తే నేనెంతో సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే కొన్నాళ్లేగా నేను సృష్టించుకున్న టెంప్లేట్‌ ప్రకారం తిరిగి ఆడుతున్నాను. నిరంతరం మ్యాచులు ఆడటం, ఎడతెరపి లేకుండా శ్రమించడం, నాది కాని మ్యాచులోనూ పరుగుల కోసం ఫేక్‌ ఇంటెన్సిటీ చూపించాను. విశ్రాంతి తీసుకోవడం మునుపటి శైలిలో రన్స్‌ చేస్తున్నాను' అని విరాట్‌ వివరించాడు.