భారత్, ఇంగ్లండ్‌ మధ్య  నేటి లార్డ్స్ వేదిక రెండో టెస్టు జరగనుంది. వర్షం కారణంగా మొదటి టెస్టు డ్రాగా ముగిసింది అందుకే ఇందులో గెలిసి బోణీ కొట్టాలని కొహ్లీ సేన రెడీ అయింది. అటు ఇంగ్లిష్ జట్టు కూడా ఇదే పట్టుదలతో ఉంది. 


ఐదు టెస్టు సిరీస్‌లో భాగంగా జరిగిన తొలిటెస్టు మ్యాచ్‌లో భారత్‌ పైచేయి సాధించింది. కానీ వర్షం టీమిండియా విజయాన్ని లాగేసుకుంది. మొదటి టెస్టు మ్యాచ్‌లో బౌలర్లు రాణించి విజయానికి చేరువయ్యేరే కానీ.. .బ్యాట్స్‌మెన్ పూర్తిగా విఫలమయ్యారు. కొహ్లీ, రహానే, పుజారా రాణించలేదు. ఇది టీమిండియాను కాస్త ఆందోళనకు గురిచేస్తోంది. 


కీప్లేయర్స్‌ అయిన మీ ముగ్గురు రాణించకుంటే జట్టులోని మిగతా సభ్యులపై భారం పడుతోంది. కొన్నేళ్ల నుంచి వీళ్ల ఆటతీరు చాలా పేలవంగా కనిపిస్తోంది. జడేజా లాంటి ఆటగాళ్లు బ్యాటింగ్‌లో కూడా రాణిస్తుండటం భారత్‌ ప్లస్ అవుతోంది. లార్డ్స్ లాంటి స్టేడియంలో రాణించి విజయాన్ని ముద్దాడాలని ఎవరికైనా ఉంటుంది. కొహ్లీ సేన కూడా అదే ఆశతో బరిలోకి దిగనుంది. 


ఈ పరిస్థితుల్లో జట్టులో ఎవరెవరికి ప్లేస్ ఉంటుందన్నది ఆసక్తి నెలకొంది. మొదటి టెస్టులో ఆడిన శార్దూల్ ఠాకూల్‌ గాయంతో ఈ మ్యాచ్‌ నుంచి వైదొలగాడు. ఈ పరిస్థితుల్లో ఎవర్ని జట్టులోకి తీసుకుంటారన్న చర్చ నడుస్తోంది. మాజీ ప్లేయర్లు మాత్రం అశ్విన్‌కు తీసుకుంటే బాగుంటుందని సూచిస్తున్నారు. జట్టు మేనేజ్‌మెంట్‌ కూడా ఈ ఆప్షన్‌ను పరిశీలిస్తోంది. ఇద్దరు స్పిన్నర్స్‌తో ఆడాలంటే జడేజాకు తోడుగా అశ్విన్‌ను ఆడిస్తారు. నలుగురు పేసర్లతో బరిలో దిగాలని కొహ్లీ అనుకుంటే మాత్రం ఇషాంత్‌, ఉమేశ్ యాదవ్‌లో ఒకరు శార్దూల్‌ ఠాకూర్‌ స్థానంలో జట్టులోకి వస్తారు. పిచ్‌ పరిస్థితి బట్టి నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉందంటున్నారు క్రికెట్ విశ్లేషకులు. పిచ్ పొడిగా ఉంటే మాత్రం అశ్విన్‌కు చోటు ఖాయమంటున్నారు. 


ఇంగ్లండ్‌ కూడా సొంత గడ్డపై గెలవాలని ప్లాన్ చేస్తోంది. తొలి టెస్టులో రాణించిన కెప్టెన్ రూట్... అదే ప్రదర్శన చేయాలని చూస్తున్నాడు. మొదటి టెస్టు ఎక్స్‌పీరియన్స్‌ను దృష్టిలో పెట్టుకొని కొన్ని మార్పులుచేయాలని ఇంగ్లిష్ టీం అనుకుంటోంది. ఓపెనర్‌ రోరీ బర్న్స్‌ ప్లేస్‌లో హసీబ్‌ హమీద్‌కు ఛాన్స్‌ దక్కొచ్చు. భారత్‌తో జరిగిన కౌంటీ మ్యాచ్‌లలో హమీద్‌కు మంచి రికార్డు ఉంది. అందుకే అతన్ని జట్టులోకి తీసుకోవాలని భావిస్తున్నాడు రూట్. 


భారత్‌కే కాదు ఇంగ్లండ్‌ను కూడా గాయాల బెడద వెంటాడుతోంది. పేసర్‌ స్టువర్ట్ బ్రాడ్ గాయంతో సిరీస్‌కే దూరమయ్యాడు. అండర్సన్ సైతం ఆడేది డౌట్‌గానే ఉంది. వీళ్లద్దరు ఆడకుంటే ఇంగ్లండ్‌ బౌలింగ్‌పై తీవ్రమైన ఎఫెక్ట్‌ పడే అవకాశం ఉంది. 


టాస్ అనేది లార్డ్స్‌ టెస్టులో కీలకంగా మారనుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకునే జట్టుకు విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరోవైపు వాతారవణం కూడా పొడిగా ఉంటుంది. అప్పుడప్పుడు మేఘాలు కమ్ముకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో బౌలర్లకు, బ్యాట్స్‌మెన్‌కు అందరికీ సహకరించవచ్చని అంచనా వేస్తున్నారు.