ODI World Cup 2023: 2011 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత, భారత క్రికెట్ జట్టు మరే ఇతర ప్రపంచ కప్‌ను గెలుచుకోలేకపోయింది. ఈలోగా, 50 ఓవర్ల ప్రపంచకప్‌లు రెండు జరిగాయి. రెండింటిలోనూ భారత్ సెమీ ఫైనల్‌లో ఓటమి పాలై నిష్క్రమించింది. 2019లో జరిగిన చివరి వన్డే ప్రపంచకప్‌లో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓటమి పాలై భారత్ ప్రపంచకప్ నుండి నిష్క్రమించింది.
ఆ ప్రపంచకప్‌లో భారత్‌కు ఎదురైన అతిపెద్ద సమస్య నంబర్ 4లో స్పెషలిస్టు బ్యాటర్ లేకపోవడం. నాలుగో నంబర్‌లో బ్యాటింగ్ చేయడానికి భారతదేశానికి ప్రత్యేకమైన బ్యాట్స్‌మన్ ఎవరూ లేరు. ఈ సంవత్సరం జరగనున్న 2023 వన్డే ప్రపంచ కప్‌లో కూడా అదే సమస్య భారతదేశం ముందు మళ్లీ వస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే బీసీసీఐ కొత్త కాంట్రాక్ట్ జాబితాను చూస్తుంటే 2023లో జరగనున్న వన్డే ప్రపంచకప్ సందర్భంగా నంబర్ 4లో బ్యాటింగ్ చేసే అవకాశాన్ని సంజు శామ్సన్‌కు అందిస్తున్నట్లు అనిపిస్తోంది. దీనికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి.
తొలిసారి బీసీసీఐ కాంట్రాక్ట్‌లో
వన్డే జట్టులో సంజూ శాంసన్‌కు శాశ్వత స్థానం దక్కాలని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ నిపుణులు, అభిమానులు భావిస్తున్నారు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో సంజు శామ్సన్‌ను జట్టులోకి తీసుకోవడంపై జోరుగా ప్రచారం జరిగింది. ఇప్పుడు బీసీసీఐ తన వార్షిక కాంట్రాక్ట్ జాబితాలో మొదటిసారిగా సంజు శామ్సన్‌ను చేర్చుకుంది. వన్డే క్రికెట్ జట్టులో సంజు శామ్సన్‌కు స్థానం లభిస్తుందని బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయం సూచిస్తుంది. బీసీసీఐ వార్షిక కాంట్రాక్ట్ జాబితాలో సంజు శామ్సన్ గ్రేడ్-సి కేటగిరీలో చోటు దక్కించుకున్నాడు.
శ్రేయస్ అయ్యర్ గాయం, సూర్యకుమార్ పేలవమైన ఫామ్
ప్రస్తుత పరిస్థితుల ప్రకారం భారత వన్డే క్రికెట్ జట్టులో నంబర్ 4 స్థానానికి అత్యంత అనుకూలమైన బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్. అయితే గాయం కారణంగా అతను ప్రస్తుతం జట్టుకు దూరంగా ఉన్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో శ్రేయస్ అయ్యర్‌కు బదులుగా టీమ్ ఇండియా సూర్యకుమార్ యాదవ్‌కు నాలుగో స్థానంలో ఆడే అవకాశం ఇచ్చింది.
అయితే సూర్య అనూహ్యంగా వరుసగా మూడు వన్డేల్లోనూ గోల్డెన్ డక్‌గా ఔటయ్యాడు. అతని పేలవమైన ఫామ్‌ను చూస్తుంటే రాబోయే వన్డే మ్యాచ్‌ల్లో భారత క్రికెట్ జట్టు సంజు శామ్సన్‌ను నాలుగో నంబర్‌లో ప్రయత్నించవచ్చు. తద్వారా అతను వన్డే ప్రపంచ కప్‌కు పరిపూర్ణంగా సిద్ధమవుతాడు. అంతేకాకుండా సూర్యకుమార్ యాదవ్ అప్రోచ్ వన్డే క్రికెట్‌కు ఎంత వరకు సరిపోతుందని కూడా తెలియాల్సి ఉంది.
వన్డేల్లో సంజు శామ్సన్‌కు గొప్ప రికార్డు
సంజు శామ్సన్‌కు వన్డే ప్రపంచకప్‌లో నంబర్ 4 బాధ్యతలు అప్పగించడానికి మరో కారణం కూడా ఉంది. అది అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో అతనికి ఉన్న అద్భుతమైన రికార్డు. భారత క్రికెట్ జట్టు తరపున సంజు శామ్సన్ ఇప్పటి వరకు 11 వన్డేలు ఆడాడు. ఈ మ్యాచ్‌ల్లో 10 ఇన్నింగ్స్‌ల్లో సంజు శామ్సన్ 66.00 సగటుతో 330 పరుగులు చేశాడు. ఈ సమయంలో సంజు శామ్సన్ అత్యధిక స్కోరు 86 నాటౌట్ కాగా, అతని స్ట్రైక్ రేట్ ఏకంగా 104.76గా ఉంది. అందువల్ల వన్డేల్లో 66.00 సగటుతో పరుగులు చేసిన ఆటగాడికి వన్డే ప్రపంచకప్‌లో నంబర్ 4 బాధ్యతలను టీమ్ ఇండియా అప్పగించవచ్చు.