Sakshi Malik: ఒలింపిక్‌ కాంస్య పతక విజేత సాక్షి మాలిక్‌(Sakshi Malik) రెజ్లింగ్‌ పోటీల్లో మళ్లీ  బరిలోకి దిగనుందన్న వార్త వైరల్‌గా మారింది. అయితే ఈ వార్తలపై సాక్షి మాలిక్‌ స్పందించింది. రెజ్లింగ్‌ పోటీల్లో మళ్లీ పాల్గొనే అంశంపై వస్తోన్న వార్తలను మాలిక్‌ ఖండించింది. బ్రిజ్‌ భూషణ్‌ సింగ్‌ లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా సుదీర్ఘ కాలంగా చేస్తోన్న నిరసనలు మానసిక వేదనకు గురిచేశాయని సాక్షి మాలిక్‌ అన్నారు. గతేడాది డిసెంబర్‌లో రిటైర్మెంట్‌ ప్రకటించిన ఆమె.. మళ్లీ పోటీల్లో పాల్గొనే అవకాశం లేదని స్పష్టం చేశారు. ఏడాదికి పైగా గడిచిన సమయంలో తాను  మానసికంగా ఎంతో ఒత్తిడి ఎదుర్కొంటున్నానని సాక్షి వెల్లడించింది. తమ పోరాటం విజయవంతమయ్యేందుకు అన్ని మార్గాల్లో ప్రయత్నిస్తున్నామని తెలిపింది.  అందుకే రెజ్లింగ్‌ను మళ్లీ కొనసాగించలేనని తేల్చి చెప్పింది. తాను దేశం కోసం కాంస్యం సాధించానని... కానీ, జూనియర్లు స్వర్ణం, రజత పతకాలు సాధించాలని కోరుకుంటున్నానని తెలిపింది. రెజ్లింగ్‌లో కొనసాగాలని చాలామంది విజ్ఞప్తి చేస్తున్నా.. బ్రిజ్‌ భూషణ్‌ వంటి వాళ్ల నడుమ రెజ్లింగ్‌ను కొనసాగించలేనని చెప్పారు.


సెలక్షన్‌ ఆపాలంటూ పిటిషన్
ఈనెల 10, 11 తేదీల్లో భారత రెజ్లింగ్‌ సమాఖ్య (Wrestling Federation of India)నిర్వహించనున్న సెలక్షన్‌ ట్రయల్స్‌(Asian Championships and Olympic Qualifiers)  ఆపాలంటూ స్టార్‌ రెజ్లర్‌ బజ్‌రంగ్‌ పునియా(Bajrang Punia) కోర్టును ఆశ్రయించాడు. ఈ సెలక్షన్స్‌లో పాల్గొనాలని తనకు అందిన ఆహ్వానాన్ని బజ్‌రంగ్‌ తిరస్కరించాడు. ఈ సెలక్షన్స్‌ ట్రయల్స్‌ ఆపాలంటూ ఢిల్లీ హైకోర్లు పునియా అత్యవసర పిటిషన్‌ వేశాడు. బజ్‌రంగ్‌తో పాటు వినేశ్‌ ఫొగాట్‌, సాక్షి మలిక్‌, సత్యవర్త్‌ కడియన్‌ కూడా ఈ పిటిషన్లో భాగమైనట్లు తెలుస్తోంది. గత ఏడాది అప్పటి  భారత రెజ్లింగ్‌ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌కు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. WFI కొత్త అధ్యక్షుడు సంజయ్‌ సింగ్‌.. బ్రిజ్‌భూషణ్‌ సన్నిహితుడు కావడంతో సమాఖ్యలో తాము కోరుకున్న మార్పును ఆశించలేమని బజ్‌రంగ్‌ బృందం అంటోంది. డబ్ల్యూఎఫ్‌ఐపై ఐఓఏ నిషేధం కొనసాగుతున్న నేపథ్యంలో సమాఖ్య సెలక్షన్స్‌ ఎలా నిర్వహిస్తుందని బజ్‌రంగ్‌ ప్రశ్నించాడు.  బజ్‌రంగ్‌ ప్రస్తుతం రష్యాలో శిక్షణ తీసుకుంటున్నాడు. WFI సెలక్షన్స్‌ ఆధారంగానే వచ్చే జరిగే ఒలింపిక్‌ క్వాలిఫయర్‌కు జట్టును ఎంపిక చేయనున్నారు.


WFIపై సస్పెన్షన్‌ ఎత్తివేత
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI)కి భారీ ఊరట లభించింది. భారత రెజ్లింగ్‌ సమాఖ్యపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ యునైటెడ్‌ వరల్డ్‌ రెజ్లింగ్‌ (United World Wrestling) కీలక నిర్ణయం తీసుకుంది. WFIపై నిషేధం ఎత్తివేత నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని మంగళవారం (ఫిబ్రవరి 13న) రాత్రి ప్రకటించింది. అప్పటి డబ్ల్యూఐ చీఫ్ బ్రిజ్ భూషణ్‌పై మహిళా రెజ్లర్లు వేధింపులు, అత్యాచార ఆరోపణలతో ఆందోళన బాట పట్టడంతో నిర్ణీత గడువులోపు ఎన్నికలు నిర్వహించలేకపోయారు. దాంతో భారత రెజ్లింగ్ సమాఖ్యను యునైటెడ్‌ వరల్డ్‌ రెజ్లింగ్‌ గత ఏడాది సస్పెండ్‌ చేయడం తెలిసిందే.