Modi Adilabad Tour: ఎన్నో ఏళ్లుగా ఆదిలాబాద్ జిల్లా ప్రజలు ఎదురుచూస్తున్నా కల సిసిఐ పునరుద్ధరణ, ఎయిర్ పోర్ట్, ఆదిలాబాద్ - ఆర్మూర్ రైల్వే లైన్. తొలిసారిగా ప్రధాని నరేంద్ర మోడీ రాకతో ఆ కల నెరవేరుతుందని ఎదురుచూస్తున్న జిల్లా ప్రజలకు నిరాశే మిగిలింది. ఆదిలాబాద్ జిల్లాకు విచ్చేసిన ప్రధాని నరేంద్ర మోడీ పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. అయితే అదిలాబాద్ జిల్లా ప్రజలు ఎన్నో ఎళ్లుగా ఎదురుచూస్తున్న చిరకాల వాంఛ ఏయిర్ పోర్ట్, ఆర్మూర్ రైల్వే లైన్, సిసిఐ పునరుద్ధరణ, యునివర్సిటీ గురించీ ప్రధాని నరేంద్ర మోడీ ఎలాంటి ప్రస్తావన చేయలేదు. దీంతో జిల్లా ప్రజలు నిరాశకు గురయ్యారు.
40 ఏళ్ల తర్వాత తొలిసారిగా దేశ ప్రధాని ఆదిలాబాద్ జిల్లాకు వస్తున్న తరంలో అందరూ ఎంతో ఆసక్తిగా ఏయిర్ పోర్ట్, ఆర్మూర్ రైల్వే లైన్, సిసిఐ పునరుద్ధరణ, యూనివర్సిటీల గురించీ ఎదురు చూశారు. కానీ ప్రధాని నరేంద్ర మోడీ ఈ విషయంలో ఏం మాట్లాడలేదు. జిల్లా అభివృద్ధికి ఎయిర్ పోర్ట్, రైల్వే లైన్, యూనివర్సిటీ, సీసీఐ ఫ్యాక్టరీ పునరుద్ధరణతో ఎంతో మందికి ఉపాధి అవకాశాలు లభించనుంది. ఈ అంశాల పట్ల ప్రధాని మోడీ మాట్లాడకపోవడంతో అందరూ నిరాశకు లోనయ్యారు.
నాలుగు డిమాండ్‌లు ప్రస్తావించిన ఎంపీ సోయం - మిగతా సమస్యలపు ప్రస్తావిస్తుంటే కూర్చోబెట్టిన నేతుల
అదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రియదర్శిని స్టేడియంలో సోమవారం జరిగిన బిజేపి విజయ సంకల్ప సభలో ముఖ్య అతిథులుగా హాజరైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీని అదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు సోయం బాపూరావ్ ఘనంగా స్వాగతించారు. అనంతరం సభలో ఎంపీ సోయం బాపురావు మాట్లాడుతూ.. గత 40 సంవత్సరాల నుంచి ప్రధానమంత్రి హోదాలో జిల్లాకు ఎవరూ రాలేదన్నారు. కానీ ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదిలాబాద్ జిల్లాకు రావడం వల్ల ఈ ప్రాంతం మొత్తం సస్యశ్యామలం అయిందన్నారు. అదిలాబాద్ జిల్లా ప్రజలకు 75 సంవత్సరాల నుంచి ఉన్న కోరిక అదిలాబాద్ నుంచి ఆర్మూర్ వరకు రైల్వే లైన్ అమలు చేయాలని మోడీని కోరారు. అదేవిధంగా అదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో ఓ యూనివర్సిటీ, జిల్లా కేంద్రంలో ఎయిర్ పోర్ట్ మంజూరు చేయాలనీ, సిసిఐ ఫ్యాక్టరీనీ పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేరారు. ఆదివాసీల జిల్లాలో ఇంకా అనేక సమస్యల్ని సోయం బాపురావ్ సభలో చెప్పే ప్రయత్నం చేయగా సమయం తక్కువగా ఉందని వెనుక నుంచి బీజేపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు సోయం బాపురావ్ ను గిల్లి సైగ చేశారు. దీంతో ఎంపి సోయం బాపురావ్ రెండూ నిమిషాల్లోనే ఆయన తన డిమాండ్లతో కూడిన ప్రసంగాన్ని ముగించారు. అయితే దీనిపై సర్వత్రా చర్చ కొనసాగుతోంది.
ఆదివాసి నాయకుల అరెస్టు ఖండించిన తుడుందెబ్బ రాష్ట్ర కార్యనిర్వాహక అద్యక్షులు గోడం గణేష్
ప్రధాని నరేంద్ర మోడీ ఆదిలాబాద్ జిల్లా పర్యటన నేపథ్యంలో ఆదివాసీ సంఘాల నాయకులను అర్థరాత్రి నుంచే అరెస్టులు చేయడం సరికాదని ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు గోడం గణేష్ అన్నారు. అడవుల జిల్లాగా పేరుందిన ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసుల అనేక సమస్యల్ని ప్రధాని నరేంద్ర మోడీకీ తాము వినతి పత్రాలు అందించడానికి సిద్దంగా ఉన్న తరుణంలో అర్థరాత్రి నుంచే తమని పోలీసులు అరెస్టు చేశారని, ఇలా జిల్లాలో అనేక మంది ఆదివాసి నాయకులను అర్థరాత్రి నుంచే అరెస్టులు చేసి తమ సమస్యల పరిష్కారానికి విఘాతం కల్పించారని ఆరోపించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీలతోపాటు అనేకమంది ఆదివాసేతరులు సైతం నివసిస్తున్నారని ఆదివాసులకు ముఖ్యమైనటువంటి అటవీ పోడు భూముల సమస్యలు, అటవీ చట్టాల వల్ల కలుగుతున్న అనేక ఇబ్బందులను ఇతర మౌలిక సదుపాయాల గురించి వివరింనిచడానికి యత్నిస్తే అరెస్టులు చేశారన్నారు.
ఆదివాసీల ఖిల్లాగా పేరొందిన అదిలాబాద్ జిల్లాలో ఆదివాసి ఎంపిని సైతం పూర్తీ సమస్యల్ని చెప్పకుండానే కొద్దీ నిమిషాల్లోనే ఆయన ప్రసంగాన్ని ముగించారని, దీని అంతర్యమేంటని, ఉన్న సమస్యల్ని ఎంపీ చెబుతుంటే సమయం లేదని అలా వెనుక నుంచి సైగ చేసి సమస్యలను చెప్పకుండానే వ్యవహరించడం పట్ల పలువురు ఆదివాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని రాక సందర్భంగా ఆదిలాబాద్ జిల్లాలో కొన్ని ఆదివాసి సంఘాల నాయకులను పోలీసులు అర్ధరాత్రి నుంచి అరెస్టు చేసారు. దీంతో ఆదివాసీల్లో తీవ్ర నిరుత్సాహం నెలకొంది.