సచిన్‌ తెందూల్కర్‌.. భారత క్రికెట్‌కు ఓ ఎమోషన్‌! అతనాడితే లోకమే ఆడింది. అతడు పరుగులు చేస్తే ప్రపంచం సంతోషించింది. అతడి బ్యాటింగ్‌తో యువత స్ఫూర్తి పొందింది. యువరాజ్‌ సింగ్‌ నుంచి విరాట్‌ కోహ్లీ వరకు ఎంతోమంది అతడిని చూసే క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకున్నారు. అలాంటిది అతడు అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నప్పుడు అభిమానులు ఎంత భావోద్వేగానికి గురై ఉంటారో అర్థం చేసుకోవచ్చు. టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్ విరాట్‌ కోహ్లీ ఇందుకు భిన్నమేమీ కాదు!


Sachin Tendulkar Retires


మాస్టర్‌ బ్లాస్టర్‌ రిటైర్‌ అయినప్పుడు విరాట్‌ కోహ్లీ ఓ అద్భుతమైన బహుమతిని ఆయనకు ఇచ్చాడు. తన తండ్రి నుంచి పొందిన ఆ ఆస్తి  కన్నా ఎక్కువ విలువైందని తన వద్ద లేదన్నాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు మళ్లీ ఆ గిఫ్ట్‌ను సచిన్ విరాట్‌కు తిరిగిచ్చేశాడు. 'నీ చివరి శ్వాస విడిచే వరకు జాగ్రత్తగా నీ వద్దే ఉంచుకో' అని చెప్పాడు. 2013లో చోటు చేసుకున్న ఈ సంఘటన గురించి సచిన్‌ తాజాగా ఓ విలేకరికి వివరించాడు.


Sachin Tendulkar emotion Moments


'వీడ్కోలు పలికిన రోజు ఒంటరిగా నేనో మూలకు కూర్చున్నాను. నా భుజాలపై ఓ టవల్‌ ఉంది. చాలా భావోద్వేగానికి గురవ్వడంతో దాంతో నా కన్నీళ్లను తుడుచుకుంటున్నాను. అప్పుడే విరాట్‌ నా దగ్గరికి వచ్చాడు. అతడి తండ్రి నుంచి వచ్చిన ఓ పవిత్రమైన దారాన్ని నాకు బహుమతిగా ఇచ్చాడు' అని అమెరికా జర్నలిస్టు గ్రాహమ్‌ బెన్‌సింగర్‌ యూట్యూబ్‌ ఛానళ్లో సచిన్‌ చెప్పాడు.


Virat Kohli Gift to Sachin Tendulkar


'మనం సాధారణంగా మణికట్టుకు పవిత్రమైన దారాలను కట్టుకుంటాం. ఇండియాలో చాలామంది అలాగే చేస్తారు. నా తండ్రీ నాకు అలాంటి దారమే ఒకటిచ్చాడు. అదెప్పుడూ నా బ్యాగులోనే ఉంటుంది. నాకెప్పుడూ ఇదే అత్యంత విలువైందిగా అనిపిస్తుంది. నా తండ్రి నాకిచ్చిన ఈ పవిత్రమైన దారం కన్నా విలువైందని మరొకటి నా వద్ద లేదు. మీరు నాకెంత ప్రేరణ ఇచ్చారో చెప్పాలనుకున్నాను. మీరు నాకెంతో విలువైన వారు. అందుకే మీకీ చిన్న బహుమతి ఇస్తున్నా అని విరాట్‌ నాతో చెప్పాడు' అని సచిన్‌ వివరించారు.


Sachin Tendulkar returns Virat gift


ఆ తర్వాత కొన్నాళ్లకు సచిన్‌ ఆ బహుమతిని తిరిగి విరాట్‌ కోహ్లీకి ఇచ్చేశాడు. 'ఆ పవిత్ర దారాన్ని కొన్నాళ్లు నావద్దే ఉంచుకొని తిరిగి విరాట్‌కు ఇచ్చేశాను. నువ్విచ్చిన ఈ బహుమతికి వెలకట్టలేం. ఇది నీవద్దే ఉండాలి. ఇది నీ ఆస్తి. నీ తుది శ్వాస విడిచే వరకు ఇది నీతోనే ఉండాలంటూ అతడికి తిరిగిచ్చేశా. అది నాకో ఎమోషనల్‌ మూమెంట్‌. అదెప్పుడూ నాకో చిరస్మరణీయ జ్ఞాపకమే' అని సచిన్‌ వివరించాడు.