SA T20 League Rules: దక్షిణాఫ్రికా టీ20 లీగ్ (SAT20 League) గత కొన్ని రోజులుగా వార్తల్లో ఉంటూనే ఉంది. వాస్తవానికి దక్షిణాఫ్రికా టీ20 లీగ్ జనవరి 10వ తేదీ నుండి ప్రారంభం కానుంది. ఈ టోర్నమెంట్ మొదటి సీజన్‌లో మొత్తం ఆరు జట్లు ఉన్నాయి.
తమాషా ఏంటంటే... దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లోని మొత్తం ఆరు జట్లను ఐపీఎల్ జట్ల యాజమాన్యాలు కొనుగోలు చేశాయి. దక్షిణాఫ్రికా టీ20 లీగ్ తొలి సీజన్‌లో మొత్తం 33 మ్యాచ్‌లు జరగనుండగా, ఫైనల్ మ్యాచ్ ఫిబ్రవరి 11వ తేదీన జరగనుంది. ఇవి మాత్రమే కాకుండా ఈ లీగ్ రూల్స్ చాలా సరదాగా, క్రికెట్ మైదానంలో ఇంతకు ముందు చూడనివిగా ఉంటాయి.
దక్షిణాఫ్రికా లీగ్‌లో నియమాలు ఏమిటి?
దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లో టాస్ తర్వాత కెప్టెన్ తన జట్టును ఎంచుకోవచ్చు. నిజానికి ఇప్పటి వరకు ఏ టీ20 లీగ్‌లోనూ ఇటువంటి నిబంధన అందుబాటులో లేదు. టాస్ సమయంలో కెప్టెన్లందరూ ప్లేయింగ్ ఎలెవన్‌ని ప్రకటించాలి. అయితే ఈ లీగ్‌లో మాత్రం టాస్ సమయంలో, కెప్టెన్ తన 13 మంది ఆటగాళ్ల పేర్లను నామినేట్ చేయాల్సి ఉంటుంది. టాస్ తర్వాత కెప్టెన్ ఆ 13 మంది నుంచి 11 మంది ఆటగాళ్లతో కూడిన ప్లేయింగ్ XIని ఎంచుకోవచ్చు. మిగిలిన ఇద్దరు అదనపు ఆటగాళ్లుగా ఉంటారు.
ఓవర్ త్రో లేనట్లే
దక్షిణాఫ్రికా టీ20 లీగ్ మ్యాచ్‌లలో ఓవర్ త్రో పరుగులు అందుబాటులో ఉండవు. అదే సమయంలో ఈ లీగ్ మ్యాచ్‌లలో బోనస్ పాయింట్ల నియమాలు వర్తిస్తాయి. బ్యాట్స్‌మన్ ఫ్రీ హిట్‌లో బౌల్డ్ అయితే, అతను రన్స్ తీయలేడు.
ఐసీసీ నిబంధనల ప్రకారం ఫ్రీ హిట్‌లో బౌల్డ్ అయిన తర్వాత బ్యాట్స్‌మెన్ రన్స్ తీయవచ్చు. దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లో పవర్‌ప్లే రెండు భాగాలుగా ఉంటుంది. తొలిసారిగా 4 ఓవర్ల పవర్‌ప్లే, ఆ తర్వాత 2 ఓవర్ల పవర్‌ప్లే ఉంటుంది. ఈ లీగ్ మొదటి మ్యాచ్‌లో పార్ల్ రాయల్స్ జట్టు, ఎంఐ కేప్ టౌన్‌తో తలపడనుంది.