Rohit Sharma and Virat Kohli: టీ20 ప్రపంచకప్ నుంచి భారత జట్టులో అనేక ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి. ఇప్పుడు టీ20 ఇంటర్నేషనల్‌లో టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లికి చోటు దక్కదని తెలుస్తోంది. తాజాగా వినిపిస్తున్న కథనాల ప్రకారం ప్రకారం రోహిత్, విరాట్ ఇకపై టీ20 జట్టులోకి ఎంపిక కాబొరు.
కొద్ది రోజుల క్రితం టీమ్ ఇండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ మాట్లాడుతూ ఇప్పుడు జట్టు తదుపరి టీ20 ప్రపంచకప్‌కు సిద్ధమవుతోందని చెప్పాడు. దీంతో ఇప్పుడు టీ20 జట్టులోకి ఈ ఇద్దరు సీనియర్ బ్యాట్స్‌మెన్‌లను ఎంపిక చేయడం లేదని అప్పటి నుంచి ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి సీనియర్ ఆటగాళ్లను టీ20 జట్టుకు దూరం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌లో హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని యువ భారత జట్టు మంచి ప్రదర్శన చేసి 2-1తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. జట్టు ప్రదర్శనను చూసి బీసీసీఐ ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
టీ20కి దూరం కాలేదన్న రోహిత్
ప్రస్తుత భారత జట్టు కెప్టెన్ అయిన రోహిత్ శర్మ తన కెరీర్‌లో ఇప్పటివరకు మొత్తం 148 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడాడు. ఈ మ్యాచ్‌ల్లో 140 ఇన్నింగ్స్‌లలో 31.32 సగటుతో, 139.24 స్ట్రైక్ రేట్‌తో 3,853 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు, 29 హాఫ్ సెంచరీలు సాధించాడు. శ్రీలంకతో వన్డేకు ముందు ప్రెస్ కాన్ఫరెన్స్‌లో రోహిత్ మాట్లాడుతూ తాను టీ20లు అప్పుడే వదిలిపెట్టబోనన్నాడు. కానీ కోచ్ రాహుల్ ద్రవిడ్ వ్యాఖ్యలు మాత్రం వేరుగా ఉన్నాయి.
ఇక భారత జట్టుకు మాజీ కెప్టెన్ అయిన విరాట్ కోహ్లీ తన కెరీర్‌లో ఇప్పటివరకు మొత్తం 115 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడాడు. ఈ మ్యాచ్‌ల్లో 107 ఇన్నింగ్స్‌లలో 52.73 సగటుతో, 137.96 స్ట్రైక్ రేట్‌తో 4,008 పరుగులు చేశాడు. ఇందులో అతను ఒక సెంచరీ, 37 హాఫ్ సెంచరీలు సాధించాడు.