IND vs SL: భారత్-శ్రీలంక మధ్య 3 వన్డేల సిరీస్‌లో మొదటి మ్యాచ్ జనవరి 10వ తేదీన గౌహతిలో జరగనుంది. భారత జట్టు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ ఈ సిరీస్ నుంచి తిరిగి జట్టులోకి రానున్నాడు. గౌహతి వన్డేకు ముందు రోహిత్ శర్మ జట్టు కాంబినేషన్‌తో సహా పలు అంశాలపై మాట్లాడాడు.


తొలి వన్డేలో ప్లేయింగ్ ఎలెవన్‌లో ఇషాన్ కిషన్‌కు చోటు దక్కదని రోహిత్ శర్మ స్పష్టం చేశాడు. ఇషాన్ కిషన్ స్థానంలో, టీమ్ మేనేజ్‌మెంట్ శుభమన్ గిల్‌పై విశ్వాసం వ్యక్తం చేసింది. దీంతో తొలి వన్డేలో రోహిత్ శర్మతో కలిసి శుభ్‌మన్ గిల్ ఓపెనింగ్ చేయనున్నాడు.


ఇషాన్ కిషన్ బెంచ్ పైనే
ఇటీవలే బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీతో రికార్డు సృష్టించాడు, అయితే శ్రీలంకతో జరిగే మొదటి వన్డేలో మాత్రం సిట్ అవుట్ అవ్వాల్సి ఉంటుంది. ఈ విధంగా రోహిత్ శర్మతో పాటు శుభమాన్ గిల్ ఓపెనర్‌గా మైదానంలో కనిపించనున్నాడు.


బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి వన్డేలో రోహిత్ శర్మ గాయపడ్డాడు. ఆ తర్వాత సిరీస్‌లోని మిగిలిన 2 మ్యాచ్‌ల నుంచి భారత కెప్టెన్ తప్పుకావాల్సి వచ్చింది. ఇది కాకుండా బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో రోహిత్ శర్మ భాగం కాలేదు. శ్రీలంకతో టీ20 సిరీస్‌లో రోహిత్ శర్మ లేకపోవడంతో హార్దిక్ పాండ్యా కమాండ్ తీసుకున్నాడు.


గౌహతిలో తొలి వన్డే
దీంతో పాటు శ్రీలంకతో జరిగే సిరీస్‌లో జస్‌ప్రీత్ బుమ్రా టీమ్ ఇండియాలో భాగం కావడం లేదు. నిజానికి, జాతీయ క్రికెట్ అకాడమీ నెట్‌లో బౌలింగ్ చేస్తున్నప్పుడు జస్‌ప్రీత్ బుమ్రా కొంచెం ఇబ్బంది పడ్డాడని రోహిత్ శర్మ చెప్పాడు. ఈ సిరీస్‌లోని తొలి వన్డే మంగళవారం గౌహతిలో జరగనుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది.


భారత్-శ్రీలంక వన్డే సిరీస్‌లో రెండో మ్యాచ్ జనవరి 12వ తేదీన జరగనుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ ఈ మ్యాచ్‌కు వేదిక కానుంది. సిరీస్‌లో మూడో, చివరి మ్యాచ్‌ జనవరి 15వ తేదీన జరగనుంది. చివరి మ్యాచ్‌లో తిరువనంతపురం వేదికగా భారత్, శ్రీలంక జట్లు తలపడనున్నాయి.