ఢిల్లీ వేదికగా అప్ఘానిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఏకంగా సెంచరీతో కదం తొక్కడంతో పాటు మూడు రికార్డులను కూడా సొంతం చేసుకున్నాడు. తొలుత అంతర్జాతీయ కెరీర్‌లో అత్యధిక సిక్సర్ల రికార్డును సాధించాడు. ఇప్పటివరకు యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ (553) పేరుతో ఉన్న రికార్డును రోహిత్ బద్దలు కొట్టాడు. 

 

 వన్డే ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక సెంచరీలు చేసిన తొలి ఆటగాడిగా రోహిత్ శర్మ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఆప్ఘనిస్తాన్‌పై సెంచరీ చేసిన రోహిత్‌కు ప్రపంచకప్ చరిత్రలో ఇది ఏడో సెంచరీ. 2019 వన్డే ప్రపంచకప్‌లో ఐదు సెంచరీలు చేసిన రోహిత్.. అంతకుముందు 2015లోనూ ఓ సెంచరీ చేశాడు. దీంతో మొత్తం అతడి ఖాతాలో ఏడు సెంచరీలు ఉన్నాయి. రెండో స్థానంలో ఉన్న సచిన్ కేవలం ఆరు సెంచరీలు మాత్రమే చేశాడు. శ్రీలంక క్రికెట్ దిగ్గజం సంగక్కర, ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం రికీ పాంటింగ్ ఐదు సెంచరీలతో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. డేవిడ్ వార్నర్ ఖాతాలో ఇప్పటివరకు నాలుగు వన్డే ప్రపంచకప్ సెంచరీలు ఉన్నాయి. వన్డే ప్రపంచకప్ చరిత్రలో అత్యంత వేగంగా (63 బంతుల్లో) సెంచరీ చేసిన భారత ఆటగాడిగానూ రోహిత్ రికార్డు సాధించాడు.

 

వన్డే ప్రపంచకప్ 2023లో రోహిత్ శర్మ  మరో రికార్డు సాధించాడు. వరల్డ్ కప్ చరిత్రలో అత్యంత వేగంగా 1000 పరుగులు చేసిన బ్యాటర్ గా రోహిత్  అవతరించాడు.  రోహిత్ శర్మ 19  ఇన్నింగ్స్ ల్లో 1000 పరుగులు చేశాడు. దీంతో వరల్డ్ కప్ లో వేగంగా వెయ్యి పరుగులు చేసిన బ్యాటర్ గా డేవిడ్ వార్నర్ తో పాటు సమంగా నిలిచాడు. ఈ క్రమంలో మెగాటోర్నీలో 1000 పరుగులు దాటిన నాలుగో భారత బ్యాటర్​గా రోహిత్ చరిత్రకెక్కాడు. ఆస్ట్రేలియా విధ్వంసక ఓపెనర్ డేవిడ్ వార్నర్ కూడా 19 ఇన్నింగ్స్‌లలోనే వెయ్యి పరుగులు చేశాడు. సచిన్ టెండూల్కర్ (20 ఇన్నింగ్స్‌లు), ఏబీ డివిలియర్స్ (20 ఇన్నింగ్స్‌లు) రెండు, మూడు స్థానాల్లో నిలిచారు.

 

ఆఫ్గానిస్తాన్‌తో జరగుతున్న మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. కేవలం 63 బంతుల్లోనే రోహిత్‌ శర్మ తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 84 బంతులు ఎదుర్కొన్న రోహిత్‌.. 16 ఫోర్లు, 5 సిక్స్‌లతో 131 పరుగులు చేశాడు. తద్వారా పలు అరుదైన రికార్డులను హిట్‌మ్యాన్‌ తన పేరిట లిఖించుకున్నాడు. వరల్డ్‌కప్‌లో ఓవరాల్‌గా అత్యంతవేగవంతమైన సెంచరీ చేసిన ఆరో ఆటగాడిగా రోహిత్‌ నిలిచాడు. ఈ జాబితాలో దక్షిణాఫ్రికా ఆటగాడు ఐడైన్‌ మారక్రమ్‌ తొలి స్ధానంలో ఉన్నాడు. ఈ ఏడాది వరల్డ్‌కప్‌లో శ్రీలంకపై కేవలం 49 బంతుల్లోనే సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.

 

వన్డేల్లో ఓపెనర్‌గా అత్యధిక సెంచరీలు చేసిన రెండో ఆటగాడిగా రోహిత్ నిలిచాడు. రోహిత్‌ ఇప్పటివరకు ఓపెనర్‌గా 29 సెంచరీలు చేశాడు. ఈ క్రమంలో శ్రీలంక క్రికెట్‌ దిగ్గజం సనత్‌ జయసూర్య(28)ను వెనక్కినెట్టాడు.