Australian Open Winner Rohan Bopanna: సిడ్నీ: భారత టెన్నిస్‌ స్టార్‌ రోహన్ బోపన్న చరిత్ర సృష్టించాడు. మాథ్యూ ఎబ్డెన్‌తో కలిసి ఆస్ట్రేలియా ఓపెన్‌ టెన్నిస్‌ మెన్స్‌ డబుల్స్‌ను టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. ఫైనల్లో ఆస్ట్రేలియన్‌ ప్లేయర్ ఎబ్డెన్‌తో కలిసి ఆడిన బోపన్న 7-6,7-5 తేడాతో ఇటలీ జోడి సిమోన్‌- వావాసోరి జోడీపై జయభేరి మోగించారు. తద్వారా తొలిసారి పురుషుల డబుల్స్‌ గ్రాండస్లామ్‌ టైటిల్‌ నెగ్గిన ఆటగాడిగా భారత వెటరన్ ఆటగాడు రోహన్ బోపన్న నిలిచాడు. అతిపెద్ద వయసులో ఆస్ట్రేలియా గ్రాండ్ స్లామ్ నెగ్గిన ఆటగాడిగానూ 43 ఏళ్ల రోహన్ బోపన్న రికార్డులు తిరగరాశాడు. ఇటీవల అతిపెద్ద వయసులో డబుల్స్ లో నెంబర్ వన్ ర్యాంక్ చేరుకున్న రోహన్ బోపన్న తాజాగా గ్రాండ్ స్లామ్ డబుల్స్ విజేతగా అవతరించాడు.


Photo Credit: Twitter


మొత్తం గంటా 39 నిముషాలు జరిగిన తుదిపోరులో ఇటలీ జోడీ నుంచి తీవ్ర పోటీ ఎదురైంది. కానీ తమ అనుభవంతో బోపన్న, ఎబ్డెన్ జోడీ విజయాన్ని అందుకుంది. ఒకదశలో 3-4 తేడాతో రెండో సెట్‌లో వెనకబడినా.. బోపన్న జోడీ తర్వాత పుంజుకుని సెట్ నెగ్గింది. దిగ్గజ ఆటగాళ్లు లియాండర్‌ పేస్‌, మహేశ్‌ భూపతి తర్వాత  మెన్స్‌ డబుల్స్‌ టైటిల్‌ నెగ్గిన భారత టెన్నిస్‌ ఆటగాడిగా బోపన్న నిలిచాడు. కాగా, ఇటీవల కేంద్ర ప్రభుత్వం రోహన్ బోపన్నను పద్మశ్రీ పురస్కారం ప్రకటించడం తెలిసిందే.






2017లో మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్ నెగ్గాడు రోహన్ బోపన్న. తాజాగా ఆస్ట్రేలియా ఓపెన్ లో మెన్స్ డబుల్స్ విభాగంలో విజేతగా అవతరించాడు. అయితే 60 ప్రయత్నాలలో విఫలమైన బోపన్న.. అందర్నీ ఆశ్చర్యపరుస్తూ 61వ ప్రయత్నంలో అది కూడా 43 ఏళ్ల లేటు వయసులో మెన్స్ డబుల్స్ టైటిల్ సాధించాడు. మహిళల విభాగంలో సానియా మిర్జా డబుల్స్ టైటిల్స్ నెగ్గారు.