ఆస్ట్రేలియాలో రిషభ్ పంత్‌ వీరోచిత ఇన్నింగ్సులను ఎవరూ మర్చిపోలేరు. ఆతిథ్య జట్టు కంచుకోట గబ్బాకు అతడి బ్యాటింగ్‌ ధాటికి బీటలు వారాయి. టీమ్‌ఇండియా వరుస విజయాలు సాధించింది. వరుసగా రెండో సారీ బోర్డర్‌ గావస్కర్‌ ట్రోఫీని సొంతం చేసుకుంది. అయితే గబ్బాలో పంత్‌ బ్యాటింగ్‌కు ప్రత్యర్థి జట్టే కాకుండా టీమ్‌ఇండియా సైతం భయపడిందని యువ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ వెల్లడించాడు.


గబ్బాలో రిషభ్ పంత్‌ బ్యాటింగ్‌ చేస్తున్నంత సేపు టీమ్‌ఇండియా డ్రస్సింగ్‌ రూమ్‌లో భావోద్వేగాలు కట్టలు తెంచుకున్నాయని సిరాజ్‌ తెలిపాడు. అది అతడి జీవితంలోనే అత్యంత కీలక ఇన్నింగ్స్‌ అని పేర్కొన్నాడు. పంత్‌ ఆడే రిస్కీ షాట్లు రెండు జట్ల డ్రస్సింగ్‌ రూమ్‌లో భయానక వాతావరణాన్ని సృష్టించాయని వెల్లడించాడు. విజయం సాధించేంత వరకు అతడు క్రీజులోనే ఉండాలని జట్టు సభ్యులు ప్రార్థించారని అన్నాడు.


'ఆ సమయంలో డ్రస్సింగ్‌ రూమ్‌ ఎంత నర్వస్‌గా ఉందో మాటల్లో చెప్పడం కష్టం. రిషభ్ పంత్‌ సొంత జట్టునూ భయపెట్టే రకం! ఇక ప్రత్యర్థి డ్రస్సింగ్‌ రూమ్‌లో ఎంత భయం సృష్టించాడో మనం ఊహించొచ్చు. అతడు క్రీజులోనే ఉండాలని మేం ప్రార్థించాం. అతడు బ్యాటింగ్‌ చేస్తూ ఉండాలని కోరుకున్నాం. ఎందుకంటే అతడు క్రీజులో ఉంటే మేం కచ్చితంగా గెలుస్తామని తెలుసు' అని సిరాజ్‌ తెలిపాడు.


గబ్బాలో విజయం సాధించగానే ఉద్వేగం ఆపుకోలేక పోయామని సిరాజ్‌ అన్నాడు. జాతీయ జెండాను చేతిలో పట్టుకొని మైదానం చుట్టూ తిరిగామని వెల్లడించాడు. 'రిషభ్‌ షాట్లు ఆడిన ప్రతిసారీ అతడు ఔటవ్వొద్దని కోరుకున్నాం. మరికొంత సమయం క్రీజలో ఉండాలని విశ్వసించాం.  గబ్బాలో ఆస్ట్రేలియా రికార్డును బద్దలు చేసినందుకు ప్రతి ఒక్కరం సంతోషించాం. ఆ వేడుకలను తలచుకుంటే ఇప్పటికీ రోమాలు నిక్కబొడుస్తాయి. చేతిలో జాతీయ జెండా పట్టుకొని మైదానం చుట్టూ తిరిగడాన్ని ఎప్పటికీ మర్చిపోలేం అని సిరాజ్‌ చెప్పాడు.


Read Also: IND vs WI: విరాట్‌ ఊపు తీసుకొస్తే.. రోహిత్‌ ప్రశాంతత తెస్తాడన్న మాజీ ఆల్‌రౌండర్‌


Read Also: Rohit Sharma Captaincy: రోహిత్‌ కెప్టెన్సీలో ఇష్టమైంది అదే! కోహ్లీ సారథ్యంలో ఆడిన యువ పేసర్‌ అభిప్రాయం ఇదీ!