Royal Challengers Bangalore vs Mumbai Indians: ఐపీఎల్‌ను బెంగళూరు ఘన విజయంతో ప్రారంభించింది. చిన్నస్వామి స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎనిమిది వికెట్లతో భారీ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. భారీ ఇన్నింగ్స్ ఆడిన తిలక్ వర్మ (84 నాటౌట్: 46 బంతుల్లో, తొమ్మిది ఫోర్లు, నాలుగు సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆ లక్ష్యాన్ని కేవలం 16.2 ఓవర్లలోనే రెండు వికెట్ల నష్టానికి ఛేదించి విజయాన్ని సాధించింది. ఛేజ్ మాస్టర్ కింగ్ కోహ్లీ (82 నాటౌట్: 49 బంతుల్లో, ఆరు ఫోర్లు, ఐదు సిక్సర్లు) చివరి వరకు క్రీజులో నిలబడ్డాడు. కెప్టెన్, మరో ఓపెనర్ ఫాఫ్ డు ఫ్లెసిస్ (73: 43 బంతుల్లో, ఐదు ఫోర్లు, ఆరు సిక్సర్లు) కూడా అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు.


ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా
172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఏ దశలోనూ ముంబై నుంచి పోటీ ఎదురు కాలేదు. ఓపెనర్లు విరాట్ కోహ్లీ (82 నాటౌట్: 49 బంతుల్లో, ఆరు ఫోర్లు, ఐదు సిక్సర్లు), ఫాఫ్ డుఫ్లెసిస్ (73: 43 బంతుల్లో, ఐదు ఫోర్లు, ఆరు సిక్సర్లు) భారీ షాట్లు కొడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. విరాట్ కోహ్లీ ఏడు పరుగుల వద్ద ఇచ్చిన రిటర్న్ క్యాచ్‌ను జోఫ్రా ఆర్చర్ అందుకోలేకపోయాడు. అది ముంబై పాలిట శాపంగా మారింది. ఓపెనర్లిద్దరూ బౌండరీలతో చెలరేగిపోయారు.


మొదటి వికెట్‌కు 148 పరుగులు జోడించిన అనంతరం అర్షద్ ఖాన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి ఫాఫ్ డుఫ్లెసిస్ అవుటయ్యాడు. తర్వాత వచ్చిన దినేష్ కార్తీక్ (0: 3 బంతుల్లో) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయాడు. అయితే విరాట్ మాత్రం మ్యాక్స్‌వెల్‌తో (12 నాటౌట్: 3 బంతుల్లో, రెండు సిక్సర్లు) కలిసి టార్గెట్‌ను పూర్తి చేశాడు.


తిలక్ వర్మ వన్ మ్యాన్ షో
టాస్ ఓడిన ముంబై ఇండియన్స్ మొదట బ్యాటింగ్‌కు దిగింది. కానీ ముంబై టాప్ ఆర్డర్ పూర్తిగా కొలాప్స్ అయింది. రోహిత్ శర్మ (1: 10 బంతుల్లో), ఇషాన్ కిషన్ (10: 13 బంతుల్లో, రెండు ఫోర్లు), కామెరాన్ గ్రీన్ (5: 4 బంతుల్లో, ఒక ఫోర్), సూర్యకుమార్ యాదవ్ (15: 16 బంతుల్లో, ఒక ఫోర్) విఫలం అయ్యారు. దీంతో ముంబై 48 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. రన్‌రేట్ కనీసం ఆరు పరుగులు కూడా లేదు.


ఈ దశలో తిలక్ వర్మ (84 నాటౌట్: 46 బంతుల్లో, తొమ్మిది ఫోర్లు, నాలుగు సిక్సర్లు) ముంబైని ఆదుకున్నాడు. ఐదో వికెట్‌కు నేహాల్ వధేరాతో (21: 13 బంతుల్లో, ఒక ఫోర్, రెండు సిక్సర్లు) కలిసి 50 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను కుదుటపరిచాడు. నేహాల్ అవుటయ్యాక పూర్తిగా వన్ మ్యాన్ షో తరహాలో చెలరేగి ఆడాడు. తిలక్ దూకుడైన ఆటతీరుతో ముంబై చివరి ఐదు ఓవర్లలో 69 పరుగులు సాధించింది. దీంతో ముంబై 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. బెంగళూరు బౌలర్లలో కరణ్ శర్మ రెండు వికెట్లు పడగొట్టాడు. మహ్మద్ సిరాజ్, రీస్ టాప్లే, ఆకాష్ దీప్, హర్షల్ పటేల్, బ్రేస్‌వెల్‌లకు తలో వికెట్ దక్కింది.