Ravindra Jadeja ICC Rankings: టీమ్‌ఇండియా సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) అద్భుతం చేశాడు. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ ర్యాంకుకు చేరుకున్నాడు. కొన్నేళ్లుగా ఆ పొజిషన్‌లో ఉంటున్న వెస్టిండీస్ క్రికెటర్ జేసన్ హోల్డర్‌ను వెనక్కి నెట్టాడు. శ్రీలంకపై తిరుగులేని బ్యాటింగ్, బౌలింగ్ ప్రదర్శనతో జడ్డూ ఈ ఘనత అందుకున్నాడు.
మొహాలి వేదికగా జరిగిన టెస్టులో రవీంద్ర జడేజా 175 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అంతేకాకుండా రెండు ఇన్నింగ్సుల్లో కలిపి 9 వికెట్లు పడగొట్టి టీమ్‌ఇండియాకు ఇన్నింగ్స్ తేడాతో విజయం అందించాడు. దాంతో జేసన్ హోల్డర్ ర్యాంకుకు గండికొట్టాడు. 2021 ఫిబ్రవరి నుంచి అగ్రస్థానంలో ఉన్న అతడిని కిందకు దింపాడు.
రవీంద్ర జడేజా ఐసీసీ టెస్టు ఆల్‌రౌండర్ జాబితాలో నంబర్ వన్‌గా నిలవడం ఇది రెండోసారి. 2017, ఆగస్టులో ఒక వారం పాటు ఈ పొజిషన్‌లో కొనసాగాడు. ఇక బౌలింగ్ ర్యాంకింగ్స్‌లోనూ జడ్డూ మూడు స్థానాలు ఎగబాకి 17 ర్యాంకుకు చేరుకున్నాడు. బ్యాటింగ్‌లో 54 నుంచి 37కు వచ్చాడు.
లంక మ్యాచులో టీమ్‌ఇండియా 228/5తో ఉండగా జడ్డూ ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. 76 స్ట్రైక్‌రేట్‌తో 228 బంతుల్లోనే 175 పరుగులు చేశాడు. ఇందులో 17 బౌండరీలు, 3 సిక్సర్లు ఉన్నాయి. రెండు ఇన్నింగ్సుల్లో కలిపి జడ్డూ 9 వికెట్లు తీశాడు. ఆఖరి వికెట్‌ను గనక అశ్విన్ తీయకపోయి ఉంటే జడ్డూకు మరో రికార్డు దక్కేదేమో! ఒక టెస్టులో 150 పరుగులతో పాటు 10 వికెట్లు తీసిన ఒకే ఒక్కడుగా నిలిచేవాడు. ఇక విరాట్ కోహ్లీ 2 స్థానాలు మెరుగై 5లో ఉన్నాడు. త్రుటిలో సెంచరీ మిస్సైన రిషభ్ పంత్ టాప్ 10లోకి వచ్చాడు.