Ravi Shastri backs Shahid Afridi: కాలం గడిచే కొద్దీ వన్డే క్రికెట్‌ బోర్‌ కొడుతోందని టీమ్‌ఇండియా మాజీ కోచ్‌ రవిశాస్త్రి అంటున్నాడు. వన్డేలను 50 నుంచి 40 ఓవర్లకు కుదించాలని పేర్కొన్నాడు. ఇదే అభిప్రాయం వ్యక్తం చేసిన పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌ షాహిద్‌ అఫ్రిదికి మద్దతు ఇచ్చాడు. భారత్‌, వెస్టిండీస్‌ రెండో వన్డేలో ఈ అంశంపై మాట్లాడాడు.


'ఆట నిడివి తగ్గించడం వల్ల ప్రమాదమేమీ లేదు. నిజానికి వన్డేలు మొదలైనప్పుడు 60 ఓవర్లు ఉండేవి. మేం 1983 ప్రపంచకప్‌ ఆడినప్పుడు 60 ఓవర్లే ఉండేవి. ఆ తర్వాత అన్ని ఓవర్లు కాస్త ఎక్కువేనని భావించారు. మరో వైపు 20-40 ఓవర్లకు తగ్గించేందుకు జనాలు ఇష్టపడలేదు. దాంతో 50 ఓవర్లకు బోర్డులు ఓటేశాయి. ఆ నిర్ణయం తీసుకొని చాలా కాలమైంది కాబట్టి 50 ఓవర్ల నుంచి 40కి ఎందుకు తగ్గించొద్దు! మనం ప్రోగ్రెసివ్‌గా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. 50 ఓవర్ల క్రికెట్‌ చాలా కాలంగా నడుస్తోంది' అని రవిశాస్త్రి అన్నాడు.



పాక్‌ మాజీ కెప్టెన్‌ షాహిద్‌ అఫ్రిదీ సైతం ఇలాగే మాట్లాడాడు. 'వన్డే క్రికెట్‌ ఇప్పుడు బోర్‌ కొడుతోంది. ఈ ఫార్మాట్‌ మనోరంజకంగా మారాలంటే 50 నుంచి 40 ఓవర్లకు తగ్గిస్తే బాగుంటుంది' అని పేర్కొన్నాడు.


ప్రస్తుతం టీ20 క్రికెట్‌ను అభిమానులు ఎక్కువగా ఎంజాయ్‌ చేస్తున్నారు. నిడివి తక్కువ కావడం, ఎక్కువ థ్రిల్‌ ఇస్తుండటం ఇందుకు ముఖ్య కారణాలు. 2019లో ఇంగ్లాండ్‌ ప్రపంచకప్‌ గెలిచిన తర్వాత ఈ ఫార్మాట్‌పై ఎవ్వరూ దృష్టి సారించడం లేదు. మరో వన్డే ప్రపంచకప్‌కు సుదీర్ఘ సమయం ఉంది. ఈ మధ్యలో రెండు టీ20 ప్రపంచకప్‌లు ఉన్నాయి. దాంతో అన్ని దేశాల బోర్డులు టీ20 ఫార్మాట్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాయి. పైగా అన్ని దేశాలు టీ20 లీగులు నిర్వహిస్తున్నాయి.