Karnataka vs Saurashtra Ranji Trophy Semi-Final: రంజీ ట్రోఫీ 2022-23 రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ కర్ణాటక, సౌరాష్ట్ర మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో సౌరాష్ట్ర అద్భుత ప్రదర్శనతో నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో సౌరాష్ట్ర జట్టు ఫైనల్‌కు చేరుకుంది. ఇప్పుడు ఫైనల్‌లో సౌరాష్ట్ర, బెంగాల్‌ తలపడనున్నాయి.


రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో కర్ణాటక తొలి ఇన్నింగ్స్‌లో 407 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 234 పరుగులు చేసింది. దీనికి సమాధానంగా సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌లో 527 పరుగులు చేసింది. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో సౌరాష్ట్ర ముందు 117 పరుగుల లక్ష్యం నిలిచింది. జట్టు తరఫున అద్భుత ప్రదర్శన చేసిన కెప్టెన్ అర్పిత్ వాసవాడ తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ సాధించాడు.


కర్ణాటక తొలి ఇన్నింగ్స్‌లో 407 పరుగులకు ఆలౌటైంది. ఈ క్రమంలో కెప్టెన్ మయాంక్ అగర్వాల్ డబుల్ సెంచరీ చేశాడు. 429 బంతులు ఎదుర్కొని 249 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 28 ఫోర్లు, ఐదు సిక్సర్లు ఉన్నాయి. వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ శ్రీనివాస్ 66 పరుగులు చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఆ జట్టు 234 పరుగులకు ఆలౌటైంది. ఈ ఇన్నింగ్స్‌లో కూడా మయాంక్ 55 పరుగులు సాధించాడు. మరో బ్యాటర్ నికిన్ జోస్ సెంచరీ చేశాడు. అతను 109 పరుగుల భారీ ఇన్నింగ్స్ ఆడాడు.


ఇక సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా 527 పరుగులు చేసింది. కెప్టెన్ అర్పిత్ వాసవాడ డబుల్ సెంచరీ చేశాడు. అతను 406 బంతులు ఎదుర్కొని 202 పరుగులు చేశాడు. అర్పిత్ ఇన్నింగ్స్‌లో 21 ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి. ఇక మరో బ్యాటర్ షెల్డన్ జాక్సన్ కూడా సెంచరీ చేశాడు. 23 ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 160 పరుగులు చేశాడు. ఇక చిరాగ్ జానీ 72 పరుగులు సాధించాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో అర్పిత్ 47 పరుగులు చేశాడు. చేతన్ సకారియా 24 పరుగులు చేశాడు.


ఫిబ్రవరి 16వ తేదీన సౌరాష్ట్ర జట్టు బెంగాల్‌తో పోటీపడనుంది. తొలి సెమీస్‌లో మధ్యప్రదేశ్‌ను 306 పరుగుల తేడాతో ఓడించి బెంగాల్ జట్టు ఫైనల్‌కు చేరుకుంది. ఈ టోర్నీలో ఇప్పటివరకు ధృవ్ షోరే అత్యధికంగా 860 పరుగులు చేశాడు. అతని ఖాతాలో మూడు సెంచరీలు ఉన్నాయి. ఇక ప్రశాంత్ చోప్రా ఐదు సెంచరీలతో ముందంజలో ఉన్నాడు. అయితే అత్యధిక పరుగులు చేసిన వారిలో ప్రశాంత్ చోప్రా ఐదో స్థానంలో ఉన్నాడు. అతను 783 పరుగులు సాధించాడు. ఫిబ్రవరి 16వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఫైనల్ జరగనుంది.