ఈ ప్రపంచకప్‌లోనే హై ఓల్టేజీ మ్యాచ్‌కు భారత్-పాకిస్థాన్ అస్తశస్త్రాలతో సిద్ధమవుతున్నాయి. ఈ మ్యాచ్‌ను చూసేందుకు అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అభిమానులతో పాటు అతిరథ మహారథులు ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా తిలకించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ మ్యాచ్‌ను చూసేందుకు సినీ, రాజకీయ పముఖులు తరలిరానున్నారు. అక్టోబర్ 14న అహ్మదాబాద్ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌ను చూసేందుకు రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ తరలిరానున్నారని తెలుస్తోంది.
ఇప్పటీకే బీసీసీఐ కార్యదర్శి గోల్డెన్ టిక్కెట్లు పొందిన రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ ఈ వేడుకకు హాజరై ఆటను వీక్షించనున్నారు. గోల్డెన్ టికెట్ అందుకున్న సచిన్ టెండూల్కర్ కూడా ఈ మ్యాచ్‌కు హాజరవుతారని తెలుస్తోంది. గోల్డెన్ టికెట్ అందుకున్న ప్రముఖులు ఆటను వీక్షించేందుకు వస్తారని గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి అనిల్ పటేల్ తెలిపారు. గోల్డెన్ టిక్కెట్ హోల్డర్‌లతో పాటు, ఈ హై ఓల్టేజ్ మ్యాచ్‌కు చాలామంది వీఐపీలు హాజరవుతారని భావిస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఊపిరి బిగపట్టి మరీ చూసే భారత్-పాక్ మ్యాచ్ అక్టోబర్ 14న జరగనుంది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ మైదానమైన గుజరాత్ అహ్మాదాబాద్‌లోని నరేంద్రమోదీ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ జరిగే నరేంద్ర మోదీ స్టేడియంపై బాంబు దాడి, రసాయన దాడులు చేస్తామన్న బెదిరింపులతో పోలీసులు కనివినీ ఎరుగని భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.
భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు NSG బ్లాక్ క్యాట్ కమెండోలను మోహరిస్తున్నట్లు అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్ జిఎస్ మాలిక్ తెలిపారు. NSGతో పాటు 7 వేలమంది పోలీసులను మోహరిస్తున్నట్లు వెల్లడించారు. అక్టోబర్ 14న జరిగే భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌పై ప్రపంచవ్యాప్తంగా దృష్టి ఉంటుందని.. అందుకే దానికి తగ్గట్లు ఏర్పాట్లు చేశామని మాలిక్ వివరించారు. బెదిరింపుల నేపథ్యంలో అత్యున్నత స్థాయి భద్రతా ఏర్పాట్లు చేశామని తెలిపారు. మ్యాచ్ నేపథ్యంలో నరేంద్రమోదీ స్టేడియం వద్ద ఎలైట్ టెర్రర్ నిరోధక దళం (NSG), ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (RAF), హోంగార్డులు, గుజరాత్ పోలీసులతో సహా దాదాపు 11 వేల మంది భద్రతా సిబ్బందిని మోహరించినట్లు వివరించారు. మ్యాచ్ సందర్భంగా అహ్మదాబాద్‌లో మతపరమైన సున్నితమైన ప్రాంతాల్లో శాంతిభద్రతలను పర్యవేక్షించేందుకు 4 వేలమంది హోంగార్డులను మోహరించినట్లు పోలీస్ కమిషనర్ వెల్లడించారు. 20 ఏళ్లలో అహ్మదాబాద్‌లో క్రికెట్ మ్యాచ్‌ల సందర్భంగా మతపరమైన హింస ఎప్పుడూ జరగలేదని అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్ జిఎస్ మాలిక్ గుర్తు చేశారు.
సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు. కేవలం ఐసీసీ మెగా ఈవెంట్స్‌లో మాత్రమే దాయాదులు తలపడుతున్నాయి. ఫలితంగా పాకిస్థాన్ జట్టు భారత్‌లో పర్యటించడం లేదు. చివరిసారిగా 2016లో టీ20 ప్రపంచకప్ ఆడేందుకు ఇక్కడికి వచ్చిన దాయాది జట్టు మళ్లీ ఏడేళ్ల తర్వాత వన్డే వరల్డ్ కప్ కోసం భారత్‌లో అడుగుపెట్టింది.