Vedaant Madhavan:  ప్రముఖ నటుడు మాధవన్ ప్రస్తుతం పుత్రోత్సాహంతో పొంగిపోతున్నారు. ఆయన తనయుడు వేదాంత్ మాధవన్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2023లో 7 పతకాలను గెలుచుకున్నాడు. వేదాంత్ సాధించిన ఘనతకు అన్నివైపుల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. మాధవన్ ఆనందానికి ఇదే కారణం.


మాధవన్ కుమారుడు వేదాంత్ మాధవన్ జాతీయ స్థాయి స్విమ్మర్. ఇప్పటికే చాలా పోటీల్లో ఎన్నో పతకాలను అతను గెలుచుకున్నాడు. తాజాగా ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2023 లో 5 స్వర్ణాలు, 2 రజతాలు సహా 7 పతకాలు కొల్లగొట్టాడు. ఈ సందర్భంగా వేదాంత్ తండ్రి మాధవన్ తన తనయుడి విజయాలను అభినందిస్తూ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టాడు. వేదాంత్ ప్రదర్శనకు చాలా గర్వంగా ఉంది. దేవుని దయతో 100మీ, 200మీ, 1500 మీటర్లలో స్వర్ణం.. 400 మీటర్లు, 800 మీటర్లలో రజతం సాధించాడు. అని మాధవన్ ట్వీట్ చేశాడు. 






మహారాష్ట్రకు అభినందనలు


అలాగే ఈ టోర్నీలో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన మహారాష్ట్ర జట్టుకు మాధవన్ అభినందనలు తెలిపారు. ఆ జట్టు మొత్తం 161 పతకాలు సాధించింది. వీటిలో 56 స్వర్ణాలు, 55 రజతాలు, 50 కాంస్య పతకాలు ఉన్నాయి. రెండు ట్రోఫీలు సాధించిన మహారాష్ట్ర జట్టుకు అభినందనలు. బాలుర జట్టు స్విమ్మింగ్ ఛాంపియన్ ట్రోఫీ, ఖేలో గేమ్స్ లో ఓవరాల్ ట్రోఫీ సాధించినందుకు శుభాకాంక్షలు. అని మాధవన్ అన్నారు. 


వేదాంత్ మాధవన్ గురించి..


వేదాంత్ మాధవన్ గత కొన్నేళ్లుగా స్విమ్మింగ్ లో రాణిస్తున్నాడు. ఈ యువ స్విమ్మర్ అనేక అంతర్జాతీయ స్విమ్మింగ్ పోటీల్లో పతకాలు సాధించాడు. స్విమ్మింగ్ లో భారతదేశానికి ఒలింపిక్ పతకం సాధించడమే తన లక్ష్యమని గతంలో 17 ఏళ్ల వేదాంత్ అన్నాడు. తనయుడి స్విమ్మింగ్ సాధన కోసం మాధవన్ దంపతులు తమ నివాసాన్ని 2021లో దుబాయ్ కు మార్చుకున్నారు. కొడుకును ఒలింపిక్స్ కోసం సన్నద్ధం చేస్తున్నారు. 


 










అరుదైన రికార్డు సాధించిన వేదాంత్..
ప్రముఖ నటుడు మాధవన్ కొడుకు వేదాంత్ స్విమ్మింగ్‌లో ఇప్పటికే ఎన్నో పతకాలు సాధించాడు. గత ఏడాది జూనియర్ నేషనల్ ఆక్వాటిక్స్‌లో అరుదైన రికార్డు సాధించాడు. భువనేశ్వర్‌లో జరిగిన ఈ పోటీల్లో 1500మీటర్ల ఫ్రీస్టైల్‌లో విన్నర్‌గా నిలిచాడు. 48వ జాతీయ ఆక్వాటిక్ ఛాంపియన్‌షిప్‌లో ఈ రికార్డు సృష్టించాడు. గతంలో ఈ ఫ్రీస్టైల్‌ను 16 నిముషాల్లో పూర్తి చేయగా, వేదాంత్ దాన్ని 6 నిముషాల్లోనే పూర్తి చేసి విజేతగా నిలిచాడు. అంతకు ముందు అద్వైత్ పేరిట ఉన్న రికార్డును చెరిపేశాడు. "నెవర్ సే నెవర్" అని కోట్ చేస్తూ వేదాంత్ స్విమ్మింగ్ వీడియోపై నటుడు మాధవన్ స్పందించారు.