Pakistan Super League: పాకిస్థాన్‌లోని క్వెట్టా నగరంలో బాంబు పేలుడు సంభవించింది. ఈ పేలుడు తర్వాత క్రికెట్ మ్యాచ్‌ను నిలిపివేయాల్సి వచ్చింది. నిజానికి పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో పెషావర్ జల్మీ, క్వెట్టా గ్లాడియేటర్స్ జట్లు తలపడ్డాయి.
బాబర్ ఆజం, సర్ఫరాజ్ ఖాన్ ఈ రెండు జట్లకు కెప్టెన్లుగా ఉన్నారు. అయితే పేలుడు తర్వాత మ్యాచ్‌ను మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. క్వెట్టాలోని మూసా మసీదు సమీపంలో ఈ బాంబు పేలుడు జరిగినట్లు పాక్ మీడియా పేర్కొంది. పేలుడు జరిగిన ప్రదేశం నగరానికి కేవలం 15 నుంచి 20 నిమిషాల దూరంలో ఉంది. అయితే ఈ బాంబు పేలుడుతో మ్యాచ్ మధ్యలోనే నిలిచిపోయింది.
సోషల్ మీడియాలో వీడియో వైరల్
మీడియా కథనాల ప్రకారం పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్ సందర్భంగా అభిమానులు స్టేడియంలో హింసకు పాల్పడ్డారు. వాస్తవానికి చాలా మంది అభిమానులు స్టేడియంలో, చుట్టుపక్కల రాళ్లు రువ్వడం కనిపించింది. సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలు చాలా వైరల్ అవుతున్నాయి.
ఈ బాంబు పేలుడులో కనీసం ఐదుగురు గాయపడినట్లు సమాచారం. క్వెట్టా పోలీస్ లైన్స్ ప్రాంతంలో పేలుడు సంభవించింది. గాయపడిన పోలీసులు నగరంలోని సివిల్ ఆసుపత్రిలో చేరారు. ఘటనా స్థలాన్ని భద్రతా బలగాలు చుట్టుముట్టాయని పోలీసు అధికారులు తెలిపారు.
ఆగిన పాకిస్థాన్ సూపర్ లీగ్ మ్యాచ్
పోలీసు అధికారుల ప్రకారం భద్రతా దళాలు సంఘటన స్థలానికి చేరుకున్నాయి. ఈ దాడికి బాధ్యత వహిస్తున్నట్లు నిషేధితం అయిన తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP) ప్రకటించింది. భద్రతా అధికారులను లక్ష్యంగా చేసుకున్నట్లు పేలుడు తర్వాత టీటీపీ తెలిపింది. పాకిస్థాన్‌లోని క్వెట్టా నగరంలో బాంబు పేలుడు సంభవించడం గమనార్హం. ఇక పాకిస్తాన్‌లో ఆసియా కప్ జరగడం కష్టమే.
ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) సమావేశం కూడా ఈరోజే జరిగింది. బీసీసీఐ కార్యదర్శి జైషా, పాక్ క్రికెట్ బోర్డ్ ఛైర్మన్ నజామ్ సేథీ భేటీ అయ్యారు. అయితే వీరిద్దరి మధ్య పెద్దగా చర్చలేమీ జరగలేదని సమాచారం. దీంతో ఆసియా కప్ 2023 నిర్వహణ ఎక్కడనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.
పలు నివేదికల ప్రకారం.. ఆసియా కప్- 2023 సీజన్ యూఏఈలో జరగనున్నట్లు సమాచారం. ఈ విధంగా జైషా, నజామ్ సేథీలు తమ భేటీలో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా అధికారికంగా ప్రకటన విడుదల కాలేదు. మార్చిలో ప్రకటించనున్నట్లు సమాచారం. పాక్ క్రికెట్ బోర్డ్ ఛైర్మన్ సేథీ తమ ఉద్దేశాన్ని జైషాతో చెప్పినట్లు నివేదికలు తెలిపాయి. 'పాక్ వేదికగా జరిగే ఆసియా కప్ లో భారత్ పాల్గొనకపోతే... భారత్ ఆతిథ్యం ఇచ్చే వన్డే ప్రపంచకప్ లో తమ జట్టు పాల్గొనదు' అనే విషయాన్ని నజామ్ సేథీ జైషా దృష్టికి తీసుకెళ్లినట్లు కథనాలు పేర్కొన్నాయి. ఇదే విషయాన్ని పీసీబీ మాజీ ఛైర్మన్ రమీజ్ రజా కూడా చెప్పారు.
అయితే ఈ ఏడాది ఆసియా కప్ యూఏఈలోనే జరగనున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే పాక్ ఆతిథ్యం ఇస్తే భారత్ ఆడదని ఇప్పటికే జైషా అన్నారు. ఒకవేళ టీమిండియా ఆడకపోతే ఆసియా కప్ వెలవెలబోతుంది. పాక్- భారత్ మ్యాచ్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి ఉంటుంది. అలాగే ఆదాయం కూడా బాగా వస్తుంది. కాబట్టి భారత్ లేకుండా ఆసియా కప్ నిర్వహించడం అసాధ్యమే. అయితే భారత్ ఆడాలంటే వేదిక మార్చడం అనివార్యం. కాబట్టి భారత్ ఏ నిర్ణయం తీసుకున్నా పాక్ అనుసరించాల్సిందేనని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.