గత ఒలింపిక్స్‌( Tokyo Olympics) లో కాంస్యం(bronze medallist) తో నవ శకానికి నాంది పలికిన భారత పురుషుల హాకీ జట్టు(Indian men's hockey  Team) ఈసారి కూడా విశ్వ క్రీడల్లో సత్తా చాటాలని భావిస్తోంది. టోక్యో ఒలింపిక్స్‌లో అద్భుత ఆటతీరుతో కాంస్యాన్ని సాధించి దాదాపు మూడు దశాబ్దాల తర్వాత అంతర్జాతీయ వేదికపై భారత ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన పురుషుల హాకీ జట్టు మరోసారి అలాంటి ప్రదర్శనే పునరావృతం చేయాలని చూస్తోంది. కానీ పారిస్‌ ( Paris )ఒలింపిక్స్‌ పురుషుల హాకీ జట్టుకు కఠినమైన డ్రా ఎదురుకావడం ఆందోళన కలిగిస్తోంది.

 

కఠినమైన గ్రూప్‌లో...  

పారిస్‌ ఒలింపిక్స్‌ పురుషుల హాకీలో భారత జట్టుకు కఠినమైన డ్రా ఎదురైంది. రాబోయే పారిస్‌ ఒలింపిక్స్‌లో క్లిష్టమైన గ్రూప్‌ బి నుంచి భారత్‌ బరిలోకి దిగనుంది. ఈ గ్రూపులో ఒలింపిక్‌ ఛాంపియన్‌, ప్రపంచ నెంబర్‌ 2 బెల్జియం(Belgium ), రియో ఒలింపిక్స్‌ స్వర్ణ పతక విజేత అర్జెంటీనా, బలీయమైన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, ఐర్లాండ్‌ జట్లు ఉన్నాయి. ఈ జట్లన్నింటినీ దాటి భారత్‌ సెమీస్‌ చేరాలంటే అంచనాలను మించి రాణించాల్సి ఉంది. గ్రూప్‌ ఎలో నెదర్లాండ్స్‌( Netherlands), జర్మనీ, బ్రిటన్‌, స్పెయిన్‌, ఫ్రాన్స్‌, సౌతాఫ్రికా జట్లు తలపడనున్నాయి. ఈ రెండు గ్రూపుల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీస్‌కు దూసుకెళ్తాయి.

 

మహిళలకు తప్పని నిరాశ

భారత మహిళల హాకీ జట్టుకు నిరాశే ఎదురైంది. జపాన్ చేతిలో ఓటమితో భారత హాకీ జట్టు పారిస్ ఒలింపిక్స్ ఆశలు గల్లంతయ్యాయి. హాకీ ఒలింపిక్‌ క్వాలిఫయర్స్‌ టోర్నీ(Hockey Olympic Qualifiers)లో జపాన్ తో జరిగిన కీలక పోరులో 0-1 తేడాలో భారత మహిళల జట్టు ఓటమి పాలైంది. దాంతో క్వాలిఫయర్ టోర్నీలో నాలుగో స్థానానికి పరిమితమైన మహిళల జట్టు పారిస్ ఒలింపిక్స్ కు అర్హత సాధించలేదు. తొలి మూడు స్థానాల్లో నిలిచిన జట్లు పారిస్ ఒలింపిక్స్ బెర్త్ దక్కించుకున్నాయి. ఝార్ఖండ్ రాజధాని రాంచీ వేదికగా భారత్ తో జరిగిన కీలకమైన మ్యాచ్‌లో జపాన్ ఆధిపత్యం చెలాయించింది. తొలి క్వార్టర్ లో జపాన్ ప్లేయర్ కనా ఉరాటా పెనాల్టీ కార్నర్ తో గోల్స్ ఖాతా తెరిచింది. దాంతో జపాన్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. కానీ మ్యాచ్ ముగిసేవరకూ భారత మహిళల టీమ్ గోల్ చేయడంలో విఫలమైంది.

 

గురువారం జర్మనీతో జరిగిన సెమీఫైనల్స్‌లో భారత్‌ ఓటమి చెందడంతో ఈ మ్యాచ్ కీలకంగా మారింది. ఆ మ్యాచ్‌లో జర్మనీ చేతిలో 4-3 గోల్స్ తేడాతో భారత్ ఓడిపోయింది. దాంతో మూడో స్థానం కోసం మరో ఆసియా దేశం జపాన్‌తో పోరాడి ఓడి.. పారిస్ ఒలింపిక్స్ బెర్త్ ను దక్కించుకోవడంలో విఫలమైంది. భారత మహిళల జట్టు 2020 టోక్యో ఒలింపిక్స్‌లో 4వ స్థానంలో నిలిచింది. దాంతో పారిస్ ఒలింపిక్స్ కు అర్హత సాధించి ఈసారి టైటిల్ సాధిస్తుందని ఆశలు చిగురించాయి. కానీ మూడేళ్ల తరువాత జరిగిన ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ మ్యాచ్ లో మెరుగ్గా రాణించినా.. చివరి మెట్టుపై భారత్ బోల్తా పడింది. మరోసారి అభిమానులకు నిరాశే ఎదురైంది.