Antim Panghal Set To Be Deported From Paris Olympics 2024: పారిస్‌ విశ్వ క్రీడల్లో భారత రెజ్లర్ల కష్టాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పతకం సాధించిన రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌పై అనర్హత వేటు పడి పతకం దూరమవ్వగా.. ఇప్పుడు మరో రెజ్లర్‌పైన నిషేధం వేటు వేలాడుతోంది. ఒలింపిక్స్‌లో మరో భారత రెజ్లర్ల అంతిమ్‌ పంగల్‌(Antim Panghal)పై వేటు పడే అవకాశం కనిపిస్తోంది. అక్రిడిటేషన్‌ కార్డును దుర్వినియోగం చేసిందన్న ఆరోపణలతో ఇప్పటికే అంతిమ్‌ పంగల్‌కు ఇచ్చిన అక్రిడిటేషన్‌ కార్డును రద్దు చేసిన ఒలింపిక్స్‌ నిర్వహక కమిటీ... ఇప్పుడు తదుపరి చర్యలకు సిద్ధమవుతోంది. ఇప్పుడు ఒలింపిక్స్‌ నిర్వహక కమిటీ అంతిమ్‌ పంగల్‌పై వేటు వేస్తే ఆమె కాంస్య పతక పోరుకు దూరం కావాల్సి ఉంటుంది. అదే జరిగితే భారత రెజ్లర్ల బృందానికి మరో గట్టి షాక్‌ తగిలినట్లే.

 

అసలేం జరిగిందంటే..?

విశ్వ క్రీడల్లో అంతిమ్‌ పంగల్‌  ఫ్రీస్టైల్ 53 కేజీల విభాగంలో క్వార్టర్స్‌ ఫైనల్‌లో తుర్కియే రెజ్లర్‌ యెట్‌గిల్ చేతిలో ఓడిపోయింది. ఈ ఓటమి తర్వాత హోటల్‌కు వెళ్లిన అంతిమ్‌.. తన సోదరి నిషాకి ఒలింపిక్‌ విలేజ్‌కు ఎంట్రెన్స్‌ ఉన్న అక్రిడిటేషన్‌ కార్డు ఇచ్చింది. ఇచ్చి ఒలింపిక్‌ విలేజ్‌లోని తన వస్తువులు తేవాలని కోరింది. అంతిమ్‌ అక్రిడిటేషన్‌తో ఒలింపిక్‌ గ్రామానికి వెళ్లిన నిషా... వస్తువులు తీసుకుని తిరిగి వస్తుండగా సెక్యూరిటీ సిబ్బంది ఆపి ఆరా తీశారు. తన సోదరి వస్తువులు తీసుకు వెళ్లేందుకు వచ్చానని చెప్పడంతో ఆమె స్టేట్‌మెంట్‌ రికార్డు చేశారు. అనంతరం అంతిమ్‌ను విలిచి ఆమె స్టేట్‌మెంట్‌ కూడా నమోదు చేశారు. నిబంధనల ప్రకారం ఒక అథ్లెట్‌ అక్రిడిటేషన్‌ కార్టు మీద వేరొకరు రావడం ఉల్లంఘన  కిందకు వస్తుంది. దీంతో  అక్రిడిటేషన్‌ కార్డును దుర్వినియోగం చేసిందన్న ఆరోపణలతో అమిత్‌ పంగల్‌పై ఒలింపిక్స్‌ నిర్వహక కమిటీ వేటు వేస్తే మాత్రం ఆమె కాంస్య పతక పోరుకు అనర్హతకు గురవుతుంది. అదే జరిగితే భారత్‌కు మరో పతకం సాధించే అవకాశం దూరమవుతుంది. అదే జరిగితే ‘రెపిఛేజ్‌’ ద్వారా పోటీలో నిలవాలనే  అంతిమ్‌ పంగల్‌ ఆశలపై నీళ్లు చల్లినట్లే అవుతుంది. 

 

మరో కంప్లైంట్‌ కూడా.. 

అంతేకాకుండా పారిస్‌లో క్యాబ్‌లో ప్రయాణించి డబ్బులు కట్టలేదని కూడా అంతిమ్‌ పంగల్ వ్యక్తిగత సిబ్బందిపై పోలీసులకు ఓ డ్రైవర్‌ కంప్లైంట్‌ ఇచ్చాడు. దీనిపై కేసు నమోదు కాకపోయినా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అంతిమ్‌ వ్యవహారంపై భారత ఒలింపిక్స్‌ కమిటీ స్పందించింది. తాము అన్ని విషయాలను నిశితంగా పరిశీలిస్తున్నామని వెల్లడించింది. ఒలింపిక్‌ విలేజ్‌లో జరుగుతున్న ఘటనలు అన్నీ చూస్తున్నామని... భారత ఒలింపిక్ సంఘం వెల్లడించింది. రెజ్లర్లకు, అథ్లెట్లకు మద్దుతుగా నిలిచేందుకు ఒలింపిక్స్ నిర్వహక కమిటీతో పోరాడుతూనే ఉన్నామని వెల్లడించింది. అంతిమ్ విషయంలోనూ ఒలింపిక్స్‌ నిర్వాహకులతో చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించింది.