Indian Badminton Star Lakshya Sen's Victory 'Deleted' In Paris Olympics 2024: విశ్వ క్రీడల్లో భారత స్టార్‌ షట్లర్‌ లక్ష్య సేన్‌ (Lakshya Sen)తొలి విజయాన్ని.. ఒలింపిక్స్‌ నిర్వాహక కమిటీ రద్దు చేసింది. మెన్స్‌ సింగిల్స్‌ గ్రూప్‌ ఏలో లక్ష్య సేన్‌..21-8, 22-20తో గ్వాటెమాలా ప్లేయర్‌ కెవిన్‌ కార్డన్‌పై గెలిచాడు. ఈ మ్యాచ్‌ తర్వాత కెవిన్‌  ఎడమ మోచేయి గాయం కారణంగా ఒలింపిక్స్‌ నుంచి వైదొలిగాడు. నిబంధనల ప్రకారం గ్రూప్‌ దశలో ఎవరైనా గాయపడి టోర్నీ నుంచి నిష్క్రమిస్తే వాళ్లు ఆడిన మ్యాచ్‌లు పరిగణనలోకి తీసుకోరు. దీంతో లక్ష్యసేన్‌ మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ఒలింపిక్‌ నిర్వాహకులు ప్రకటించారు. 

 

అసలేం జరిగిందంటే: 

పారిస్ ఒలింపిక్స్‌లో ప్రారంభ పురుషుల సింగిల్స్ గ్రూప్ L మ్యాచ్‌లో కెవిన్ కార్డన్‌పై స్టార్ ఇండియన్ షట్లర్ లక్ష్య సేన్ విజయం సాధించాడు. కెవిన్‌ గాయం కారణంతో ఒలింపిక్స్‌ నుంచి వైదొలిగినట్లు బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ తెలిపింది. ఇండోనేషియాకు చెందిన జోనాటన్ క్రిస్టీ, బెల్జియంకు చెందిన జూలియన్ కరాగ్గితో జరగాల్సిన కెవిన్ కార్డన్‌ మ్యాచ్‌లను కూడా రద్దు చేస్తున్నట్లు ఒలింపిక్స్‌ నిర్వహణ కమిటీ తెలిపింది. 

 

గ్రూప్‌ ఎల్‌లో మిగిలిన మ్యాచ్‌లను ఇప్పటికే రీ షెడ్యూల్‌ చేశారు. కార్డన్ వైదొలగడంతో ఇప్పుడు గ్రూప్‌ ఎల్‌ షెడ్యూల్‌ ను మొత్తం మార్చాల్సి వచ్చింది. ఇప్పుడు గ్రూప్ Lలో జొనాటన్ క్రిస్టీ, జూలియన్ కరాగీ, లక్ష్య సేన్‌ ముగ్గురే మిగిలారు. అంటే ఈ గ్రూప్‌లో లక్ష్య సేన్ ఒక్కడే మూడు మ్యాచులు ఆడతాడు. క్రిస్టీ, కారగ్గి నాకౌట్ దశకు చేరుకోవడానికి ఒక్కొక్కరు కేవలం రెండు మ్యాచ్‌లలో మాత్రమే పోటీపడతారు. సేన్ ఇవాళ కారగ్గితో తలపడనున్నాడు. బుధవారం చివరి మ్యాచ్‌లో క్రిస్టీతో పోటీపడతాడు. 

 

డబుల్స్‌ కూడా రద్దు

పారిస్ ఒలింపిక్స్‌లో పురుషుల డబుల్స్ మ్యాచ్‌ కూడా  రద్దయింది. సాత్విక్‌ సాయిరాజ్-చిరాగ్ శెట్టి(satvik -chirag)ల రెండో రౌండ్ మ్యాచ్ రద్దు అయినట్లు ఒలింపిక్స్‌ నిర్వహక కమిటీ ప్రకటించింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఇండియా స్టార్  జోడీ... మార్క్‌ లమ్స్‌ఫస్‌-మార్విన్‌ సీడెల్‌ జోడీతో తలపడాల్సి ఉంది. అయితే, మార్క్‌కు మోకాలి గాయం కావడంతో టోర్నీ నుంచి వైదొలిగాడు. దీంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు.  ఈ మ్యాచ్‌ రద్దు కావడంతో భారత జోడీ మూడో గేమ్‌లో తప్పక గెలవాల్సిన స్థితిలో నిలిచింది. మార్క్ లామ్స్‌ఫస్ మోకాలి గాయం కారణంగా ఒలింపిక్ గేమ్స్ పారిస్ 2024 బ్యాడ్మింటన్ పోటీ నుంచి వైదొలిగాడని... దీంతో గ్రూప్ సీలో భారత్‌తో జరగాల్సిన మ్యాచ్‌ రద్దైనట్లు బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ వెల్లడించింది. ఈ మ్యాచ్‌తో పాటు ఫ్రాన్స్‌ జోడీ లూకాస్ కార్వీ/రోనన్ లాబార్ మ్యాచ్‌ను కూడా రద్దు చేశారు. శనివారం జరిగిన పురుషుల డబుల్స్ గ్రూప్ సీ మ్యాచ్‌లో సాత్విక్‌-చిరాగ్‌ జోడీ 21-17, 21-14 తేడాతో ఫ్రాన్స్‌కు చెందిన లుకాస్ కార్వీ-రోనన్ లాబర్‌పై విజయం సాధించారు. సాత్విక్‌సాయిరాజ్ -చిరాగ్‌ల జోడీ రేపు( మంగళవారం ‌) ఇండోనేషియా  జోడీ ఫజర్ అల్ఫియాన్ -ముహమ్మద్ రియాన్ ఆర్డియాంటోతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే భారత జోడి క్వార్టర్స్‌కు చేరుకుంటుంది. ఇండోనేషియా జోడీ ర్యాంకింగ్స్‌లో  ప్రస్తుతం ఏడో స్థానంలో ఉంది. భారత్‌-ఇండోనేషియా డబుల్స్‌ జట్లు ఇప్పటివరకూ అయిదు సార్లు తలపడగా భారత్‌ మూడుసార్లు, ఇండోనేషియా రెండుసార్లు విజయం సాధించాయి.