Manu Bhaker daily routine:  పారిస్ ఒలింపిక్స్‌(Paris olympics 2024)లో మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో భారత షూటర్ మను భాకర్(manu Bhakar) కాంస్య పతకాన్ని కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. భారత క్రీడా చరిత్రలో ఇదో చారిత్రక ఘటంగా నిలిచింది. సమస్యలను అధిగమిస్తూ మనూ బాకర్‌ చేసిన ప్రయాణం ఎందరికో స్ఫూర్తిని నింపింది. సవాళ్లను అధిగమిస్తూ... విజయాలు సాధిస్తూ మనూ బాకర్‌ స్ఫూర్తివంతమైన ప్రయాణం చేసింది. 2021 టోక్యో ఒలింపిక్స్‌లో పిస్టల్ పనిచేయకపోవడం వల్ల ఆమె పతక ఆశలు గల్లంతయ్యాయి. అయినా మనూ బాకర్‌ కుంగిపోలేదు. తన పరాజయానికి కారణాలను విశ్లేషించుకుంది. తన నిరుత్సాహాన్నే ప్రేరణగా మార్చుకుంది. కోచ్‌ జస్పాల్‌ రాణా(Jaspal RAna) మార్గనిర్దేశంలో  తీవ్రంగా శ్రమించింది. నిపుణుల శిక్షణలో తన టెక్నిక్‌ను మరింత మెరుగుపర్చుకుంది. 

 

కఠోర శిక్షణ

ఒలింపిక్స్‌లో మనూ సాధించిన ఘనత చిన్నదేమీ కాదు. ఎందుకంటే షూటింగ్‌లో ఒలింపిక్స్‌లో భారత్‌కు ఇదే తొలి పతకం. ఈ కాంస్య పతకాన్ని గెలుచుకోవడం ద్వారా మనూ బాకర్‌ భారత కీర్తి పతాకాన్ని అంతర్జాతీయ క్రీడా వేదికపై ఎగరేసింది. కోచ్ జస్పాల్ రాణా విశేషమైన షూటింగ్‌ అనుభవం కూడా మనూకు కలిసి వచ్చింది. ఏళ్లుగా మను పడిన కష్టమంతా ఫలించిందని... గత ఏడాదిగా మనో రోబోలా పనిచేసిందని.. ఈ పతకం సాధించినందుకు సంతోషంగా ఉందని.. దేశం తరఫున తొలిసారి పతకం సాధించడం గర్వంగా ఉందని కోచ్‌ జస్పాల్‌ రాణా తెలిపాడు. 

 

భవిష్యత్తుకు ఓ ఆశా జ్యోతి

మనూ బాకర్‌ లెక్కలేనన్ని గంటల కఠినమైన శిక్షణకు... అచంచలమైన అంకితభావానికి పారిస్‌ ఒలింపిక్స్‌ క్రీడల్లో ఫలితం దక్కింది. బాకర్ స్కోరు 221.7తో కాంస్యమూడో స్థానాన్ని కైవసం చేసుకుంది. బాకర్‌ విజయం దేశం అంతటా ఔత్సాహిక క్రీడాకారులకు ప్రేరణగా నిలుస్తుంది. అచంచలమైన నిబద్ధత, పట్టుదలతో ఉన్నతమైన లక్ష్యాలను సాధించగలమని బాకర్‌ విజయం నిరూపించింది. పారిస్ ఒలింపిక్స్‌లో మను బాకర్ కాంస్య పతకం కేవలం వ్యక్తిగత విజయం మాత్రమే కాదు. ఓ అథ్లెట్‌ శక్తికి, అంకితభావానికి, కఠోరమైన శిక్షణకు ఇది నిదర్శనం. భారతీయ క్రీడల భవిష్యత్తుకు మనూ పతకం ఓ ఆశాజ్యోతి. 

 

ఒలింపిక్ స్థాయిలో ఈవెంట్‌లో ఎలాంటి తప్పిదాలకు ఆస్కారం ఉండదు. అందుకే మనూ చిన్న తప్పుకు కూడా అవకాశం ఇవ్వలేదు. 25 మీటర్ల స్పోర్ట్స్ పిస్టల్, 10 మీటర్ల మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో ఇంకా మనూ తలపడాల్సి ఉంది. ఇందులోనూ పతకాలు వస్తాయన్న అంచనాలు ఉన్నాయి. టోక్యో ఒలింపిక్స్‌లో పిస్టల్ పనిచేయకపోవడంతో కన్నీళ్లు పెట్టుకున్న మనూ బాకర్‌.. ఇప్పుడు అదే విశ్వ క్రీడల్లో నవ్వులు చిందిస్తూ పతకం సాధించింది. దీనికోసం ఆమె చేసిన ప్రయాణం అనితర సాధ్యం. భవిష్యత్తుకు మార్గ నిర్దేశనం.