Vinesh Phogat Disqualified: ఒలింపిక్‌లో పతకం సాధించేందుకు వినేశ్ ఫొగాట్‌(vinesh phogat) ఎన్నెన్నో త్యాగాలు చేసింది. 58 కేజీల బరువు నుంచి తగ్గుకుంటూ వచ్చింది. దాని కోసం శరీరం నుంచి రక్తాన్నికూడా తీయించుకుందని తెలుస్తోంది. అంతేకాకుండా జట్టును కూడా కత్తిరించుకుంది. ఆహారం... నీటిని పూర్తిగా తగ్గించుకుంది. ఇది నీకు ప్రమాదకరమని వైద్యులు హెచ్చరించినా వినేశ్‌ వినలేదు. చాలారోజులపాటు వినేశ్‌ ఆహారాన్ని చాలా మితంగా తీసుకుందని తెలుస్తోంది. నీటిని కూడా అవసరం మేర కంటే చాలా తక్కువగా తీసుకుందని రెజ్లింగ్‌ వర్గాలు వెల్లడించాయి. ఈ ప్రయత్నాలన్నీ ఫలించి పతకం దక్కిన వేళ మళ్లీ అనూహ్యంగా బరువు పెరిగిన వినేశ్‌...అనర్హత వేటుకు గురైంది. 

 

బౌట్లు గెలవగానే శిక్షణ..!

ఒలింపిక్స్‌లోనూ బౌట్లు గెలిచిన వెంటనే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వినేశ్‌... శిక్షణ ప్రారంభించింది. క్వార్టర్‌ ఫైనల్‌ ముగిసిన వెంటనే కూడా వినేశ్‌ ఫొగాట్‌ మళ్లీ శిక్షణ ప్రారంభించింది. ఇలా ఎన్ని చేసినా వినేశ్‌ ఫొగాట్‌కు మాత్రం.... బరువు తగ్గడంలో విఫలమైంది. సెమీఫైనల్‌ ముగిసిన తర్వాత ఈ స్టార్‌ రెజ్లర్‌... అనూహ్యంగా రెండు కేజీల బరువు పెరిగింది. కానీ మంగళవారం రాత్రి వినేశ్‌ 50 కిలోల కంటే ఎక్కువగా 2 కిలోల అదనపు బరువు ఉంది. దీంతో వినేశ్ రాత్రంతా జాగింగ్‌, సైక్లింగ్‌, స్కిప్పింగ్‌ వంటి ఎక్సర్‌సైజ్‌లు చేసి బరువును చాలా వరకు తగ్గించుకుంది. సుమారు 1900 గ్రాముల బరువు తగ్గినా మరో 100 గ్రాములను మాత్రం తగ్గించుకోలేకపోయింది. వినేశ్‌ బరువు తగ్గేందుకు మరింత సమయం ఇవ్వాలన్న భారత ఒలింపిక్స్‌ బృందం విజ్ఞప్తిని ఒలింపిక్స్‌ నిర్వహక కమిటీ తిరస్కరించింది. 





 

నిబంధనలు ఏంటి..? 

రెజ్లింగ్‌లో ఏ విభాగంలో పోటీ పడే రెజ్లర్‌ బరువును పోటీ జరిగే రోజు ఉదయం కొలుస్తారు. కాబట్టి రెజ్లర్లు తప్పనిసరిగా ఆ బరువులోనే ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. రెజ్లర్ల బరువు కొలిచే సమయంలో ఆ బరువును తూచేందుకు 30 నిమిషాల వ్యవధి ఉంటుంది. ఈ అరగంట సమయంలో ఎన్నిసార్లైనా రెజ్లర్లు తమ బరువు కొలుచుకునే అవకాశం ఇస్తారు. దీంతోపాటు ఆరోగ్య పరీక్షలతో సహా గోళ్లు కత్తిరించుకొన్నారో, లేదో కూడా నిశితంగా పరీక్షిస్తారు. ఒకవేళ ఆ బరువులో రెజ్లర్‌ లేకపోతే అనర్హత వేటు వేస్తారు.