President Draupadi Murmu And PM Narendra Modi Congratulated Manu Bhaker And Sarabjot Singh : పారిస్‌ ఒలింపిక్స్‌(Olympic Games Paris )లో రెండు పతకాలు కైవసం చేసుకుని చరిత్ర సృష్టించిన స్టార్ షూటర్‌ మనూ బాకర్‌(Manu Bhaker).. షూటర్‌ సరబ్‌జోత్‌ సింగ్‌(Sarabjot Singhపై ప్రశంసల వర్షం కురుస్తోంది. రెండు రోజుల వ్యవధిలోనే రెండు పతకాలు సాధించిన మనూ బాకర్‌ ప్రతిభను కొనియాడుతూ పలువురు ప్రముఖులు సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. ఒకే ప్రపంచకప్‌లో రెండు పతకాలు సాధించి మనూ భారత ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిందని కొనియాడుతున్నారు. ఈ ఒలింపిక్స్‌లో భారత పతకాల సంఖ్య రెండంకెలు దాటడం ఖాయమని సోషల్‌ మీడియాలో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

 

రాష్ట్రపతి శుభాకాంక్షలు

10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో దక్షిణ కొరియా జోడిని మట్టి కరిపించి కాంస్య పతకాన్ని సాధించిన షూటర్లు మను భాకర్- సరబ్‌జోత్ సింగ్‌లకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని అభిలాషించారు. మిక్స్‌డ్ టీమ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో భారత్‌ కోసం కాంస్య పతకాన్ని గెలుచుకున్నందుకు మను భాకర్-సరబ్జోత్ సింగ్‌లకు అభినందనల అంటూ రాష్ట్రపతి సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. ఒకే ఒలింపిక్ క్రీడలలో రెండు పతకాలు సాధించిన మొదటి భారత మహిళా షూటర్‌గా మను భాకర్ చరిత్ర సృష్టించడం చాలా గర్వంగా ఉందని రాష్ట్రపతి పోస్ట్‌లో పేర్కొన్నారు.





 

ప్రధాని మోదీ కూడా...

కాంస్య పతకాన్ని సాధించిన షూటర్లు మను భాకర్- సరబ్‌జోత్ సింగ్‌లకు ప్రధాని మోదీ అభినందించారు. పారిస్‌లో అద్భుతమైన ప్రదర్శన చేసిన షూటర్లకు అభినందనలంటూ మోదీ ట్వీట్‌ చేశారు. మనూ భాకర్-సరబ్‌జోత్‌ సింగ్‌లకు తన అభినందన సందేశాన్ని అందించారు. వీరి విజయం చూసి భారత్‌ గర్విస్తోందని ప్రధాని అధికారిక ఎక్స్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. తమ షూటర్లు మమ్మల్ని గర్వించేలా చేస్తూనే ఉన్నారని... ఒలింపిక్స్‌లో 10మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్నందుకు మనూ బాకర్, సరబ్‌జోత్‌లకు అభినందనలని మోదీ ట్వీట్‌లో పేర్కొన్నారు. అద్భుతమైన నైపుణ్యాలు, బృంద స్ఫూర్తిని ప్రదర్శించారని స్టార్‌ షూటర్లను మోదీ ప్రశంసించారు. మను బాకర్‌కు ఇది వరుసగా రెండవ ఒలింపిక్ పతకమని.. ఆమె స్థిరమైన నైపుణ్యం, అంకిత భావం తనను ఆశ్చర్యపరుస్తోందని మోదీ అన్నారు. 





భారత క్రికెట్ బోర్డు బీసీసీఐ కూడా మను బాకర్, షూటర్‌ సరబ్‌జోత్‌ సింగ్‌ లను అభినందిస్తూ పోస్ట్ లు పెట్టింది. 

 





మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కూడా మనుపై ప్రశంసల జల్లు కురిపించాడు.