Neeraj Chopra's Javelin Throw Final At Paris Olympics: భారత క్రీడాభిమానులు తీవ్ర నిర్వేదంలో ఉన్నారు. చేతులదాకా వచ్చిన పతాకాలు త్రుటిల్లో చేజారుతున్నాయి. ఇక పతకం మనదే అని సంబరాలు చేసుకునే లోపు ఆ పతకం చేజారిపోతోంది. సెమీఫైనల్లో భారత హాకీ జట్టు ఓటమి... వినేశ్ ఫొగాట్(Vinesh Phogat)పై అనర్హత వేటు... ఒక్క కేజీ దూరంతో మీరాబాయి చాను(Mirabai Chanu)కు చేజారిన పతకం.. కాంస్య పతక పోరులో లక్ష్యసేన్(Lakshya sen) ఓటమి.. ఇలా అన్ని ప్రతికూల వార్తలే వింటున్న భారత అభిమానులు ఇప్పుడు తీవ్ర నిర్వేదంలో ఉన్నారు. ఈ నిర్వేదం పోవాలంటే... మళ్లీ సంబరాలు మొదలు కావాలంటే భారత్‌కు కావాల్సింది ఒకే పతకం. అదీ స్వర్ణం. ఆ స్వర్ణ అశలను మోస్తూ స్టార్ జావెలిన్ త్రో ప్లేయర్ నీరజ్ చోప్రా నేడు బరిలోకి దిగుతున్నాడు. తాను తెచ్చే ఒక్క పతకం ఇప్పుడు కోట్ల మంది అభిమానుల కళ్లల్లో ఆనందాన్ని తేనుంది. ఇప్పటివరకూ ఎదురైన పరాభవాలకు చెక్ పెట్టనుంది. ఇప్పుడు నీరజ్ సాధించేది కేవలం ఒక పతకం కాదు. కోట్ల మంది ఆశలను నిలబెట్టే.. నిర్వేదాన్ని తీర్చే ఒక మంత్రం. ఇక నీరజ్(Neeraj Chopra) విసిరితే జావెలిన్ 90 మీటర్ల దూరం పడాల్సిందే.... పసిడి పతకం భారత్ ఖాతాలో చేరాల్సిందే.
నీరజ్ చోప్రాపైనే ఆశలు...
టోక్యో ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రా వ్యక్తిగత స్వర్ణం గెలిచి చరిత్ర సృష్టించాడు. ఇప్పుడు మరోసారి అదే ఫలితం పునరావృతం కావాలని భారత అభిమానులు అందరూ ప్రార్థనలు చేస్తున్నారు. భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌పై అనర్హత వేటుతో పూర్తి నిరాశలో కూరుకుపోయిన భారత అభిమానులు.. ఆకాశమంత ఆశతో నీరజ్ వైపు చూస్తున్నారు. ఈ పరిస్థితి నీరజ్ మీద ఒత్తిడి పెంచే అవకాశం ఉంది. అయితే ఒత్తిడిని తట్టుకుని.. అత్యుత్తమంగా రాణించి రికార్టులు సృష్టించి మరీ విజయ గర్జన చేయడం నీరజ్‌కు బాగా తెలుసు. ఫైనల్ అర్హత పోటీల్లో ఒకే ఒక్క త్రోతోనే 89.34 మీటర్ల దూరం జావెలిన్‌ను విసిరి నీరజ్ చేసిన విజయ గర్జన ఇంకా మార్మోగుతూనే ఉంది. మరోసారి నీరజ్ అలాంటి ప్రదర్శనే చేసి స్వర్ణం గెలిచాడా... ఇక భారత అభిమానుల సంబరాలకు తిరుగుండదు.
ఫైనల్లో నీరజ్‌కు గట్టి సవాలే
తుది పోరులో నీరజ్‌కు గట్టి సవాల్ ఎదురుకానుంది. జావెలిన్‌లో ఎన్నో రికార్డులు నెలకొల్పిన దిగ్గజాలను ఈ భారత స్టార్ అథ్లెట్ ఎదుర్కోబోతున్నాడు. నీరజ్ అత్యుత్తమ వ్యక్తిగత ప్రదర్శన 89.94 మీటర్లుకాగా... అంతకంటే ఎక్కువే బల్లెన్ని విసిరిన జావెలిన్ త్రోయర్లు మరో ముగ్గురు ఉన్నారు. అండర్సన్ పీటర్సన్ 93.07 మీటర్లు, జులియెస్ యెగో 92.72 మీటర్లు, వాద్లెచ్ 90.88 మీలతో నీరజ్ చోప్రాకు సవాల్ విసురుతున్నారు. అయితే పోటీల రోజున ఎవరు సత్తా చాటితే వారిదే పతకం. పోకిరి సినిమాలో అన్నట్లు ఎప్పుడు వచ్చామని కాదన్నయ్యా... బుల్లెట్ దిగిందా లేదా అన్నది లెక్క. ఇప్పుడు ఫైనల్లో నీరజ్ మరోసారి ఆ బల్లెన్ని సుదూరం విసిరితే పతకం ఖాయమైనట్లే. జావెలిన్ త్రో ఫైనల్ రాత్రి 11 గంటల 55 నిమిషాలకు జరగనుంది.