Manu Bhaker's Father Clarifies On Marriage Rumours: ఒలింపిక్(Olympic) మెడలిస్ట్ మను బాకర్-నీరజ్ చోప్రా(Neeraj Chopra Manu Bhaker) పెళ్లంటూ సోషల్ మీడియా ఊగిపోతోంది. ఈ ఇద్దరు ఒలింపిక్ పతక విజేతలు పెళ్లి పీటలు ఎక్కనున్నారని.. వారిద్దరూ పీకల్లోతూ ప్రేమలో ఉన్నారని రకరకాల ఊహాగానాలు రెండు రోజులుగా సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. మను బాకర్ తల్లి నీరజ్‌తో ఒట్టు వేయించుకోవడం... నీరజ్-మను సిగ్గు పడుతూ మాట్లాడుకోవడం ఇలా చాలా సంఘటనలను లింక్ చేసుకున్న నెటిజన్లు వాళ్లిద్దరి వివాహమే తర్వాయి అని కామెంట్లతో చెలరేగిపోయారు. అయితే ఈ విషయంపై మను బాకర్ తండ్రి రామ్‌కిషన్ బాకర్ స్పందించారు. వీరిద్దరిపై వస్తున్న పుకార్లపై కీలక వ్యాఖ్యలు చేశారు.
మనూ తండ్రి ఏమన్నాడంటే..?
మను బాకర్-నీరజ్ చోప్రా పెళ్లిపై మను బాకర్ తండ్రి రామ్‌కిషన్(Ram Kishan) కీలక వ్యాఖ్యలు చేశారు. మను బాకర్ ఇంకా చాలా చిన్నపిల్లని.. ఆమెకు ఇంకా పెళ్లి చేసుకునే వయసే రాలేదని స్పష్టం చేశారు. మను బాకర్ తల్లి సుమేధా భాకర్.. నీరజ్ చోప్రాను తన కొడుకులా భావిస్తుందని వెల్లడించారు. సోషల్ మీడియాలో నీరజ్-మనూ బాకర్ వివాహమంటూ వచ్చిన వార్తలు పూర్తిగా నిరాధారమని రామ్‌కిషన్ స్పష్టం చేశారు. తన కుమార్తె ఇంకా చాలా చిన్నదని.. ఆమె వివాహం గురించి ఇంకా ఆలోచించడం లేదని తేల్చి చెప్పారు. 22 ఏళ్ల మనూ బాకర్ పారిస్ ఒలింపిక్స్ 2024లో మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్, 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్లలో రెండు కాంస్య పతకాలు సాధించింది. నీరజ్ చోప్రా మామయ్య కూడా ఈ వైరల్ వీడియోపై స్పందించినట్లు తెలుస్తోంది. నీరజ్ పతకం తేవడంతో దేశం మొత్తం సంతోషంలో ఉందని.. అలాగే అతని పెళ్లి కూడా దేశం మొత్తానికి తెలిసిన తర్వాతే జరుగుతుందని అతను వ్యాఖ్యానించినట్లు తెలిసింది.
ఎలా ప్రారంభమైందంటే..
2024 పారిస్ ఒలింపిక్స్ పూర్తయిన తర్వాత మనూ బాకర్, నీరజ్ చోప్రా పీకల్లోతు ప్రేమలో ఉన్నారన్న వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు చెలరేగిపోయారు. ఒలింపిక్స్ ముగిసిన తర్వాత మను బాకర్ తల్లి సుమేధా భాకర్.. నీరజ్ చోప్రాతో మాట్లాడుతున్న వీడియో వైరల్‌గా మారింది. వాళ్లిద్దరూ ఏం మాట్లాడుకున్నారో తెలీదు కానీ దానిపై చాలా ఊహాగానాలు చెలరేగాయి. ఇద్దరు ఒలింపియన్ల మధ్య చాలా కాలంగా ప్రేమలో ఉన్నారన్న వార్తలు కూడా వైరల్‌గా మారాయి. చాలా మీడియా సంస్థలు దానికి సంబంధించిన వార్తలను వండి ప్రేక్షకులకు అందించాయి. మనూ బాకర్ ఒలింపిక్స్ ముగింపు వేడుకల్లో శ్రీజేష్‌తో కలిసి పతాకధారిగా వ్యవహరించింది.