భారత టాప్‌ అథ్లెట్‌ నీరజ్‌ చోప్రా అభిమానులకు మరింత చేరువ కానున్నాడు. అతడి క్రీడా ప్రస్థానం మరెంతో మందికి స్ఫూర్తి కలిగించనుంది. దేశవ్యాప్తంగా కోట్లాది మంది యువ క్రీడాకారులకు ప్రేరణ కల్పించే అవకాశం అతడికి దక్కింది. నీరజ్‌ చోప్రా క్రీడా ప్రయాణం త్వరలో యూట్యూబ్‌ ఇండియా 'క్రియేటింగ్‌ ఫర్‌ ఇండియా' సిరీస్‌లో ప్రసారం కానుంది.


బల్లెం వీరుడు నీరజ్‌ చోప్రా కథ అందరికీ ప్రేరణ కలిగించేదే. స్వీట్లు తింటూ స్థూలకాయుడిగా మారిపోయిన అతడు ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం అందించడం ఓ చరిత్ర. హరియాణాలోని ఓ చిన్న గ్రామం ఖాంద్రా నుంచి అతడి క్రీడా ప్రస్థానం మొదలైంది. మెల్లమెల్లగా ఎదుగుతూ అంతర్జాతీయ టోర్నీల్లో సత్తా చాటాడు. అంచనాలు పెంచేశాడు. ఆడిన ప్రతి టోర్నీలో పతకం తెచ్చాడు. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో దేశానికి అథ్లెటిక్స్‌లో తొలి స్వర్ణం అందించాడు. అంతేకాకుండా అథ్లెటిక్స్‌లో వ్యక్తిగత కోటాలో వందేళ్లలో ఇదే మొదటి పతకం గమనార్హం.


ఇప్పటికే నీరజ్‌ చోప్రాకు యూట్యూబ్‌లో ఒక ఛానెల్‌ ఉంది. అందులో తన వ్యక్తిగత, క్రీడా జీవితానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను అభిమానులతో పంచుకుంటాడు. దేశ వ్యాప్తంగా అథ్లెటిక్స్‌, జావెలిన్‌పై అవగాహన కల్పించేందుకు 'క్రియేటింగ్‌ ఫర్‌ ఇండియా' యూట్యూబ్‌ సిరీస్‌ అతడికి  ఉపయోగపడునుంది. ఈ భాగస్వామ్యం ద్వారా నీరజ్‌ తనకు ఇష్టమైన విధానంలో ప్రచారం నిర్వహించేందుకు అవకాశం ఉంటుంది.


'ఈ భాగస్వామ్యం పట్ల మేమెంతో ఉత్సాహంగా ఉన్నాం. ప్రపంచ వ్యాప్తంగా తన స్ఫూర్తిదాయకమైన కథను చెప్పేందుకు నీరజ్‌ చోప్రాకు యూట్యూబ్‌ గొప్ప వేదికగా ఉపయోగపడుతుందని మా విశ్వాసం. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో వీడియో కంటెంట్‌ను చాలా ఎక్కువగా చూస్తున్నారు. భారత యువత అథ్లెటిక్స్‌, జావెలిన్‌ త్రోను కెరీర్‌గా తీసుకొనేందుకు నీరజ్‌ చోప్రా ఆదర్శంగా నిలుస్తాడు' అని జేఎస్‌డబ్ల్యూ స్పోర్ట్స్‌ మార్కెటింగ్‌, స్పోర్ట్స్‌ హెడ్‌ దివ్యాన్షు సింగ్‌ అన్నారు.