Anantapur News : అనంతపురం జిల్లా పామిడి మండలం జీఏ కొట్టాల తాండాకు చెందిన సరస్వతి (20) అనే యువతిని ఎస్ఐ విజయ్ కుమార్ నాయక్ పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప కాగినెల్లి మీడియాతో మాట్లాడారు. పురుగుల మందు తాగిన సరస్వతి రెండు రోజులపాటు అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందిందని ఎస్పీ తెలిపారు. సరస్వతి తండ్రి తిరుపాల్ నాయక్ ఫిర్యాదుతో ఎస్ఐ విజయ్ కుమార్ నాయక్ పై 306, 376, 420 సెక్షన్ ల కింద కేసు నమోదు చేశామన్నారు. వెంటనే తిరుపతి ఎస్పీతో మాట్లాడి ఎస్ఐ విజయ్ కుమార్ నాయక్ ని నిన్న రాత్రి కస్టడీలోకి తీసుకున్నామని తెలిపారు. ఎస్ఐ విజయ్ కుమార్ నాయక్ గతంలో కూడా ఒక అమ్మాయితో ఇలా వ్యవహరిస్తే దిశ డీఎస్పీ విచారణ చేసి వారిని పెళ్లి చేశారన్నారు.


పెళ్లి పేరుతో మోసం 


ఇప్పుడు మళ్లీ సరస్వతిని పెళ్లి పేరుతో మోసం చేశాడని తల్లిదండ్రులు, గ్రామస్థు ఆరోపిస్తున్నారు. ఎస్ఐ విజయ్ కుమార్ గత కొంత కాలంగా ప్రేమ పేరుతో సరస్వతి వెంటపడ్డాడని ఎస్పీ తెలిపారు. ఇద్దరు ప్రేమించుకున్నప్పుడు తీసుకున్న ఫొటోలు, ఆధారాలు బయటపడ్డాయన్నారు. డీఎస్పీ చైతన్య ఆధ్వర్యంలో ఎస్ఐ విజయ్ కుమార్ ను విచారిస్తున్నామన్నారు. విచారణ అనంతరం నిందితున్ని మీడియా ముందు ప్రవేశపెట్టి కోర్టులో హాజరు పరుస్తామని తెలిపారు. 


అసలేం జరిగింది? 


అనంతపురం జిల్లా, జి ఏ కొట్టాల కు చెందిన సరస్వతి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం ( Suiside ) చేసింది. తాను ఆత్మహత్య చేసుకోవడానికి చంద్రగిరి ఎస్ఐ విజయ్ కుమార్ కారణం అని మరణ వాంగ్మూలంలో చెప్పింది. అతను తనను ఎలా ప్రేమ పేరుతో మోసం చేశాడో కూడా వివరించింది. ఆమెను రక్షించేందుకు వైద్యులు తీవ్ర ప్రయత్నాలు చేసినా ఫలితం కనిపించలేదు. ఆమె చనిపోయింది. తిరుపతిలో ( Tirupati ) డిగ్రీ చదువుతున్న సమయంలో ఎస్ ఐ విజయ్ కుమార్ ఆమెను ట్రాప్ చేశారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. అయితే విజయ్ కుమార్ ఒక్క సరస్వతినే కాదు మరికొంత మంది అమ్మాయిల్ని కూడా ట్రాప్ చేశారు. ప్రేమ పేరుతో మోసం చేయడంతో ఇటీవల దిశ పోలీస్‌ స్టేషన్‌లో ( Disa Police Station )   ఓ యువతి ఫిర్యాదు చేసింది. దీంతో ఎస్‌ఐ ఆ యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం తెలిసిన సరస్వతి తాను మోసపోయానని భావించి ఆత్మహత్య చేసుకుంది.  


సరస్వతి కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు తాడిపత్రి పోలీసులు ( Tadipatri Police )  కేసు నమోదు చేశారు. చంద్రగిరిలో అతడిని అదుపులోకి తీసుకొని  రిమాండ్‌కు తరలించినట్లుగా తాడిపత్రి డీఎస్పీ ప్రకటించారు. ఎస్‌ ఐ పై కేసు నమోదు చేశామని గతంలోనూ ఇలాంటి ఫిర్యాదులొచ్చాయని డీఎస్పీ  చైతన్య  ( DSP Chaitanya ) తెలిపారు. ఫిర్యాదులొస్తే వివాదాల మధ్యే విజయకుమార్‌ వివాహం జరిగిందన్నారు. మహిళలను ఎవరైనా  వేధిస్తే కాపాడాల్సిన పోలీసు తానే ప్రేమ పేరుతో ట్రాప్ చేయడంతో ఓ యువతి ప్రాణం బలైపోయింది.