ఉత్కంఠభరితంగా సాగుతున్న వన్డే ప్రపంచకప్‌లో నేడు మరో ఆసక్తికర మ్యాచ్‌ జరగనుంది. హైదరాబాద్‌ ఉప్పల్‌ మైదానం వేదికగా పాకిస్థాన్‌-శ్రీలంక తలపడనున్నాయి. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌లో గెలుపు సొంతం చేసుకోవాలని ఇరు జట్లు వ్యూహ, ప్రతి వ్యూహాలతో సిద్ధమయ్యాయి. ఇదే వేదికపై నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 81 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన పాక్‌.. శ్రీలంకపైనా విజయం సాధించి సెమీస్‌ వైపు మరో అడుగు వేయాలని భావిస్తోంది. కానీ శ్రీలంక పరిస్థితి మరోలా ఉంది. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి మ్యాచ్‌లో లంక పోరాడి ఓడింది. 102 పరుగుల తేడాతో పరాజయం పాలైనా.. ప్రొటీస్‌ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు ప్రయత్నించింది. తొలి మ్యాచ్‌లో పరాజయం పాలైనా శ్రీలంక..పాక్‌కు గట్టిపోటీ ఇస్తుందనడంలో సందేహం లేదు. ఆసియా కప్‌లో పాకిస్థాన్‌పై గెలుపు శ్రీలంకకు మరింత ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వనుంది. ఆసియా కప్‌లో ఆఖరి బంతి వరకు ఉత్కంఠ రేపిన సూపర్‌-4 మ్యాచ్‌లో లంక చేతిలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని పాక్‌ కసితో ఉంది. 

 

కానీ గత రికార్డులే లంకను భయపెడుతున్నాయి.  వన్డే ప్రపంచకప్‌లో శ్రీలంక ఎప్పుడూ పాకిస్తాన్‌ను ఓడించలేదు. పాక్‌-లంక మహా సమరంలో ఏడు మ్యాచ్‌ల్లో తలపడగా ఏడుసార్లు పాకే విజయం సాధించింది. బ్యాటర్లకు స్వర్గధామమైన ఉప్పల్‌ పిచ్‌పై భారీ స్కోరు సాధించిన జట్టు ప్రత్యర్థి జట్టుపై ఒత్తిడి పెంచుతోంది. ఈ మ్యాచ్‌లోనూ ఇదే జరిగే అవకాశం ఉంది.ఉప్పల్‌లో వామప్‌ సహా మూడు మ్యాచ్‌లు ఆడడం బాబర్‌ సేనకు కలిసిరానుంది. షాహీన్‌ అఫ్రీదీ, హరిస్‌ రవూఫ్‌, హసన్‌ అలీతో పాక్‌ పేస్‌ దళం భీకరంగా ఉండగా.. ఓపెనర్లు ఇమాముల్‌ హక్‌, ఫఖర్‌ జమాన్‌ వరుసగా విఫలం కావడంతో మిడిలార్డర్‌పై భారం పడుతోంది. కెప్టెన్‌ బాబర్‌, రిజ్వాన్‌, షకీల్‌ ఫామ్‌ కొనసాగిస్తే పాక్‌కు తిరుగుండదు. కుశాల్‌ మెండిస్‌, ప్రథుమ్‌ నిస్సంక, చరిత అసలంక చెలరేగాలని లంక కోరుకుంటోంది. ఇక సఫారీల వీరబాదుడుకు భారీగా పరుగులు సమర్పించుకున్న తురుపుముక్క మహీశా పతిరణ, మధుషనక, రజితపైనే లంక గంపెడు ఆశలు పెట్టుకుంది.  స్పిన్‌ విభాగంలో పాక్‌ కంటే శ్రీలంక మెరుగ్గా కనిపిస్తోంది. సఫారీలతో మ్యాచ్‌కు దూరమైన తీక్షణ జట్టుతో కలిశాడు. తనదైన రోజున బంతితో తిప్పేసే దునిత్‌ వెల్లలాగె, తీక్షణను పాక్‌ బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారనేది మ్యాచ్‌ ఫలితాన్ని నిర్దేశించనుంది. లంక స్పిన్నర్లు రాణిస్తే పాక్‌ బ్యాటర్లకు ముప్పు తిప్పలు తప్పవు. 

 

నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో విఫలమైన కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌పై విమర్శలు చెలరేగుతున్నాయి. ఈ మ్యాచ్‌లో రాణించి ఆ విమర్శలకు సమాధానం చెప్పాలని బాబర్‌ పట్టుదలగా ఉన్నాడు. ఇప్పటికే ఉప్పల్‌లో మూడు మ్యాచ్‌లు ఆడిన బాబర్‌కు పిచ్‌పై సంపూర్ణ అవగాహన ఉంది. 

 

పాకిస్థాన్ జట్టు ( అంచనా‌‌): 

అబ్దుల్లా షఫీక్, ఇమామ్-ఉల్-హక్, బాబర్ ఆజం (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్ (కీపర్‌), సౌద్ షకీల్, ఇఫ్తికార్ అహ్మద్, షాదాబ్ ఖాన్ , మహ్మద్ నవాజ్, హసన్ అలీ, షాహీన్ షా ఆఫ్రిది, హరీస్ రవూఫ్

 

శ్రీలంక జట్టు ( అంచనా‌‌) :

పాతుమ్ నిస్సాంక, కుసల్ పెరీరా, కుసల్ మెండిస్, సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా,  దసున్ షనక (కెప్టెన్),  దునిత్ వెల్లలగే,  మహేశ్ తీక్షణ, మతీష పతిరన, దిల్షన్ మధుశంక