ఎప్పుడూ భారత జట్టుపై విషం కక్కే పాకిస్థాన్‌ విధ్వంసకర బ్యాటర్‌ షాహిద్ అఫ్రిదీ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. వన్డే ప్రపంచకప్‌ జరుగుతున్న వేళ అఫ్రిదీ చేసిన వ్యాఖ్యలపై క్రికెట్‌ అభిమానులు భగ్గుమంటున్నారు. టీమిండియా ఫాస్ట్ బౌలర్లు ఇటీవల అద్భుత ప్రదర్శన చేస్తుండడంపై... అఫ్రిదీ స్పందించాడు. భారత సీమర్లు మాంసాహరం తినడం వల్లే మెరుగ్గా రాణిస్తున్నారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.  పాకిస్థాన్ మాజీ కెప్టెన్, ఆల్ రౌండర్ కూడా షాహిద్ అఫ్రిదీ చేసిన ఈ వ్యాఖ్యలపై క్రికెట్‌ అభిమానులు మండిపడుతున్నారు. 

 

భారత బౌలింగ్‌ బలం గురించి షాహిద్ అఫ్రిది మాట్లాడుతూ "భారతదేశంలో 140 కోట్ల జనాభా ఉంది. కొన్నేళ్లుగా టీమిండియా క్రికెట్‌లో నాణ్యత పెరిగింది. ఇది చాలా అద్భుతంగా సాగుతోంది. గతంలో మేం భారత్‌ నుంచి మంచి బ్యాట్స్‌మెన్‌లు.. పాకిస్థాన్‌ నుంచి మంచి బౌలర్లు వస్తారని భావించే వాళ్లం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రస్తుతం భారత్‌ జట్టులో బౌలర్లు, బ్యాట్స్‌మెన్ ఇద్దరూ బాగానే ఉన్నారు. మాంసాహారం తినడం ప్రారంభించినప్పటి నుంచి భారత బౌలర్ల మరింత మెరుగ్గా రాణిస్తున్నారు" అని అఫ్రిది ప్రకటించాడు. ఈ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

 

జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్ మొదలైన అనేక మంది అద్భుతమైన ఫాస్ట్ బౌలర్లు కొన్నేళ్లలో భారతజట్టులో అద్భుతంగా రాణిస్తున్నారు. అంతర్జాతీయ వేదికపై భారత సత్తాను చాటుతున్నారు. వీరి ప్రదర్శనతో గతంలో ఎన్నడూలేనంత బలంగా టీమిండియా బౌలింగ్‌ విభాగం ఉంది. గంటకు 140 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో బౌలింగ్ చేయగల సామర్థ్యంతో పాటు, కచ్చితమైన లైన్-లెంగ్త్, ఇన్-స్వింగ్, అవుట్-స్వింగ్, యార్కర్, బౌన్సర్‌లతో భారత సీమర్లు మెరుగ్గా రాణిస్తున్నారు. తన యార్కర్లతో జస్ప్రీత్ బుమ్రా...  బంతిని సీమ్‌ చేయడం మహ్మద్ షమీ... ఇన్‌, అవుట్‌ స్వింగ్‌లతో మహ్మద్ సిరాజ్ అద్భుతాలు సృష్టిస్తున్నారు. ప్రస్తుతం వన్డే క్రికెట్‌లో ప్రపంచ నెంబర్‌ వన్‌ బౌలర్‌ అయిన సిరాజ్‌.. ఆసియా కప్‌లో శ్రీలంకపై అద్భుత ప్రదర్శనతో చెలరేగాడు.

 

అక్టోబర్ 14న భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య ప్రపంచకప్ మ్యాచ్ జరగనుంది. ఈ హై ఓల్టేజ్‌ మ్యాచ్‌కు ముందు అఫ్రిదీ వ్యాఖ్యలు కాక రేపుతున్నాయి. సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్‌, పాకిస్థాన్‌ మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు. కేవలం ఐసీసీ మెగా ఈవెంట్స్‌లో మాత్రమే దాయాదులు తలపడుతున్నాయి. ఫలితంగా పాకిస్థాన్‌ జట్టు భారత్‌లో పర్యటించడం లేదు. చివరిసారిగా 2016లో టీ20 ప్రపంచకప్‌ ఆడేందుకు ఇక్కడికి వచ్చిన దాయాది జట్టు మళ్లీ ఏడేళ్ల తర్వాత వన్డే వరల్డ్‌ కప్‌ కోసం భారత్‌లో అడుగుపెట్టింది. ఇప్పటికే ఆస్ట్రేలియాపై తొలి విజయం సాధించిన టీమిండియా రెండో మ్యాచ్‌కు సిద్ధమవుతోంది. రెండో మ్యాచ్‌ భారత్, అఫ్గానిస్థాన్ మధ్య అక్టోబర్ 11న ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగనుంది. తర్వాత అక్టోబర్ 14న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత పాకిస్థాన్‌తో తలపడనుంది. ఆ తర్వాత ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్, నెదర్లాండ్‌లతో భారత్ ఆడుతుంది. 

 

భారత్‌-పాక్‌ మ్యాచ్‌ అనగానే అభిమానులు ఎంత ఖర్చైనా పెట్టి ప్రత్యక్షంగా చూసేందుకు సిద్ధపడుతున్నారు. ఇప్పటికే దాయాదుల పోరు జరిగే అహ్మదాబాద్‌లో విమాన ధరలు, హోటల్ ధరలు ఆకాశన్నంటుతున్నాయి. ఈ మ్యాచ్‌ కోసం భారత రైల్వే ప్రత్యేకంగా వందే భారత్ రైళ్లు కూడా నడుపుతోంది.