ఆస్ట్రేలియా ఓపెన్‌(Australian Open 2024)లో టాప్‌ సీడ్‌ల జోరు కొనసాగుతోంది. పురుషుల సింగిల్స్‌లో టాప్‌ సీడ్‌ జకోవిచ్‌(Novak Djokovic), యానిక్‌ సినెర్‌... మహిళల సింగిల్స్‌లో కోకో గాఫ్‌, సబలెంకా(Aryna Sabalenka) సెమీఫైనల్‌కు దూసుకెళ్లారు. టాప్‌ సీడ్లు సెమీఫైనల్‌ చేరడంతో నాకౌట్‌ పోరు హోరాహోరిగా జరగడం ఖాయంగా కనపిస్తోంది.

 

ఎదురేలేని గాఫ్‌.. సబలెంక

మహిళల సింగిల్స్‌ విభాగంలో డిఫెండింగ్‌ ఛాంపియన్, రెండో సీడ్‌ బెలారస్‌కు చెందిన సబలెంకా, నాలుగో సీడ్‌, అమెరికాకు చెందిన  కోకో గాఫ్‌ సెమీఫైనల్లోకి అడుగు పెట్టారు. మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో కోకో గాఫ్‌ 7-6 8-6, 6-7 3-7, 6-2తో కోస్త్యుక్‌పై విజయం సాధించింది. హోరాహోరిగా జరిగిన ఈ మ్యాచులో ఇద్దరు శివంగుల్లా తలపడ్డారు. ప్రతీ పాయింట్‌ కోసం తీవ్రంగా శ్రమించారు. మూడు గంటలా 8 నిమిషాల పాటు సాగిన పోరులో 17 విన్నర్లు కొట్టిన గాఫ్‌.. 51 అనవసర తప్పిదాలు చేయగా.. 39 విన్నర్లు బాదిన కోస్త్యుక్‌ 8 డబుల్‌ ఫాల్ట్స్‌ చేసింది. నిరుడు యూఎస్‌ ఓపెన్‌ గెలిచిన తర్వాత గాఫ్‌కు గ్రాండ్‌స్లామ్‌ టోర్నీల్లో ఇది వరుసగా 12వ విజయం కావడం విశేషం. క్వార్టర్‌ ఫైనల్లో సబలెంకా 6–2, 6–3తో తొమ్మిదో సీడ్‌ క్రిచికోవా (చెక్‌ రిపబ్లిక్‌)పై, కోకో గాఫ్‌ 7–6 (8/6), 6–7 (3/7), 6–2తో మార్టా కొస్టుక్‌ (ఉక్రెయిన్‌)పై విజయం సాధించారు. క్రిచికోవాతో 71 నిమిషాల్లో ముగిసిన మ్యాచ్‌లో సబలెంకా నాలుగు ఏస్‌లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్‌ చేసింది. సెమీస్‌లో కోకో గాఫ్‌- సబలెంక మధ్య మ్యాచ్‌ జరగనుంది. ఈ మ్యాచ్‌ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 

జోకో జోరు మాములుగా లేదు

తనకెంతో కలిసొచ్చిన ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్‌ నొవాక్‌ జొకోవిచ్‌ రికార్డు స్థాయిలో 11వ సారి ఆస్ట్రేలియా ఓపెన్‌ సెమీఫైనల్‌కు చేరాడు. గతంలో సెమీస్‌కు చేరిన పదిసార్లు.. ఫైనల్లో అడుగుపెట్టడంతో పాటు టైటిల్‌ నెగ్గిన జొకోవిచ్‌.. ఈసారి కూడా సేమ్‌ సీన్‌ రిపీట్‌ చేసేందుకు తహతహలాడుతున్నాడు. 

 

సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో టాప్‌ సీడ్, ప్రపంచ నంబర్‌వన్‌ జొకోవిచ్‌ 7–6 (7/3), 4–6, 6–2, 6–3తో 12వ సీడ్‌ అమెరికాకు చెందిన టేలర్‌ ఫ్రిట్జ్‌పై గెలుపొందాడు. 3 గంటల 45 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో జొకోవిచ్‌ 20 ఏస్‌లు సంధించాడు. 52 విన్నర్స్‌ కొట్టిన జోకో నెట్‌ వద్దకు 20 సార్లు దూసుకొచ్చి 13సార్లు పాయింట్లు గెలిచాడు. 36 ఏళ్ల జొకోవిచ్‌ ఈ టోర్నీలో గతంలో సెమీఫైనల్‌ చేరిన 10 సార్లూ విజేతగా నిలిచాడు. మరో క్వార్టర్‌ ఫైనల్లో నాలుగో సీడ్‌, ఇటలీకి చెందిన యానిక్‌ సినెర్‌ తొలిసారి ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌లో సెమీఫైనల్‌ బెర్త్‌ను ఖరారు చేసుకున్నాడు. క్వార్టర్‌ ఫైనల్లో సినెర్‌ 6–4, 7–6 (7/5), 6–3తో ఐదో సీడ్‌ రుబ్లెవ్‌ (రష్యా)ను ఓడించి సెమీఫైనల్లో జొకోవిచ్‌తో పోరుకు సిద్ధమయ్యాడు.