APL League :  ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) లాగా త్వరలో ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (APL) జరగబోతోంది. ఐపీఎల్ లాగానే ఇది కూడా ఫ్రాంచైజీ రూపంలో జరుగుతుంది. అన్ని టీమ్ లకు ప్లేయర్లను సెలక్ట్ చేసుకున్నారు. ఇక్కడ కూడా ఆటగాళ్లను వేలంలో కొన్నారు. వారితో జులై 6 నుంచి 17 వరకు APL మ్యాచ్ లు జరుగుతాయి. అయితే ఈ మ్యాచ్ లకు నెల్లూరుకి చెందిన ఆరుగురు క్రీడాకారులు ఎంపికవడం విశేషం. నెల్లూరులో ఏసీ స్టేడియంలో క్రికెట్ ప్రాక్టీస్ చేసిన వీరంతా.. ఇప్పుడు ఆంధ్రా ప్రీమియర్ లీగ్ లో తమ సత్తా చూపించేందుకు రెడీ అవుతున్నారు. వీరందరిలో సీనియర్ అశ్విన్ హెబ్బార్. 


ఆరు జట్లు


జూన్ 24న వైజాగ్ లోని వైఎస్సార్ స్టేడియంలో APL వేలం జరిగింది. ఒక్కో ఫ్రాంచైజీ వాల్యూ రూ.30 లక్షలు. APLలో ఉత్తరాంధ్ర లయన్స్‌, వైజాగ్ వారియర్స్, గోదావరి టైటాన్స్, బెజవాడ టైగర్స్, కోస్టల్ రైడర్స్, రాయలసీమ కింగ్స్ అనే జట్లు బరిలోకి దిగుతాయి. క్రికెట్ ప్రేమికులను అలరించడంతోపాటు.. ప్రతిభావంతులైన యువ క్రికెటర్లను వెలుగులోకి తీసుకొచ్చేందుకు ఆంధ్రా క్రికెట్ లీగ్ నిర్వహిస్తున్నారు. 


జులై 6 నుంచి పోటీలు 


ఈ ఆంధ్రా ప్రీమియర్‌ లీగ్‌ (APL)కు నెల్లూరుకు చెందిన ఆరుగురు క్రీడాకారులు ఎంపికయ్యారు. ఐకాన్‌ ప్లేయర్‌గా అశ్విన్‌ హెబ్బార్‌ ను వైజాగ్‌ వారియర్స్‌ టీమ్ దక్కించుకుంది. వచ్చే నెల 6 నుంచి 17వ తేదీ వరకు విశాఖలో ఈ పోటీలు జరుగుతాయి. నెల్లూరుకు చెందిన అశ్విన్‌ హెబ్బార్‌ రూ.8.7లక్షలకు వైజాగ్‌ వారియర్స్‌ దక్కించుకుంది. ఆర్‌.సుబ్రహ్మణ్యం అనే క్రికెటర్ రూ.1.70లక్షలకు సెలక్ట్ అయ్యారు. ఎం.మాధవ్‌ రూ.75వేలు, రోషన్‌ పవన్‌ కుమార్‌ రూ. 50వేలు, సాకేత్‌ రామ్‌ రూ. 50వేలు, అబ్బాస్‌ రూ. 50వేలకు ప్రాంఛైజీలు దక్కించుకున్నాయి. రూ.1.75 లక్షలకు A గ్రేడ్‌ గా, రూ.75వేలకు B గ్రేడ్‌ గా, రూ.50వేలు C గ్రేడ్‌ గా విభజించి వేలం పాట నిర్వహించారు. APLలో ప్రాతినిధ్యం వహిస్తున్న క్రీడాకారులకు నెల్లూరు జిల్లా క్రికెట్‌ సంఘం అభినందనలు తెలిపింది. 



అశ్విన్ హెబ్బార్ ప్రస్థానం ఇదీ 


ఇండియన్ ప్రీమియర్ లీగ్ IPL లో ఢిల్లీ క్యాపిటల్స్‌ లో స్థానం సాధించాడు నెల్లూరు కుర్రాడు అశ్విన్‌ హెబ్బార్‌. అయితే మ్యాచ్ లు ఆడేందుకు అతనికి అవకాశం రాలేదు. అయితే నెల్లూరు నుంచి తొలిసారిగా ఐపీఎల్ కి సెలక్ట్ అయ్యాడన్న ఘనత మాత్రం సాధించాడు. ప్రపంచ వ్యాప్తంగా 1300 మంది క్రీడాకారుల్లో అశ్విన్ పోటీపడి మరీ ఎంపికయ్యాడు. నెల్లూరు ఏసీ స్టేడియంలో గతంలో జరిగిన వేసవి క్రీడా శిక్షణ శిబిరానికి సరదాగా హాజరైన అశ్విన్‌.. తల్లిదండ్రుల సహకారం, ట్రైనర్ల సపోర్ట్ తో క్రమంగా క్రికెట్ పై పట్టు సాధించాడు. జిల్లా నుంచి ఆంధ్రా జట్టుకు ఎంపికై 20కి పైగా రంజీ ట్రోఫీల్లో పాల్గొన్నాడు. ఆల్ రౌండర్ గా పేరు తెచ్చుకుని ఆ తర్వాత పలు రాష్ట్రాల్లో మ్యాచ్ లు ఆడాడు. యూకే లీగ్‌లో హేసైడ్‌ క్రికెట్‌ క్లబ్‌ జట్టు తరపున కూడా బరిలోకి దిగి ప్రతిభ చాటుకున్నాడు హెబ్బార్. ఇప్పుడు ఏపీఎల్ లో తన సత్తా చూపించబోతున్నాడు. హెబ్బార్ తో పాటు మరో ఐదుగురు నెల్లూరు కుర్రాళ్లు కూడా ఏపీఎల్ లో సింహపురి సత్తా చూపించడానికి రెడీ అయ్యారు.