భారత క్రికెట్ జట్టు మాజీ సారథి మహేంద్రసింగ్ ధోని(MS Dhoni)పై ఆర్కా స్పోర్ట్స్(Aarka Sports) డైరెక్టర్లు పరువు నష్టం దావా వేశారు. తమపై తప్పుడు ఆరోపణలు చేసి పరువుకు భంగం కలిగించినందుకు ధోని నష్టపరిహారం చెల్లించాలని  మిహిర్ దివాకర్ , సౌమ్య దాస్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. తమపై అవాస్తవాలను ప్రచారం చేయకుండా సామాజిక మాధ్యమాలు, మీడియా సంస్థలను నిలువరించాలని కోరారు. ఆర్కా స్పోర్ట్స్ డైరెక్టర్ల అభ్యర్థనపై ఢిల్లీ హైకోర్టు నేడు విచారణ జరపనుంది. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అకాడమీలు ఏర్పాటు చేసేందుకు ఆర్కా సంస్థ 2017లో ధోనీతో ఒప్పందం చేసుకుంది. తర్వాత ఆ ఒప్పందంలోని షరతులను పాటించడంలో కంపెనీ విఫలమవడంతో ధోనీ వైదొలిగారు. అనంతరం తనకు రావాల్సిన చెల్లింపులపై ఆయన కోర్టును ఆశ్రయించారు. ఒప్పందాన్ని ఉల్లంఘించి ఆర్కా స్పోర్ట్స్ చేసిన మోసంతో ధోనికి 15 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ఆయన తరఫు న్యాయవాది వెల్లడించారు. ఈ వ్యవహారం కోర్టులో ఉండగానే. ధోనీ తరఫు న్యాయవాది మీడియాతో మాట్లాడటాన్ని తప్పుపట్టిన ఆర్కా స్పోర్ట్స్ డైరెక్టర్లు..తమ ప్రతిష్ఠ దెబ్బ తీశారంటూ దావా వేశారు. 



ఇంతకీ ఏం జరిగిందంటే..?
ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అకాడమీలు ఏర్పాటు చేసేందుకు.. ఆర్కా స్పోర్ట్స్‌ అండ్‌ మేనేజ్‌మెంట్ లిమిటెడ్‌ సంస్థ 2017లో ధోనీతో ఒప్పందం చేసుకుంది. దీని ప్రకారం ఆర్కా స్పోర్ట్స్‌..ఫ్రాంఛైజీ ఫీజులు, లాభాల్లో వాటాను క్రికెటర్‌కు చెల్లించాల్సి ఉంటుంది. ఫ్రాంచైజ్ ఫీజు, లాభాల్లో వాటా ఇస్తామ‌ని అగ్రిమెంట్‌లో రాసుకున్నారు. కానీ నిబంధ‌న‌ల‌ను తుంగ‌లో తొక్కుతూ మ‌హీ భాయ్‌ను ఈ సంస్థ మోసం చేసింది. అయితే, ఈ ఒప్పందంలోని షరతులను పాటించడంలో ఆర్కా స్పోర్ట్స్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ లిమిటెడ్‌ కంపెనీ విఫలమైంది. దీనిపై ఆర్కా స్పోర్ట్స్‌ య‌జ‌మాని మిహిర్ దివాక‌ర్‌, సౌమ్యా విశ్వాస్‌లతో చర్చించినా ఫలితం లేకపోవడంతో.. ఆ ఒప్పందం నుంచి ధోనీ వైదొలిగారు. 2021 ఆగస్టు 15న ఆర్కా స్పోర్ట్స్‌కు ఇచ్చిన అథారిటీ లెటర్‌ను ఆయన రద్దు చేసుకున్నారు. అనంతరం పలుమార్లు లీగల్‌ నోటీసులు పంపించినా ఎలాంటి స్పందన రాకపోవడంతో ధోనీ తాజాగా కోర్టును ఆశ్రయించారు. ధోనీ ఫిర్యాదుతో మిహిర్ దివాక‌ర్‌, సౌమ్యా విశ్వాస్‌ల‌పై క్రిమినల్‌ కేసు న‌మోదు చేశారు. . మరోవైపు ధోనీ మోస పోవడం పట్ల పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ధోనీ నమ్మిన వారు చీట్ చేశారని పలువురు అంటుండగా..దీనీనే బోల్తా కొట్టించారని ఇంకొంత మంది వ్యాఖ్యానిస్తున్నారు. 


ఐపీఎల్‌కు సిద్ధమవుతున్న ధోనీ
అద్భుతమైన కెప్టెన్సీతో ఇప్పటికే అయిదుసార్లు చెన్నై జట్టుకు కప్పు అందించిన ధోనీ ఆరోసారి ఐపీఎల్‌ ట్రోఫీ అందించాలని పట్టుదలగా ఉన్నాడు. ఈసారి ఐపీఎల్‌లో మరోసారి తనసత్తాను చూపేందుకు తలైవా సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలో ఐపీఎల్ 2024 టోర్నీకి సంబంధించి ధోనీ ప్రాక్టీస్ ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ తలైవా వచ్చేశాడోచ్ అని కామెంట్లు చేస్తున్నారు. ఐపీఎల్ 2023 తరువాత  ధోనీ ఐపీఎల్ నుంచి తప్పుకుంటారని ప్రచారం జరిగింది. గతేడాది టోర్నీ సమయంలో ధోనీ మోకాలి గాయంతో తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. ఐపీఎల్ 2024 టోర్నీలో ఎంఎస్ ధోనీ పాల్గొనడంపై సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే ధోనీ ఫిట్ గా ఉన్నాడని, రాబోయే సీజన్ లో ఐదుసార్లు విజేతగా నిలిచిన సీఎస్కే జట్టుకు నాయకత్వం వహిస్తాడని చెన్నై సూపర్ కింగ్స్ సీఈఓ కాశీ విశ్వనాథన్ స్పష్టం చేశాడు